Jul 07,2023 06:58

దేశవ్యాప్తంగా 13. 6 లక్షల అంగన్వాడీ సెంటర్లో 26 లక్షల మంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు 10 కోట్ల మంది లబ్ధిదారులకు అనునిత్యం సేవలు అందిస్తున్నారు. ఇలాంటి కీలకమైన బాధ్యతలు నిర్వహించే అంగన్వాడీలకి ఉద్యోగ భద్రత కరువాయె.

          దేశ భవిష్యత్తును నిర్దేశించేటటువంటి పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అనుబంధ పోషకాహారం అందించడం, ఆరోగ్య సలహాలిచ్చి, పిల్లల్ని బడికి అలవాటు చేసే లక్ష్యంతో ఐసిడిఎస్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ లక్ష్య సాధనలో అంగన్వాడీల కృషి అమోఘం. ప్రభుత్వ పథకాలు అమలు వివిధ రకాల సర్వేల్లో వీరిదే కీలక పాత్ర. దేశవ్యాప్తంగా 13. 6 లక్షల అంగన్వాడీ సెంటర్లో 26 లక్షల మంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు 10 కోట్ల మంది లబ్ధిదారులకు అనునిత్యం సేవలు అందిస్తున్నారు. ఇలాంటి కీలకమైన బాధ్యతలు నిర్వహించే అంగన్వాడీలకి ఉద్యోగ భద్రత కరువాయె. ఈ పరిస్థితుల్లో అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ఆలిండియా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 10, 11 తేదీలలో 36 గంటల పాటు ఏకబిగిన ధర్నా చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది
           ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో 80 శాతం బాలలు కటిక దారిద్య్రంలో మగ్గుతున్నారు. యునిసెఫ్‌ నివేదిక ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు 122 మంది బాల్య దశలోనే చనిపోతున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి ప్రభావం బాలల భవిష్యత్తుపై తీవ్రంగా చూపుతున్నది. ప్రపంచ ఆరోగ్య నివేదిక ప్రకారం రెండున్నర కోట్ల మంది బిడ్డలు పుడితే వారిలో సుమారు 13 లక్షల మంది 28 రోజుల్లోనే చనిపోతున్నారు.
కేంద్రంలో బిజెపి అధికారంలో కొచ్చేముందు ఐసిడిఎస్‌ని బలోపేతం చేస్తామని చేసిన వాగ్దానాన్ని విస్మరించి 9 సంవత్సరాలుగా ఐసిడిఎస్‌ పథకానికి కేటాయింపులపై కోత పెడుతూ వస్తోంది. వేదాంత, ప్రథమ, వంటి స్వచ్ఛంద సంస్థలకు అంగన్వాడీ సెంటర్ల పర్యవేక్షణ బాధ్యతను అప్పగించింది. ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఐసిడిఎస్‌ లక్ష్యానికి విరుద్ధంగా 2020లో నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. దీనికి మన రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం వత్తాసు పలుకుతూ 172 సర్క్యులర్‌ను తీసుకొచ్చింది. అంగన్‌వాడీ సెంటర్లను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయాలని, పిపి1, పిపి2 ప్రారంబించాలని, ఫౌండేషన్‌ స్కూల్స్‌గా మార్చాలని రకరకాల జిమ్మిక్కులు చేస్తోంది. అంగన్‌వాడీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో కొంత వెనక్కి తగ్గినట్లు కనిపించినా తన ప్రయత్నం మానుకోలేదు. విలీనాల సర్క్యులర్‌ను రద్దు చేయలేదు.
         ప్రపంచంలో భారతదేశం ఆకలి మరణాల సూచీలో 107వ స్థానానికి దిగజారింది. అయినా 2023-24 కేంద్ర బడ్జెట్‌లో ఆహార భద్రతకి రూ. 90 వేల కోట్ల మేర కోత పడింది. పేద గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు ఉపయోగపడుతున్న ఐసిడిఎస్‌ పథకానికి నామమాత్రంగా రూ.20, 554.31 కోట్లు కేటాయించారు. ఇది ఏమూలకూ చాలదు. 2017 నుండి టిఎ బిల్స్‌ ఇవ్వలేదు. సెంటర్ల నిర్వహణకు అంగన్‌వాడీలే పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితికి నెట్టబడ్డారు.
          లబ్ధిదారుల లిస్టులు తగ్గించటానికి పోషణ ట్రాకర్‌ యాప్‌ను తీసుకొచ్చారు. ఆధార్‌ను లింక్‌ చేశారు. దాదాపు 30శాతం చిన్న పిల్లలకి ఆధార్‌ కార్డుల్లేవు. ఆధార్‌ కార్డులు తీసుకోవాలని అంగన్వాడీల మీద ఒత్తిడి పెంచారు. అంగన్‌వాడీలకు ఎటువంటి ట్రైనింగ్‌ లేకుండానే ఆన్‌లైన్‌ పని ప్రారంభించారు. ఫోన్‌లు పని చేయక పోవడం, ఆన్‌లైన్‌ వర్క్‌ చేయడానికి అవసరమైన నెట్‌ సిగల్స్‌ లేకపోవటం వలన మానసిక ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతున్నారు.
          ప్రభుత్వ విధానాల వలన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, విద్యుత్‌, నిత్యావసర వస్తువుల ధరలు అనేక రెట్లు పెరిగాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు వేతనాలను పెంచాల్సి ఉంది. కానీ, 2011 నుండి కేంద్రప్రభుత్వం ఒక్క పైసా కూడా పెంచలేదు. అంగన్‌వాడీలు పోరాటాల ఫలితంగా 2018లో మోడీ దీపావళి కానుకగా వర్కర్‌కి 1,500, హెల్పర్‌కి 750, మినీలకి 1,250 రూ. వేతనాలు పెంచుతానని దీపావళి కానుకగా ప్రకటించింది. కానీ, ఇంతవరకు అది అమలుకునోచుకోలేదు. 2022 ఏప్రిల్‌ 25న సుప్రీంకోర్టు అంగన్వాడీ ఉద్యోగులు 1972 చట్టం ప్రకారం గ్రాట్యుటీకి అర్హులే అని ఇచ్చిన తీర్పును అమలు చేయట్లేదు.
 

                                    తెలంగాణా కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామన్న హామీ నిలబెట్టుకోవాలి

తెలంగాణా కన్నా అదనంగా వెయ్యి రూపాయలు వేతనాలు పెంచుతానన్న ముఖ్యమంత్రి హామీ నీటి మీద రాతగానే మిగిలిపోయింది. 2021 పిఆర్‌సి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు 30 శాతం వేతనాన్ని పెంచింది. మాట తప్పను-మడమ తిప్ప నన్న ముఖ్యమంత్రి అంగన్వాడీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ మార్చి 20 'ఛలో విజయవాడ'కు వచ్చిన అక్క, చెల్లెమ్మలను అవమానించే విధంగా ఇళ్లకు పోలీసులను పంపారు. తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించారు. ఇన్ని నిర్బంధాల మధ్య కూడా వేలాదిమంది విజయవాడకు వచ్చి గళమెత్తారు, అంగన్‌వాడీల ఆవేదనను పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలు శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీశారు. అంగన్‌వాడీలతో మాట్లాడి సమస్యల పరిష్కరిస్తామని ఆ సందర్భంగా ఐసిడిఎస్‌ మంత్రి ఇచ్చిన హామీ నేటికి అమలుకాలేదు. పక్కనే ఉన్న కర్ణాటక, గుజరాత్‌ లో గ్రాట్యూటి అమలుచేస్తున్నారు. తమిళనాడులో బేసిక్‌ అమలుచేస్తున్నారు. ఇటీవల కాలంలో మహారాష్ట్ర హర్యానా తదితర రాష్ట్రాల్లో వేతనాలు పెరిగాయి. కానీ మన రాష్ట్రంలో పెరగలేదు.
 

                                                  వైఎస్సాఆర్‌ సంపూర్ణ పోషణ మెనూ, మెనూ చార్జీలు పెంచాలి

ముఖ్యమంత్రి మానస పుత్రికని కొండంత రాగం తీస్తూ గర్భిణీలు, బాలింతలకు సెంటరులో వేడి వేడిగా ఆహారాన్ని అందించాలని 'వైయస్సార్‌ సంపూర్ణ పోషణ' పథకాన్ని ప్రారంభించారు. ఏ రోజు ఏమి వండి పెట్టాలో మెనూ తయారు చేశారు. గర్భిణీలు బాలింతలకు ఇస్తున్న ఆహారం సరిపోవటం లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా కేటాయింపులు పెంచలేదు. గర్భిణీ, బాలింతలకు 125 గ్రాముల బియ్యం, 16 గ్రాముల నూనె, 30 గ్రాముల కందిపప్పు, కూరగాయలు, పోపు సామానులకు కలిపి ఒక్కొక్కరికి 1.40 పైసలు, గ్యాసుకు 0.50 పైసలు మాత్రమే ఇస్తున్నారు. పిల్లలకు ఒక్కొక్కరికి 75గ్రాముల బియ్యం, 5 గ్రాముల నూనె, 15గ్రాములు కందిపప్పు, గ్యాస్‌కు 50 పైసలు ఇస్తున్నారు. కనీసం రోజుకి సెంటర్లో 20 మంది గర్భిణీలు, బాలింతలకు వేడి వేడి ఆహారం అందించడానికి గ్యాస్‌కు ఇస్తున్నది రూ.10.00/- లు మాత్రమే. నెలకు రూ.250 వస్తాయి. కూరగాయలు, చింతపండు, కారం, ఉప్పు, పోపుదినుసులు అన్నింటికీ కలిపి రోజుకు రూ.28 నెలకు రూ. 700 ఇస్తారు. 2017 నుండి టీఏ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సెంటరు అద్దెలు 4 నెలల నుండి ఇవ్వడం లేదు. నెలనెలా వేతనాలు వచ్చే పరిస్థితి లేదు. సెంటర్ల నిర్వహణకు అధిక వడ్డీలకి అప్పులు తెచ్చి నడపటంవల్ల అంగన్వాడీలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.
 

                                                                 సంక్షేమ పథకాలు అమలుచెయ్యాలి

అందరికీ బటన్‌ నొక్కి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నానని ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారు. అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, అతి తక్కువ వేతనం ఇస్తారు. సంక్షేమ పథకాల దగ్గరకొచ్చేసరికి మీరు సిఎఫ్‌ఎంఎస్‌లో వేతనాలు తీసుకుంటున్నారు కాబట్టి ఆ పథకాలకు మీరు అర్హులు కారని చెబుతున్నారు. అర్హత ఉన్న కుటుంబ సభ్యులకు కూడా అమలు చెయ్యట్లేదు. వికలాంగులు, వితంతువులకూ ఇవ్వడం లేదు. రిటైరయిన హెల్పర్‌కు రూ. 20 వేలు, వర్కరుకు 50 వేలు మాత్రమే ఇస్తున్నారు. పెన్షన్‌ లేదు. వద్ధులకు ఇస్తున్న పెన్షన్‌ కూడా ఇవ్వడం లేదు. పదవీ విరమణ వయసును ఉద్యోగులందరికీ 62 సంవత్సరాలకు పెంచినా అంగన్వాడీలకు మాత్రం పెంచలేదు.
         

హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యం అరికట్టాలి : అంగన్వాడీ సెంటర్‌కి వచ్చే ప్రీ స్కూల్‌ పిల్లలకు అమ్మ తరువాత అమ్మలా హెల్పర్లు అనేక సేవలుఅందిస్తున్నారు. అదే సెంటర్లో ఖాళీ అయితే హెల్పర్లకు ప్రమోషన్‌ ఇవ్వాలని జీవో ఉంది. కానీ జీవోని అమలు చేయకుండా కొన్నిచోట్ల రాజకీయ నాయకులు అధికారులు అడ్డుపడుతున్నారు. కుప్పం ప్రాజెక్టులో దాదాపు పది మంది హెల్పర్లకు ప్రమోషన్‌ అర్హత ఉన్నప్పటికీ ప్రమోషన్‌ ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. పార్వతీపురంలో ప్రమోషన్‌ ఇచ్చినా కూడా జాయిన్‌ కాకుండా రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారు. చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం సహా అనేక జిల్లాల్లో ప్రమోషన్లు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో రాజకీయ జోక్యం అరికట్టాలని కోరుతున్నాం.

                                                          మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలి

రాష్ట్రంలో 5,605 మినీ సెంటర్లు నడుస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో, మారు మూల గ్రామీణ ప్రాంతాల్లో పేద గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు మినీ వర్కర్లు సేవ చేస్తున్నారు. 400లోపు జనాభా ఉంటే మినీ సెంటర్లు నడవాలి. కానీ మన రాష్ట్రంలో 1,000, 1,200 మంది జనాభా ఉన్న అనేక ప్రాంతాల్లో మినీసెంటర్లుగానే నడుస్తున్నాయి. మినీ వర్కర్లకు కనీసం వేసవి సెలవులు ఇవ్వడంలేదు. ప్రమోషన్లు ఇవ్వాలని జీవో ఉన్నా కూడా అమలు కావట్లేదు. దీంతో మినీ వర్కర్లు అనేక ఇబ్బందులు పడు తున్నారు.
 

                                                                 విజిట్‌ ల పేరుతో వేధింపులు ఆపాలి

అంగన్‌వాడీలకు ఇచ్చిన సెల్‌ఫోన్లు పనిచెయ్యటంలేదు. రకరకాల యాప్‌లు తెచ్చారు. పనిభారం పెరిగింది. ప్రకాశం జిల్లా టంగుటూరు ప్రాజెక్టులోని హనుమాయమ్మను రాజకీయ కక్షతో నిర్దాక్షణ్యంగా చంపారు. కనీసం మట్టి ఖర్చులు ఇచ్చే దిక్కు కూడా లేదు. కృష్ణాజిల్లా పామర్రు ప్రాజెక్టులో అన్నపూర్ణ అనే అంగన్‌వాడీ వర్కర్‌ను వైసిపి నాయకులు వేదింపులు, సిడిపిఓ బలవంతంగా లెటర్‌ వ్రాయించుకున్న ఫలితంగా ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని నేడు విజయవాడలో చికిత్స పొందుతున్నది.ఈ నేపధ్యంలో ఈ క్రింది అంగన్‌వాడీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 10 , 11 తేదీల్లో 36 గంటలు (పగలు, రాత్రి) కలెక్టర్‌ కార్యాలయాల వద్ద జరిగే ఆందోళనలను అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిన అవసరముంది.
 

డిమాండ్స్‌ :
1. అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి.
2. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటి ఇవ్వాలి.
3. రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ 5 లక్షలు ఇవ్వాలి, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలి.
4. అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చెయ్యాలి.వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ సౌకర్యం కల్పించాలి.
5. హెల్పర్ల ప్రమోషన్‌లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలి. ప్రమోషన్లో రాజకీయ జోక్యం అరికట్టాలి.
6. 300 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలి. వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి. మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి.
7. అంగన్‌వాడీ విద్యను బలోపేతం చెయ్యాలి. పిల్లలకి యూనిఫామ్‌, అమ్మఒడి అమలు చెయ్యాలి.
8. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలి. గ్యాసును ప్రభుత్వమే సరఫరా చెయ్యాలి.2017 నుండి పెండింగ్‌లో ఉన్న టిఎ బిల్లులు వెంటనే ఇవ్వాలి.
9. సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, భీమా అమలుచెయ్యాలి.
10. లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలి, ఆయిల్‌,కందిపప్పు క్వాంటిటీ పెంచాలి.
11. సీనియారిటీ ప్రకారం వేతనాలు ఇవ్వాలి,
12. హత్యకి గురైన హనుమాయమ్మ కుటుంబంలో ఒకిరికి ఉద్యోగం ఇవ్వాలి. నష్టపరిహారం చెల్లించాలి.
13. గ్రేడ్‌ || సూపర్‌ వైజర్‌ పోస్టులకు వయోపరిమితి తొలగించాలి.2022 లో పరీక్ష రాసి పెండింగ్‌లో ఉన్న గ్రేడ్‌ || సూపర్‌వైజర్‌ పోస్టులలో మిగిలిన 164 పోస్టులను వెంటనే భర్తీ చెయ్యాలి.
 

(వ్యాస రచయిత అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
కె.సుబ్బరావమ్మ

కె.సుబ్బరావమ్మ