వ్రాస్తున్నా నేనింకా
రాస్తూనే ఉన్నా..
పెన్ను దులిపి మరీ రాస్తున్నా
పేజీలు మారుస్తున్నా..
పచ్చిగా-పిచ్చిగా రాస్తున్నా,
నాకు తోచింది రాస్తున్నా
ఏదో కవిత రాస్తున్నా
అందరి కంటబడ చూస్తున్నా,
తోచిన భావాల మొక్కకు
పూర్తయిన అక్షరాలను కూర్చి,
మంచి ఆలోచనలతో కూడి
అర్థం వచ్చేలా వ్రాస్తున్నా!
పండితులు మెచ్చరాయె..
పామరులకు నచ్చదాయె..
నేనేమి చేసేది?
ఇంకెలా రాసేది?
అయినా నే రాస్తూనే ఉన్నా!
పచ్చి నిజాలు రాస్తే
పళ్ళు కొరుకుతున్నారు..
లేనిది ఉన్నట్లు రాస్తే
సంబర పడుతున్నారు..
ఉన్నది లేనట్లు రాస్తే
చప్పట్లు కొడుతున్నారు..
అయినా నే మిన్నకుండక
ఇంకా ఏదో రాస్తున్నా!
ఏ విషయం రాయాలో
ఏ వివరం దాచాలో,
తెలియక సతమతమౌతున్నా
ఆలోచనల సుడిగుండాల
మధ్య నలుగుతూ
తోచిందేదో రాస్తున్నా..
ఇంకా ఏదో వ్రాస్తున్నా!
రాస్తున్నా వ్రాస్తూ ఉన్నా..
అలసి సొలసి పోకుండా..
రాస్తున్నా రాస్తున్నా..
నేను ఇంకా రాస్తూనే ఉన్నా!!
ఎన్.రాజేష్
9849335757