హైదరాబాదులోని నిశుంబిత స్కూల్ ఆఫ్ డ్రామా నట శిక్షణ పొందిన విద్యార్థులు- రచయిత దర్శకుడు రామ్మోహన్ హొళగొంది నేతృత్వంలో నవంబర్ నెల 12 13వ తేదీలలో ఉదయం సాయంత్రం మొత్తం నాలుగు పూటల్లో రోజుకి 11 చొప్పున 22 రంగస్థల 'ఏకవ్యక్తి' ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. ఒక్కొక్క ప్రదర్శన 45 నిమిషాలకు తగ్గకుండా ఇచ్చిన ఈ మోనో ప్రదర్శనలన్నీ ఉన్నత స్థాయికి చెందిన రంగస్థల ఏకపాత్రల అభినయం మరొకసారి రికార్డు నెలకొల్పింది. గత మార్చి 27వ తేదీన ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా 27 ప్రదర్శనలు ఏకబిగిన ప్రదర్శించిన నిశుంబిత రామ్, ఇలాంటి చరిత్రనొకదానిని తన సొంతం చేసుకున్న దర్శక, రచయిత.
రెండు రోజుల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పిల్లల, స్త్రీల జీవితాల్లోని ఆనంద విశషాదాలకు, అనుభూతులకు అద్దం పట్టగా, మరొక రెండు విభాగాల్లో మొత్తం వర్తమాన సమాజంలోని సమస్యలు, పోకడలు, ఆధునిక సాంకేతిక సమాచార విప్లవం మనిషి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువస్తున్నాయో, వాటి పరిణామాలు- ఫలితాలు ఎలా ఉంటున్నాయో, ఎలా పరిణమించబోతున్నాయో- అన్న ఆలోచనాత్మక సద్వివిమర్శకు సహానుభూతి, మానవతా కోణం నుంచి చర్చించి ప్రేక్షకుడిని ఆలోచన ముద్రలో ముంచి తేల్చిన ప్రదర్శనలు. రంగస్థలం ప్రదర్శన జీవితానికి, జీవిత గమనానికి, జీవితంలోని అసంబద్ధ అహేతుక అశాస్త్రీయ మూఢనమ్మక మూస ఆలోచన ధోరణికి, నవరసాత్మకమైన జీవితంలోని పలు కోణాలను, అద్దం పడుతూ, మేధోపరమైన చింతనాత్మక ధోరణిలో ఈ ప్రదర్శనలు సాగాయి.
ఇవన్నీ రచన నటన దర్శకత్వం సాంకేతిక విలువలతో కూడి భారతీయ సమకాలీన నాటక రంగానికి మచ్చుతునకలుగా, జీవన శకలాలుగా భాసించాయి. ఒక రచయిత దర్శకుడు ఎంత వినూత్నంగా ఆలోచిస్తూ భవిష్య దర్శనం చేస్తూ వర్తమానంలో దారి తప్పకుండా సమాజానికి మేలుకొలుపు పాడగలడో దర్శింపచేసాయి. శిక్షణ- ఒక విద్యార్థిలోని ప్రతిభా నైపుణ్యాలకు ఎలా మెరుగులు దిద్ది సాన పట్టి వజ్రంలా ప్రకాశింప చేస్తుందో ప్రత్యక్షంగా దర్శించే అవకాశాన్ని కల్పించింది.
శనివారం 12వ తేదీ ఉదయం ఒరేరు చెత్తోడా, మత్తు, ఆలస్యం, మ్యావ్-నల్ల పిల్లి అడ్డమొచ్చింది, సత్య - వీడు అదో టైపు, ప్లే లలో... చెత్త సేకరించి పరిసరాలను శుభ్రంగా ఉంచే వ్యక్తి జీవితంలోని విషాదాన్ని చూపిస్తే, మత్తు మాదకద్రవ్యాల దుష్పరిణామాలు- వ్యక్తి వాటికి బానిసగా మారితే ఏ స్థాయి నుండిన అతడిని ఏ అగాధాల్లో పడదోస్తుందో చెబుతుంది. 'పంది' బాడీ షేమ్ విషయ వస్తువుగా ఊబకాయంతో ఎన్ని అవమానాలు హేళనలు ఒక యువకుడి జీవితంలో చోటు చేసుకున్న విభిన్న పరిస్థితులను కళ్ళకు కట్టింది. మనిషి తన జీవిక కోసం ఎన్ని అపమార్గాలు పట్టి, సమాజంలో ఎన్ని దుష్క ృత్యాలు చేయగలడో- సత్య- వీడు అదో టైపు- మ్యావ్! నల్లపిల్లి అడ్డమొచ్చింది- లో ఒక బామ్మ గారి మూఢ నమ్మకాలు- బాలుడు నుంచి యువకుడి దాకా ఎరిగిన పరిణామ క్రమంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను హాస్యధోరణిలో చూపిస్తుంది.
ఇక సాయంత్రం స్లాట్లో ఇస్కీతో.. మోనో ప్లే, మొబైల్ అడిక్షన్ ఒక యువతి జీవితంలో నింపిన విషాదాన్ని చూపిస్తే; ఏక్ కహాని'- ఒక ట్రాన్స్ జెండర్ జీవితంలోని విషాద పరంపరను శోక రసంలో రంగరించి చూపింది. బ్రాహ్మిన్ హౌ!?.. ఒక కులంలో పుట్టడం ఖర్మ, తప్పిదమా? వ్యక్తి ప్రమేయం ఇందులో ఏ మేరకు? కులం కారణంగా ఒకప్పుడు పంచమ వర్ణంగా పిలవబడిన వారు అనుభవిస్తే.. నేడు సమాజంలో మారిన పరిస్థితులకు ఒక అగ్రవర్ణంగా చెప్పబడే వ్యక్తి జీవితంలోని అగచాట్లను దృశ్యంమానం చేసింది. తాల్ - ఏ డాన్సర్స్ లైఫ్' స్త్రీని భోగ వస్తువుగా చూస్తూ, తమ క్షణిక శారీరక సుఖం కోసం మగజాతిలో కొందరు కాముకులు ఎంతటి ఉత్పాతాన్ని సృష్టించి ఒక యువతి జీవితంతో ఆడుకోవడాన్ని కరుణాసాత్మకంగా చూపింది.
వివిధ మతాల్లో బాహ్యాడంబరంతో జరిగే ఉత్సవాలు, వేడుకలు, ప్రార్థనలు వీటి వింత వింత పోకడలను చూపిస్తూ.. జంతుబలి, ఆహారం వృధా చేయడం, పర్యావరణ కాలుష్యం మొదలైన అంశాలతో నిజంగా భగవంతుడు అనే వాడు ఉంటే చూస్తున్నాడా? చూస్తూ మౌనం వహిస్తున్నాడా? మెచ్చుకుంటాడా? నొచ్చు కుంటాడా?.. ఇలా అనేక సంఘటనలు హాస్య వ్యంగ్య ధోరణిలో సాగిన ప్రదర్శన ఒకటి.
ఇక 13వ తేదీ ఉదయం బాలల నాటికలు- పాపం పసివాళ్లు, మేరీ దునియా, గలీకా కుత్తా, హౌమ్ స్వీట్ హౌమ్, మిస్ పర్ఫెక్ట్ ఏకపాత్రలు- పిల్లల ప్రపంచంలోనికి తీసుకువెళ్లాయి. పిల్లలు కూడా పిడుగులై, తమ నటనా సామర్థ్యంతో ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారు? ఏం కోరుకుంటున్నారు? పెద్దలు- పిల్లల జీవితాన్ని మంచిగానో, చెడుగానో ఎలా ప్రభావితం చేస్తారో? అలాగే ఒక వీధి కుక్క జాలి బతుకు, ఎన్ని ప్రతాడనలకు గురికాబడినా ఆత్మ న్యూనతా భావంలో నుంచి, కౌమార దశలోని యువతి- తన్ను తాను ఎలా ఉన్నతీకరించుకున్నదో అభినయ కౌశలంతో చూపిన వైనం.. బాలల దినోత్సవ నేపథ్యంగా పిల్లలను పెద్దలను ఆలోచింప చేశాయి.
13వ తేదీ సాయంత్రం చివరి స్లాట్ లో- ఐయామ్ నాట్ ఫెమినిస్ట్, జోకర్, ఉరు టూ, రిఫ్లెక్షన్, సర్వైవర్, అన్న ఆంగ్ల మోనోప్లేలు ప్రదర్శితమయ్యాయి. భాషలు వేరు, నట నటీనటులు వేరుగాని- జీవితం మాత్రం ఒక్కటే! అది వ్యక్తమైన తీరే వైవిధ్యం.దాన్ని కళాత్మకంగా, పటిష్టమైన రచనా దర్శకత్వంతో, సుశిక్షితులైన విద్యార్థినీ విద్యార్థులు తమ తమ పాత్ర పోషణ ఎంత వాస్తవికంగా ప్రదర్శించి మెప్పించవచ్చో అన్నదానికి ఉదాహరణలుగా నిలిచాయి. మొత్తం మీద నటోత్సవ్- 7, రెండు రోజుల 22 మోనో ప్రదర్శనలు ప్రేక్షకులు తమను తాము, తామున్న సమాజాన్ని 64 కోణాల్లో దర్శించుకోవడానికి ఆత్మ విమర్శ చేసుకోవడానికి, తను తన నిష్క్రియాపరత్వం నుంచి సామాజిక చైతన్యం దిశగా నడవడానికి, నడిపించడానికి చక్కని పధ నిర్దేశం చేశాయి.
- మల్లేశ్వరరావు ఆకుల
79818 72655










