Sep 11,2022 07:36

ఎన్నెన్ని బాధలు పడింది తను!? తల్లి లేని తనకు దేవుడు సుఖాల కలబోతకి బదులుగా మరిన్ని కష్టాలనిచ్చి అన్యాయం చేశాడేమోనన్న అనుమానం అస్తమానం మెదడులో పురుగులా తొలిచేయసాగింది. తరతరాలుగా వస్తున్న వ్యవసాయాన్ని నమ్ముకున్న కుటుంబం తమది. దానిపైనే ఆధారపడి బతుకు వెళ్లదీస్తున్నారంతా! బసిరెడ్డి ఇంట కోడలువైతే అదృష్టం తమదౌతుందన్న విశ్వాసంతోనే తండ్రి ఆ కుటుంబంలో మనిషిని చేశాడు. కానీ విధి కన్నెర్ర చేసింది. ఉన్న ఆరెకరాల పొలంలో వేసిన పంట చేతికి అందాల్సింది పోయి, అప్పులను మిగిల్చింది.
ఒకనాటి రత్నాలసీమ ఈనాడు ఒక్క వానచుక్క లేక నెర్రెలుబారిన నేలగా మారి వెక్కిరించింది. వేసిన పంటంతా వృథా అయ్యి, చేసిన అప్పులు తీర్చమంటూ ఇంటి మీదబడ్డ వాళ్లకు సమాధానమిచ్చే వ్యక్తి తనయ్యింది.
'ఏంది బసిరెడ్డికి ఏమయ్యింది? అప్పిచ్చి ఏడాదైపోయె! వడ్డీలన్నా కట్టకపోతిరి.. ఇక ఊర్కొనేది లేదంతే!' అంటూ ఇంటిమీదకి పడి, అరుపులరిచే బాపతులే ఎక్కువైనారు. తీర్చేందుకు చేతిల సొమ్ము లేకుండపోయె! వాళ్లకేదో సర్ది చెప్పడానికి ప్రయత్నించినా సరే ఊరకుక్కలల్లే అరుపులే అరుపులు!! అది తట్టుకోలేక తలుపులు బిడాయించేది తను.. ఐనప్పటికీ వదిలిపెట్టేవారే కాదు. ఒకరా ఇద్దరా.. అప్పులిచ్చినవాళ్లు ఐదారుగురు.
బయట నుండి బైకు హారన్లు మోగించుకుంటూ ఒకటే హడావుడి. తలుపు తెరవకపోతే ఒకటే బెదిరింపులు. మామయ్య బసిరెడ్డి వచ్చి, వాళ్ల కాళ్లావేళ్లా పడినా ఫలితం శూన్యమయేది. వాళ్ల వేధింపులెక్కువయే బసిరెడ్డి ఒక అర్ధరాత్రి ఉరేసుకున్నాడు. విషయం తెలిసి అత్త శివాలమ్మ బోరుబోరున ఏడ్చింది. ఇల్లంతా విషాదం కమ్ముకుంది. అంతటి విచారంలోనూ అప్పులోళ్లు వదిలిపెట్టలేదు. అప్పు తీర్చకుండా ప్రాణం తీసుకున్నందుకు గయ్యిమంటూ తాడెత్తున లేచారు. పాడె కదపడానికి ఎంత తంటాలైందో చెప్పలేం. పోలీసోళ్లు కల్పించుకున్నాకనే శవం బూడిదైంది.
అత్త శివాలమ్మ శోకమింకా ఇంకనైనా లేదు. మరో పిడుగు నెత్తిమీద పడ్డది. తన మరిది అంకిరెడ్డి కూడా బావిలోకి దూకినాడు. ఇది తెలిసి అప్పులోళ్లు మరింతగా రెచ్చిపోయి, తన భర్త సిమ్మాద్రిపైన పడ్డారు. నువ్వంటే నువ్వంటూ పోరుకు దిగారు. ఉన్నపళంగా బాకీలు తీర్చడానికి చిల్లిగవ్వ లేకపోయె. కడుపుల నింపుకోడంకే తెగ ఇబ్బందైంది. ఇక మూడెకరాల పొలం రాసిస్తే తప్ప అప్పులు తీరేలాగ లేదని శివాలమ్మ చెబితే తప్ప, భర్త సిమ్మాద్రి తోవలోకి రాలేదు.
ఈనాడంటే చినుకు చుక్కలు రాలక కన్నీళ్లు మిగిల్చిందిగాని.. ఇదివరకల్లా పంట పండించిన పొలమే అది. ఉన్న పొలంలో కొంత మేలైన పొలం అప్పులోళ్ల చేతికి చిక్కడంతో సిమ్మాద్రికి మనసంతా కకావికలైందన్న సంగతి తనకు బాగా ఎరికైంది. 'సావాలనుంది గవిరీ! ఈ కట్టాలు నేను తట్టుకోలేకపోతున్నా..' అంటూ ఒకటికి పదిసార్లన్నా అన్నప్పుడు తనే ధైర్యమిచ్చి 'సచ్చాక ఏం సాధిస్తాం మావా? బతికుండే మన బతుకుల్ని సక్క చేసుకోవాల..' అనేది.
ఐనప్పటికీ ఆ దేవుడికి దయ లేదేమో! ఒకరోజున రోడ్డు దాటుతున్న సిమ్మాద్రిని లారీ రూపంలో కాటేసింది. పొగిలి పొగిలి ఏడ్చింది తను. ఇక అత్త శివాలమ్మ రోదనలకు అంతులేకుండా పోయింది. మూలస్తంభాల్లాటి ముగ్గురూ మృత్యువాత పడి, కుటుంబంలోంచి మాయమయ్యారు. ఇక తనొక్కతే దిక్కు అత్తమ్మకి. సాగుబడినిచ్చే పొలం అప్పులవాళ్ల పాలయింది. ఇక ఒక్క నెర్రెలుబారిన చౌడు భూమే మిగిలింది.
'అమ్మా!ఈ పరిస్థితిలో నువ్వీడనుండడం సేమం కాదు.. నీ పెనిమిటా పోయిండు.. సాగు సేయడాన్కి బూములా లేకుండాబోయె! ఇక ఎవరికోసమీడుండాల..? కాసిన నీ ఒక్క బిడ్డను ఎత్తుకుని, నా వెంట రా.. సిన్ననాడే మీయమ్మ పోయినాది.. నువ్వు నాకేమీ బరువుగాదు. నిన్ను తీసుకెల్డానికే ఈడకొచ్చిన..' అన్న తండ్రి కన్నారెడ్డి మాటలకు గతంలోంచి ఊడిపడింది గౌరి.
తండ్రి పిలుపుకి పొంగిపోయి కష్టాన్నంతటినీ మరచిపోయి, వెంట వెళ్లిపోవడానికి ఆమె మనసు ఎంతమాత్రం ఇచ్చగించలేదు. తమకు పుట్టిన బిడ్డ, కన్నబిడ్డ కంటే ఎక్కువగా ఇంతవరకు తనను సాకిన అత్తమ్మ ఇద్దరూ తనకు బరువు కారు. కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఇంతదాకా సేవ చేసిన పుణ్యమూర్తుల్లాంటి ముగ్గురూ మృత్యువాత పడ్డారని తన దారి తను చూసుకుని వెళ్లిపోవడం ఎంతమాత్రం ధర్మం కాదనిపించింది గౌరికి. తండ్రి వెంట పోవడానికి మనసు రాలేదు.
'ఈ పరిత్తితిలో అత్తమ్మను నిర్దయగా వదిలిపెట్టి రాలేను.. నాక్కొంత గడువివ్వు.. సావోరేవో ఈడనే తేల్సుకుంటాను.. బూమంటూ ఏదో ఒకటుందిగా.. దాన్నే ఏదోలా దారికి తెస్తాను..' గుండె ధైర్యం తెచ్చుకుని అన్నది గౌరి.
తండ్రి కన్నారెడ్డి 'అదేం బూమి!? అంతా సౌడు నేల.. చినుకుల్లేక నెర్రెలు బడ్డది. దానికేం నూకలొస్తాయంట? దాన్నిబట్టుకుని ఈదులాడ్తావా? అత్తింట మూడు కలేబరాల్లేచాయి. కుటుమానంకి శని పట్టింది. నువ్వు కూడా ఈడుండి దాన్ని అంటించు కుంటావా?' అని ఎద్దేవా చేస్తూ కోపం ప్రదర్శించాడు.
తండ్రి అభిమానంతో పిలిచిన పిలుపుకంటే అక్కసుతో అన్న మాటలే మదిని బాధతో మెలిపెట్టాయి. 'ఐతే నీ సావు నువ్‌ సావు..' అంతే కోపంతో వెనుదిరిగాడు. అలా వెళ్లిన మనిషి మరి అయిపు లేడు.
'మీ అయ్య మాటను నువ్‌ కాతర్సేయలేదు. మరిప్పుడు ఈడుండి ఏమి సేత్తావ్‌? యవసాయమంటే మాటలు కాదు. బీడువోరిన బూమిని పంట సేనుగా మార్సడం నీ వల్లనవుద్దా?' అన్న అత్త శివాలమ్మ మాటలకు జంకలేదు.
ఊళ్లో వాళ్లు కూడా అవే వెటకారపు మాటలు. 'ఈడుండి మీ అత్తకి సాయం సేత్తానంటే ఉండు.. ఎవసాయమంటూ పట్టుబట్టినావంటె కుదరదు.. పొలం ఎంతకో కొంతకు అమ్మి పారెరు.. దాని మూలకంగానే నీ పెనిమిటితో పాటు మూడు శవాల్లేసినారు!' వాళ్ల సూటిపోటి మాటలేమాత్రం రుచించలేదు గౌరికి.
ఏ వ్యవసాయాన్నైతే ఇంతకాలం నమ్ముకుని, ఈ కుటుంబమంతా నడిచిందో.. వాళ్లు ఈరోజు లేకున్నా సరే తను మాత్రం దాన్ని ఎంతమాత్రం వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఎంత కాయకష్టం చేసినా.. ఒక కొలిక్కి తీసుకురావాలి.. అదే సంకల్పం గుండెనిండా నింపుకున్నది.
'అత్తమ్మా! నేను ఈడుండను.. ఎవసాయమున్నసోటనే నా బిడ్డతో గడుపుతా. ఎవరికీ నే బారం కాను.. ఉన్న పొలమేదో నేనే ఎట్టాగోలాగున సాగు సేసుకుంటా..' గౌరి ఆ మాటలను మనస్ఫూర్తిగా చెప్పినా తనంటే ఖాతరు లేనట్లు చెప్పినట్లుగానే అనిపించింది శివాలమ్మకు.
'నీ కర్మ.. నీ సెవికెక్కనివి.. ఎవురు సెప్పినా ఒకటే!' అంటూ చీదరించుకున్నది శివాలమ్మ. ఒకరోజున ఉదయాన్నే వెళ్లింది. కనుచూపు మేరలో మూడెకరాల పొలం నెర్రెలు బారింది. ఒకప్పుడు వానలుండి పంటలిచ్చినదే! ఇప్పుడేమో ఇలాగ. ఒక్కసారిగా విచారం కమ్ముకుంది. ఐనప్పటికీ దాన్ని పక్కకు నెట్టేసి.. అక్కడ తనుండడానికి చిన్నశాల వేయడంకి పదమూడేళ్ల బిడ్డ రామిరెడ్డి సాయంతో కొమ్మలు నరికింది. వాటిని గుంజలుగా పాతింది. అక్కడికి దగ్గరలోనే ఉన్న నాంచారయ్యని అడిగితే శాలకి కావలసిన తాటి కమ్మలిచ్చాడు. ఉండడానికి సరిపోయేలాగ నార తడపలతో నేసింది.
'అమ్మీ! ఈడనుంటావా? రాతిరైతే ఇబ్బందికాదా? ఓ వైపు ఎలుగుల బయం.. ఒంటరి ఆడదానివైపోతివి గదాని.. ఈ బీడు బూమినెట్టాగ సాగు సేత్తావోనని మాకే బెంగలాగున్నది. అమ్మి పారేసి నీ పుట్టింటికి పోయినావుగాదా?' అంటూ రైతు నాంచారయ్యతో పాటు చుట్టుపక్కలంతా నిట్టూరుస్తూ అన్నారు.
ఐనప్పటికీ గౌరి దృఢ సంకల్పం ముందవి తీసికట్టయాయి. 'అమ్మా, ఈ పొలమమ్మద్దమ్మా! ఎట్లాగైనా మనమే సాగుసేసుకుందాం..' అన్న బిడ్డ మాటలతో కూడా కొండంత ధైర్యమొచ్చింది.
ఒకరోజు పొలమంతా గాలించినా ఎక్కడా కూడా ఊటబావుల జాడే లేదు. మరి చినుకుల కోసం ఎదురుచూసినా అది ఉత్తి మాటే! ఇక మిగిలింది ఏడైనా బోరు పడుద్దేమోనన్న ఒక్క ఆశ మాత్రం మనసు నిండా వ్యాపించింది. చేతిలో ఉన్న పైసలేమో తినడానికే చాలవైతివి. మరి బోరంటే మాటలు కాదనుకుంది. పక్కనున్న పట్నం పోయింది గౌరి. బ్యాంకోళ్లని కలిసింది. పొలం కాగితాలు చూపించమన్నారు. చూసిన వాళ్లు మర్నాడే వచ్చి చూసినప్పటికీ ఐదార్రోజులు తిప్పించుకుని, ఖరారు చేసి రుణం మంజూరు చేశారు. బోరు మిషనొచ్చింది.. రెండొందల అడుగుల నేలలోకి చొచ్చుకెళ్లి నీరు పడినా అది ఉప్పునీరే. కష్టమంతా వృథా అయింది. కళ్లంట నీళ్లొలికినా సరే పట్టువీడక, పట్నం పరెగెట్టి సర్వేయర్‌ని తీసుకొచ్చి, పొలమంతా గాలించింది. మంచినీటి జాడలున్నది పసిగట్టి బోరు వేశారు. అంతే దేవుడు కరుణించి, నీరు ఎగజిమ్మింది. గుండెల నిండుగా ఊపిరి పీల్చింది.
అక్కడితో ఐపోలేదు. 'ఎద్దుల్లేవు.. ఎట్టా సాగు సేత్తావమ్మా?' అన్న ప్రశ్నకు ఒక్కసారి ఉలిక్కిపడ్డది.. ఎడ్లు కొనాలంటే మాటలు కాదు.. వేలతో పని.. అందుకే తనే కాడిని భుజాలపైన నిలుపుకుంది.. వెనకాతల నాగలి పట్టుకుని, తోడుగా నిలిచాడు బిడ్డడు రామిరెడ్డి.. చేతులు కందేలాగ బోరు ఆడించి, సాళ్లలోకి నీరు పంపారు.
'పెసరపంటకు గిరాకీ ఉంది. అది సాగు సేసి సూడు..' అని నాంచారయ్య చెబితే వేసింది. మూడెకరాల్లోనూ అదే.. ఐతే అనుకోని దురదృష్టం గౌరి ఆశలను తలకిందులు చేసింది. ఏదో చీడపట్టి పంటంతా నాశనమైంది. కళ్లంట రక్తం చుక్కలు చిందినట్లైంది. రామిరెడ్డి తల్లి ద్ణుఖాన్ని చూసి బోరుమన్నాడు. ఐనాసరే మళ్లీ 'ఈసారి మరో పంట మారుద్దామమ్మా!' అని ఒక సలహా.. ఆమెలో ఎక్కడ్లేని ఉత్తేజాన్ని నింపింది. మర్నాడే పట్నంపోయి, సెనగ విత్తనాలు తీసుకొచ్చింది.
'మీ తల్లిబిడ్డా దున్నటానికి బలం సాలదు.. ఎద్దులతోనో.. ఎవురినో ఒకర్ని టాకటేరడిగో.. దున్నిప్పించుకోండి.. బాడుగలైతే అవుతాయి.' అని అక్కడే పొలంలో కనిపించిన సీతాలు చెప్పాక, ప్రయత్నం చేసిందిగాని పొలం పనులు ముమ్మరంగా ఉండటంతో ఎవరూ ఇవ్వడానికి ఒప్పలేదు.
'ఎద్దులు కంటే నువ్వే లోన్‌ పెట్టి, టాకటేరు కొనుక్కోవచ్చు గదా?' అన్న నాంచారయ్య సలహాతో ఒకరోజున బ్యాంకుకు పరిగెట్టింది. మేనేజరు ఆమెను చూస్తూ.. 'మొన్న ఇచ్చిన లోనే ఇంకా తీర్మానం కాలేదు.. మళ్లీ లోనా? పంటలో ఏమాత్రం నీకు కలిసిరాలేదు. మళ్లీ ఒక్కర్తెవీ పొలం సాగు చేస్తానంటున్నావ్‌. ట్రాక్టర్‌ కొనగానే సరిపోదు.. దానికి ఓ డ్రైవర్‌ ఉండాలి.. ఆ కూలినాలి ఇచ్చుకోవడం కూడా నీ నెత్తిన భారమే!' అంటూ పెదవి విరిచాడు.
'లేదయ్యా! ఎట్టాగైనా నా పొలాన్ని ఓ దారికి తేవాలి. తెస్తా కూడా...నాకు మీర్సహాయం సేసి దయసూపండి..' అని ప్రాధేయపడింది గౌరి. చూస్తానని చెప్పి పంపేసినా మళ్లీమళ్లీ తనని కలుస్తున్న గౌరిని చూశాక..'నీ ధైర్యాన్ని, పట్టుదలను చూసే నేను లోన్‌ ఇస్తున్నాను..' అంటూ వెంటనే అన్ని కాగితాలపైన సంతకాలు పెట్టించుకొని, మంజూరు చేశాడు మేనేజర్‌. మర్నాడే ట్రాక్టర్‌ ఊళ్లోకొచ్చింది.
'గౌరి టాకటేరు కొన్నదట.. డైవరెవరో...?' 'అదే నడుపుకుంటాదేమో..!' అంటూ ఒకటే ఎగతాళి. ఆ మాటలనే ఒక జవాబుగా చేసుకొని, ఊళ్లో సాయిబుని బతిమిలాడి రెండురోజులుపాటు డ్రైవింగ్‌ నేర్చుకుంది. పొలం దున్నడానికి సిద్ధమైంది. ఒక ఐదారుసార్లు నడపడానికి కింద మీద ఊపుతాపులు పడ్డది. ఐనప్పటికీ వదల్లేదు. రామిరెడ్డి నేల తడపడానికి బోరు కొట్టేవాడు.. ఇద్దరి ప్రయత్నంతో నేల మెత్తబడ్డది.
రెండునెలల తరువాత ఆమె కష్టానికి మంచి ఫలితం కనబడింది. సెనగపంట మంచి దిగుబడినిచ్చింది. భర్త చనిపోయాక మొట్టమొదటి ఆదాయంతో ఆమె సంతోషానికి అవధుల్లేకుండా చేసింది. ఇక అక్కడితో ఊర్కోలేదు.. పొరుగు రైతుల సమావేశాలకు వెళ్లేది. కొత్తకొత్త పంటలేవి వేస్తున్నారో.. వాటివల్ల కలిగే లాభాలేమిటో.. పెట్టుబడి ఎంతపెట్టాలో కూలంకషంగా తెలుసుకున్నది.. అప్పుడే ఆమె దృష్టి సోయా పంటపైన పడింది. విత్తనాలను సేకరించింది.. ఒక పెద్దాయన ఇచ్చిన సలహాలతో ముందడుగు వేసింది.
'సెనగ పంట పండిందని ముచ్చటపడి సోయా పంట మీద సొమ్ము తగలెడుతోంది. దీనికేం పిచ్చి పట్టలేదు కదా?!' అంటూ ఊళ్లోవాళ్లంతా ఎద్దేవా చేశారు. ఐనా ఆమె దృక్పథం చెదరిపోలేదు. దేవుడు కరుణించి, సోయా పంట విరగపండింది. మంచి లాభమొచ్చింది. ఈ విషయం తెలిసి గ్రామస్థులంతా నోరెళ్లబెట్టారు. తిరిగి వాళ్లే పంట విషయాలను గౌరిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సంగతులన్నీ నాంచారయ్య ద్వారా శివాలమ్మ చెవికి చేరాయి. 'కోడలు వద్దన్నా వినకుండా, మంచి పట్టుదలతో ఒంటరిగానే పోరాడి గెలిచింది..!' అనుకుంటూ గౌరి దగ్గరకే చేరింది. 'అమ్మా, ఏదో కట్టంలో వున్నావని నిన్ను వెనక్కి లాగాను. ఐనా నువ్‌ దైర్నంతో ముందుకెల్నావ్‌. యిపుడెంత సంతోసంగున్నదో. పోనీ పిలగాన్ని ఈ పొలం పనిలో కంటే పెద్ద సదువులోకి పెట్టచ్చుకదా!?' అంటూ సలహా ఇచ్చింది.
'అత్తమ్మా, ఇపుడంతా పుట్టకొక్కుల్లా ఏడజూసినా ఇంజినీర్లే.. ఆల్లు మాతరం ఎంత సంపాయించేత్తున్నారు గనక. ఆల్ల వుజ్జోగాలు ఎపుడూడతాయో తెలవదంట. మన యవసాయాన్ని మించిన నౌకరీ ఏడ వున్నాది. ఎవరి కాల్లు ఒట్టుకోనక్కర్లేదు. ఆ దేవుడి సూపు సల్లగుంటే నాలుగు సినుకులు రాలితే నాపసేను కూడా పండుద్ది. నా బిడ్డడ్ని యవసాయదారుడ్నే సేత్తా. అంతా నౌకరీలు సేత్తే మరి మన కడుపులు నింపే కూడుకి గింజలు పండించేవోల్లెవల్లు? అందుకే.. రామిరెడ్డిని యవసాయమే సేయిత్తా!' అన్న ఆ మాట మీదనే గౌరి నిలబడింది.
ఆమె ధైర్యస్థైర్యాలను చూసి, పత్రికలు గొప్పగా రాశాయి.. ఒక ఒంటరి ఆడది అన్ని కష్టాలకు ఎదురొడ్డి నిలబడి, విజయానికి చేరువైంది. కాలమిలా ముందుకి సాగుతుండగానే ఓ రోజున గ్రామ ప్రెసిడెంట్‌ యెన్నంరెడ్డి వచ్చి 'అమ్మాగౌరీ! ఈ సంవత్సరం నీకు ''ఉత్తమ రైతు''గా ప్రభుత్వం అవార్డిచ్చినాదమ్మా! అది తీసుకోడానికి నువ్వు ఢిల్లీ వెళ్లాలి. ఇదిగో నీకొచ్చిన కాగితం. మనూరికి మంచిపేరు తెచ్చినావమ్మా' అంటూ తెగ మురిసిపోతూ చెప్పాడు.
ఇక గౌరి ఆనందం కట్టలు తెంచుకుంది. కాగితం పదేపదే చూసుకుంది.. తన ఆనందాన్ని తండ్రి కన్నారెడ్డితో, అత్తమ్మ శివాలమ్మతో పంచుకుంది. ఢిల్లీ వెళ్లడానికి ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేసింది. ఆ వేదికపైన ప్రభుత్వం ఇచ్చిన అవార్డ్‌గా ఇచ్చిన ప్రశంసాపత్రం, నగదుతో ఉన్న కవరు తీసుకున్న సమయంలో వాటి స్థానంలో ఆమెకు తన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతిఫలంగా బంగారు పంటను ఇచ్చిన నేల తల్లే సాక్షాత్కరించింది.

 

కె.కె. రఘునందన
79898 43746