ప్రజాశక్తి - కోట (చిత్తూరు) : ఆయకట్లు రైతుల విన్నపానికి వెంటనే స్పందించి చర్యలు చేపట్టిన నేదురుమల్లి.హరీష్ చంద్రారెడ్డికి రైతన్నలు శనివారం కృతజ్ఞతలు తెలిపారు. రైతుల వివరాల మేరకు... మాండూస్ తుపాను కారణంగా గత కొన్ని రోజులు కురిసిన వర్షాలకు నారుమళ్ళు, వారినాట్లు వేసిన పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో రైతులందరూ తీవ్రంగా నష్టపోయారు. పెన్నక్క చెరువు ఆయకట్టు రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో స్థానిక వైసిపి నాయకులు నేదురుమల్లి హరీష్ చంద్రా రెడ్డి ఈ సమస్యను వెంటనే ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఇరిగేషన్ అధికారులు డిఈ ఫరూక్ అబ్దుల్లా, తదితర సిబ్బందితో కలిసి వైసిపి నాయకులు నేదురుమల్లి.హరిచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి చేరి క్షుణ్ణంగా పరిశీలించారు. నీటిలో మునిగిన పంట పొలాల నుండి నిల్వ ఉండే నీరు బయటకు పోవాలంటే అడ్డుగా ఉన్న డొంకను తొలగించాలని నిర్ణయం తీసుకుని జెసిబి సాయంతో తొలగించి పంట పొలాల్లో నిల్వ ఉన్న వర్షపు నీటిని దిగువ ప్రాంతంలో ఉన్న ఉప్పునీటి కాలువలోనికి మళ్ళించారు. దీనితో రైతులందరూ ఊపిరి పీల్చుకున్నారు. పంట పొలాల్లో నుండి నిల్వ ఉన్న వర్షపు నీటిని తొలగించడంతో ఒక్కసారిగా పెన్నక్క చెరువు ఆయకట్ట రైతులందరి ముఖంలో ప్రస్తుతం వరి నాట్లు మళ్లీ నాటుకోవచ్చనే చిరునవ్వు కనిపించింది. అనంతరం రైతులందరూ కలిసి నేదురుమల్లి. హరిచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు కట్ట శంకర్ రెడ్డి, శానంపూడి గోపాల్ రెడ్డి, మేదరమల్లి హరి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.










