ప్రతి ఉదయాన్నీ
పక్షుల కిల, కిల రావాలతో ఆహ్వానించి
ఆమని పాటలతో
మరో ఆకాశమై నిల్చిపోతుంటాను
ప్రతి సాయంత్ర సంజెవేళల్లో
ఆ రాగాల ఆలాపనల్లో
నేనూ ఒక సరాగమై కవి కలాన్ని
మేల్కొలిపి మైమరచిపోతాను
ప్రకృతి నడుమ
సముద్ర అలల ఘోషలో
మదిని ఒడ్డుకి అప్పజెప్పి
మంద్రంగా మీటే ఆల్చిప్పల కోరస్లను
నా కంటిపాపలు కంటూ వింటూ
హృదయం కొత్త అలై
ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది
కనిపించని గాలి కూడా
కొన్ని గంధాల్ని మోసుకొచ్చి
ఊసుల ఉప్పెలనలతో
ఊహాలోకాల్లో విహరింపజేస్తుంది
వినిపించి కనిపించని రాగాలేవో రా..రమ్మని
ఒంటరి హృదయాన్ని లాలిస్తూ ఊరిస్తూ
ఉత్తేజాన్ని కలిగిస్తాయి
ఆకాశ నేస్తాలై వెళ్ళే కొంగల గుంపూ..
నేలను తాకుతూఝుంటు తేనెటీగల
స్వర, లయల సంగీతాలూ...
రంగు, రంగుల సీతాకోక ఇంద్రధనుస్సు హొయలూ...
కాంక్షించే కళ్ళకు కొంగ్రొత్త రాగాలు
ప్రకృతి సరాగాలై కనిపించి కనువిందు చేస్తాయి...!!
మహబూబ్ బాషా చిల్లెం 95020 00415