Apr 21,2023 07:27

      ఎంతో ఉత్సాహంగా, భక్తిభావంతో పండుగ జరుపుకుంటున్న ప్రజలకు ఏం తెలుసు? కొద్దిసేపటికే అక్కడ పెద్ద ఎత్తున హింస చెలరేగుతుందని? తమ కళ్ల ముందే అంతా సర్వనాశనం అవుతుందని? బీహార్‌ లోని నవాడాలో గత నెల 31న చోటుచేసుకున్న మతపరమైన హింసాకాండ, విధ్వంసం నుండి ఇంకా ఆ ప్రాంతం తేరుకోనేలేదు. ఎక్కడ చూసినా కాలి బూడిదైన వాహనాలు, తగలబడిపోయిన దుకాణాలు, ఇళ్లు, దోపిడీకి గురైన వ్యాపార సముదాయాలే కన్పిస్తున్నాయి. ఎప్పుడూ ప్రశాంతంగా కన్పించే ఈ పురాతన నవాడా పట్టణంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా జరిగిన ఊరేగింపు హింసకు దారితీసింది. ఇప్పటికీ రోడ్లపై చెల్లాచెదురుగా పడి ఉన్న రాళ్లు, పగిలిపోయిన గ్లాసు ముక్కలు ఆ దారుణ ఘటనకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే, అల్లరి మూకలు చెలరేగిపోయి కొన్ని గంటల పాటు విధ్వంసాన్ని సృష్టించారు.
        అయితే వాస్తవానికి అక్కడ జరిగిందేమిటి ? రామనవమి సందర్భంగా శోభాయాత్ర నిర్వహించేందుకు బజరంగ్‌దళ్‌ సంస్థకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఆ రోజు దుకాణాలు తెరవొద్దంటూ నిర్వాహకులు అంతకు ముందు ప్రచారం చేశారు. శోభాయాత్రకు యాభై వేల మంది హాజరయ్యారని జిల్లా మెజిస్ట్రేట్‌ శశాంక్‌ శుభంకర్‌ చెప్పారు. అయితే కేవలం ఐదు వేల మందికి మాత్రమే అనుమతి ఉంది. పోలీసుల సంఖ్యతో పోలిస్తే ప్రదర్శనకారుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. డీజేలు ఉపయోగించడం, ఆయుధాలు ధరించడం వంటి చర్యలను నిషేధించామని అధికారులు చెబుతున్నప్పటికీ ట్రక్కుల మీద పెద్ద పెద్ద లౌడ్‌స్పీకర్లను ఏర్పాటు చేశారు. రెచ్చగొట్టే పాటలు, నినాదాలను వినిపించారు. ఊరేగింపు ఒక మసీదు వద్దకు చేరగానే డీజేలలో వినిపించిన పాటల స్వరం ఒక్కసారిగా మారిపో యింది. రామమందిరం నిర్మిస్తామని, ముస్లింలకు వేరే స్థలం చూపుతామని, వారు కూడా రామ నామమే జపించాలని నినాదాలు విన్పించాయి. 'వారిని చంపండి... లేదా పాకిస్తాన్‌ కు పంపండి' అనే పాట విన్పించారు. ఇలాంటి రెచ్చగొట్టే పాటలు వేస్తూ... అభ్యంతరకరమైన నినాదాలు చేస్తూ... ఊరేగింపులో ముందుకు కదిలారు. జిల్లా మెజిస్ట్రేట్‌ కూడా దీనిని అంగీకరించారు. అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న సీడీలు, పెన్‌డ్రైవ్‌లలో అలాంటి నినాదాలు, పాటలు వినిపించలేదని సెలవిచ్చారు.
'డీజేలను నిషేధించాం. అయితే వాటిని బలవంతంగా తొలగించలేకపోయాం. అలా చేస్తే పరిస్థితి మరింత విషమిస్తుంది' అని మెజిస్ట్రేట్‌ చెప్పుకొచ్చారు. ప్రదర్శన మసీదు ముందుకు రాగానే కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఇరుపక్షాల పెద్దలు నచ్చచెప్పడంతో ప్రదర్శన ముందుకు సాగింది. ఈ దశలో కొందరు గూండాలు ఇద్దరు ముస్లిం యువకులను అడ్డగించి 'జై శ్రీరామ్‌' అంటూ నినాదాలు చేయాలని బలవంత పెట్టారు. నిరాకరించిన యువకుడిని తీవ్రంగా హింసించారు. అంతలోనే ఒక శ్మశానవాటిక దగ్గర కాషాయ జెండాను ఎగరేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఇరు పక్షాలు పరస్పరం ఘర్షణకు దిగాయి. తొక్కిసలాట జరిగింది. దుండగులు రెండు బస్సులకు నిప్పుపెట్టారు. వాహనాలు, దుకాణాలు, ఇళ్లను తగలబెట్టారు. ముందస్తు ప్రణాళికతోనే ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. అధికార జె.డి.యు కు చెందిన నాయకుడి సిటీ ప్యాలెస్‌కు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో మూడంతస్థుల ఆ మ్యారేజ్‌ హాలు పూర్తిగా ధ్వంసమైంది. వెయ్యి మంది సాయుధ దుండగులు ఆ భవనాన్ని చుట్టుముట్టడంతో ఎవరూ అక్కడికి వెళ్లలేకపోయారు. అదే సమయంలో అల్లరి మూకలు రోడ్లపై రాళ్లు రువ్వారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. డి.వి.ఆర్‌ను ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఎవరూ స్పందించ లేదు. అగ్నిమాపక వాహనాలు వచ్చేసరికే అంతా బూడిద అయింది. సిటీ ప్యాలెస్‌ ఎదురుగా ఉన్న ఓ హోటల్‌కు కూడా దుండగులు నిప్పంటించారు. జనరేటర్‌ను తగలబెట్టడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. విద్యుత్‌ సరఫరా నిలిచి పోవడంతో సి.సి టీవీ కెమేరాలు పని చేయలేదు. ముస్లింల దుకాణాలు, ఇళ్లు, ప్రార్థనా స్థలాలే లక్ష్యంగా దాడులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సుమారు వెయ్యి మంది మతోన్మాదులు ఓ మసీదులో ప్రవేశించి రెండు గుమ్మటాలను కూల్చేశారు. క్యాంపస్‌లో నిలిపివున్న వాహనాలను తగలబెట్టారు. సుమారు 45 నిమిషాల పాటు విధ్వంసం సాగినా పోలీసులు ఆ ఛాయలకు కూడా రాలేదు. పండ్లు, కూరగాయలు అమ్ముకునే వారిని కూడా దుండగులు వదలలేదు. వారికీ జీవనోపాధి లేకుండా చేశారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.
          మరో ఘటనలో వెయ్యి మంది మతోన్మాదులు పెట్రోల్‌ బాంబులతో మదర్సాపై దాడి చేసి తగలబెట్టారు. లైబ్రరీ లోని ఐదు వేల పుస్తకాలు అగ్నికి ఆహుతయ్యాయి. 'డిజిటల్‌ దునియా' పేరిట షాపు నడుపుతున్న ఆజామ్‌ తన అనుభవాన్ని వివరిస్తూ తన దుకాణాన్ని అల్లరిమూకలు దోచుకున్నారని వాపోయారు. ఇప్పటి వరకూ ఎవరూ తనకు సాయపడలేదని చెప్పారు. బీహార్‌లో రామనవమి సందర్భంగా జరిగిన హింసాకాండ చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిపోతుంది. ఈ ఘటన అనేక మంది హృదయాలను గాయపరిచింది. ఆ గాయాలు మానడానికి చాలా సమయం పడుతుంది.
- ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌