Dec 24,2022 08:08

నవరస నట సార్వభౌమ అన్న బిరుదుకు తగ్గుట్టుగా ఎన్నో వైవిధ్య పాత్రల్లో నటించారు కైకాల సత్యనారాయణ. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లో మెప్పించిన కైకాల ప్రతినాయక, నాయక పాత్రలతో పాటు హాస్యరస పాత్రల్లో కూడా మెప్పించారు. ఎస్‌విఆర్‌, ఎన్‌టిఆర్‌ తరువాత రావణ, దుర్యోధన, యముడి పాత్రల్లో అలరించిన ఏకైక నటుడు ఆయన. ఇద్దరు మహానటులు అనితరసాధ్యంగా అభినయించిన పాత్రలను పోషించి, మెప్పించడం అంటే ఆషామాషీ కాదు. కాని కైకాల దాన్ని సాధ్యం చేశారు. ఎన్నో పాత్రల్లో ఎస్‌వి రంగారావు లేని లోటు తీర్చారు. తెలుగు వెండితెరకు గంభీర హాస్య చమత్కార సరదాల విలనీని అందించి, సరికొత్త చరిత్ర సృష్టించారు.

1959లో సిపాయి కూతురు చిత్రంతో సినీరంగప్రవేశం చేసిన కైకాలకు సంబంధించిన సినీ ప్రస్థానంలోకి వెళ్తే.. స్టేజిపై నాటకం ఆడుతున్న సత్యనారాయణను ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు సినిమా ఇండిస్టీలోకి ఆహ్వానించారు. 'అప్పటికి నాకు సినిమాలపై ఆసక్తి ఉండేది కాదు. మా కుటుంబంలో డిగ్రీ సంపాదించిన వారు లేరు. డిగ్రీ పట్టా పొందిన తరువాతే ఏదైనా చేయాలని బలంగా అనుకునేవాణ్ణి. దీంతో ఆ అవకాశాన్ని తిరస్కరించాను' అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కైకాల. చదువు పూర్తయిన తరువాత ఇంటర్‌ రెండో సంవత్సరం నుంచి ఉన్న నాటకరంగ అనుభవంతో ఓ మిత్రుడి సూచన మేరకు అవకాశాల కోసం మద్రాసు రైలు ఎక్కారు. అలా మద్రాసు వెళ్లిన ఆయనను నటుడిగా గుర్తించారు డి.ఎల్‌.నారాయణ.. తొలి సినిమాతోనే కథానాయకుడి అవకాశాన్ని అందుకున్న కైకాల.. ఇంటి అద్దె కట్టలేక పార్కులో పడుకున్న సందర్భాలున్నాయి. పగలంతా వేషాల కోసం తిరగడం, రాత్రుళ్లు పార్కులో పడుకోవడం ఇలా 15 రోజులు గడిపారు. మొదటి పిక్చర్‌ నిరాశ మిగల్చడంతో విజయవాడకు వచ్చేద్దామని సిద్ధపడినప్పుడు దర్శకుడు విఠాలాచార్య అవకాశమిచ్చి ఆదరించారు. 60 ఏళ్ల తన సినీప్రస్థానంలో దాదాపు 777 సినిమాల్లో నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం మహేష్‌ బాబు నటించిన మహర్షి.. 28 పౌరాణిక, 51 జానపద, 9 చారిత్రక చిత్రాల్లో నటించారు.. 200 మందికి పైగా దర్శకులతో పనిచేశారు. 100 రోజులు ఆడిన కైకాల నటించిన చిత్రాలు 223 ఉన్నాయి.. అర్ధశతదినోత్సవాలు జరుపుకున్న సినిమాలు 59.. సంవత్సరం ఆడిన చిత్రాలు 10 ఉన్నాయి..
 

                                                                              కుటుంబం

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో 1935 జులై 25న జన్మించారు. గుడివాడ కళాశాల నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. 1960 ఏప్రిల్‌ 10న నాగేశ్వరమ్మను వివాహం చేసుకున్నారు.. కైకాలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.. తన మనవళ్లలో ఒకరిని నటవారసుడిగా చూడాలనేది కైకాల కోరిక..
 

                                                             ఎన్‌టిఆర్‌తో విడదీయలేని అనుబంధం..

ఎస్‌విఆర్‌ను తండ్రిగా, ఎన్‌టిఆర్‌ను అన్నగా భావించేవారు కైకాల. 'సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి' చిత్రంలో తొలిసారిగా ఎన్టీఆర్‌తో తెరను పంచుకున్నారు.. ఎన్టీఆర్‌తో కలిసి 101 చిత్రాల్లో నటించారు.. పోరాట సన్నివేశాల్లో ఎన్‌టిఆర్‌తో పోటాపోటీగా నటించి మెప్పించారు. విఠలాచార్య దర్శకత్వంలో 'కనకదుర్గ పూజ మహిమ' చిత్రంలో తొలిసారి ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ఎన్టీఆర్‌ 'అగ్గిపిడుగు' చిత్రంతో కైకాల సినీ జీవితం మలుపు తిరిగింది.
            దుర్యోధనుడి పాత్ర చేయాలంటే ఎస్‌వి రంగారావే చేయాలి. ఆయన కాకపోతే ఇండిస్టీలో ఎవరూ లేరు అన్న ధోరణికి ఆ పాత్రలు పోషించి సమాధాన మిచ్చారు కైకాల. ఆ పాత్రకు సరిపోరని నిర్మాతలు అభ్యంతరం చెప్పినా.. రామారావు ప్రోత్సాహంతో ఆ పాత్ర చేసి మెప్పించానని ఒక సందర్భంలో చెప్పారు. 'తన నటనా జీవితంలో ఎందరో దర్శకనిర్మాతలు ఉన్నట్లే రామారావు పాత్ర కూడా చాలా ముఖ్యమైంది' అంటారు గతస్మృతులు గుర్తుచేసుకుంటూ.. ఆ తరువాత ఎన్‌టిఆర్‌, కైకాల ఎన్నో నాయక, ప్రతినాయక పాత్రల్లో ప్రేక్షకులను అలరించారు. ప్రాణ స్నేహితులుగా నటించి అభిమానులను అలరించారు. మొట్టమొదట యమగోల చిత్రంలో యముడు వేషం వేశారు. ఆ తరువాత రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు పాత్రల్లో జీవించారు..
            యమగోల చిత్రం తరువాత ఎస్‌వి కృష్ణారెడ్డి యమలీల చిత్రంలో మరోసారి యముడిగా అలరించారు కైకాల .. సాంఘిక చిత్రాల్లో రౌడీ, తండ్రి, తాత పాత్రల్లో నటించి మెప్పించారు. గంభీరమైన పాత్రల్లోనే హాస్యరసం పండించేవారు. రమా ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ సంస్థను స్థాపించి 'కొదమ సింహం', 'బంగారు కుటుంబం', 'ముద్దుల మొగుడు' లాంటి చిత్రాలను నిర్మించారు..
 

                                                                         మరికొన్ని విశేషాలు..

1994లో బంగారు కుటుంబం చిత్రానికి నంది పురస్కారం అందుకున్నారు. 2011లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఆయనను సత్కరించారు.. ఎన్‌.టి.ఆర్‌. ద్విపాత్రాభినయ చిత్రాలలో ఆయనకు డూప్‌గా నటించారు.. బాలీవుడ్‌ చిత్రంలో నటించిన అనుభవం కూడా ఉంది. హిందీ దర్శకుడు సుభాష్‌ ఘై చిత్రం 'కర్మ'లో కైకాల విలక్షణ పాత్రలో కనిపించారు.
 

                                                                          కొన్ని మధురస్మృతులు..

1977లో జనవరి 14న 'దానవీరశూరకర్ణ', 'కురుక్షేత్రం' చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి. అందులో రెండు విభిన్న పాత్రలు పోషించారు కైకాల. దానవీరశూరకర్ణలో భీమునిగా, కురుక్షేత్రంలో దుర్యోధనుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించిన గొప్ప అవకాశం, ఆ ఘనత కైకాలకే దక్కింది. విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో నిర్వహించిన ఓ నాటకంలో నటించేందుకు ఆయన స్టేజీ ఎక్కారు. అప్పుడు ప్రేక్షకులందరూ ఎన్‌టిఆర్‌ ఎన్‌టిఆర్‌ అంటూ కేకలు వేసినట్లు ఆనాటి సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు ఓ సందర్భంలో. ఇండిస్టీలో జేజేలు అందుకున్న సందర్భాలు.. అవకాశాలు లేక బాధలు పడ్డ సందర్భాలు రెండూ ఆయన అనుభవంలో కోకొల్లలు ఉన్నాయి.