మన కళ్లెదుట మొక్కలు కనిపిస్తున్నా.. వాటిని పిచ్చి మొక్కల్లానే అనుకుంటాం. వాటివల్ల ప్రయోజనం ఏమీ ఉండదులే అని తేలిగ్గా తీసిపారేస్తుంటాం. అయితే కొన్ని మొక్కలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని చేకూరుస్తాయి. వాటిల్లో ప్రధానంగా బ్రహ్మీ మొక్క గురించే చెప్పుకోవాలి. ఈ మొక్క ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బ్రహ్మీ ఆకులు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయని కొన్ని పరిశోధనల్లో కూడా తేలింది. మరి ఈ ఆకుల వల్ల ఇంకెన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకుందామా..!
- బ్రహ్మీ ఆకులు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ ఆకుల్ని మెత్తగా నూరి రోజుకు రెండుసార్లు మోతాదు మించకుండా 300 మిల్లీ గ్రాములు చొప్పున తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.
- బ్రహ్మీ ఆకులు శరీరంలోని ఒత్తిడిని పెంచే కార్టిసాల్ అనే హార్మోన్‌ను తగ్గించి, సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్‌ను పెంచుతుంది. దీంతో మానసిక ఉల్లాసం రెట్టింపవుతుంది.
- బ్రహ్మీలోని యాంటీఆక్సిడెంట్లు, హానికరమైన ఫ్రీరాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్.. గుండెజబ్బులు, మధుమేహం, వివిధ రకాల క్యాన్సర్ వంటి వ్యాధులను కలిగిస్తాయి.
- ఈ ఆకులు అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఆయుర్వేద వైద్యులు అధిక రక్తపోటు ఉన్న వారికి ఈ ఆకులతో తయారుచేసిన మందును వాడమని సూచిస్తారు.
- ఈ ఆకుల్ని ఎవరైనా నేరుగా తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే.. ఆరోగ్యంపై అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. తప్పనిసరిగా ఆయుర్వేద వైద్యుని సలహా మేరకు.. ఈ ఆకులతో తయారుచేసిన మెడిసిన్‌ను వినియోగించాలి.