
అత్యంత సంపన్న దేశాలన్నీ చాలా రకాల ముడి సరుకుల కోసం, ఖనిజాల కోసం, వ్యవసాయ ఉత్పత్తుల కోసం తక్కిన ప్రపంచం మీద ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఆ సరుకులను తక్కువ ధరలకు నిరంతరాయంగా అవి పొందగలగాలి. ఇదే వలసపాలన కాలంలోనైతే అవి ఈ సరుకులను ఏ ధరా చెల్లించకుండానే, కొల్లగొట్టుకుపోగలిగాయి. ఇప్పుడు ఆ వలస విధానం లేదు. కాని సంపన్న దేశాలకు మాత్రం ఆ సరుకుల అవసరం మెండుగా ఉంది. అందుచేత సామ్రాజ్యవాదం తనకు ముడిసరుకులను, ఖనిజాలను అందించే మూడో ప్రపంచ దేశాలలో తనకు అనుకూలంగా వ్యవహరించే ప్రభుత్వాలను నెలకొల్పసాగింది.
ప్రపంచంలో ఆ యా దేశాలు అభివృద్ధి చెందిన స్థాయికి, వాటి స్వాధీనంలో ఉన్న ప్రకృతి వనరులకి మధ్య పొంతన లేదు. అత్యంత అభివృద్ధి చెందిన జి-7 దేశాలనే తీసుకోండి. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, కెనడా-ప్రపంచంలోని జనాభాలో కేవలం 10 శాతం మాత్రమే ఈ ఏడు దేశాలలో ఉన్నారు. కాని 2020 నాటికి ప్రపంచంలోని నికర సంపదలో 50 శాతం ఈ దేశాలలోనే ఉంది. ప్రపంచ స్థూల ఉత్పత్తిలో ఐదింట రెండు వంతులు ఈ దేశాలలోనే ఉంది. ఈ దేశాల ఆర్థిక శక్తి చూస్తే తిరుగులేనిదే. కాని ప్రకృతి వనరుల రీత్యా చూస్తే ఈ దేశాలు చాలా తక్కువ మొత్తం మాత్రమే కలిగివున్నాయి.
ప్రస్తుత కాలంలో అత్యంత ముఖ్యమైన ప్రకృతి వనరు ముడి చమురు, సహజవాయువు. ప్రపంచంలో ఉన్న మొత్తం ముడి చమురు, నిల్వల గురించిన అంచనాలు రకరకాలుగా వున్నాయి. కాని నిర్ధారణ అయిన మేరకు ఈ నిల్వలలో జి-7 దేశాల వద్ద 13 శాతం మాత్రమే ఉన్నాయి. అందులో అత్యధికంగా కెనడా దగ్గర 10 శాతం ఉన్నాయి.ఇది అమెరికాకు చెందిన ఇంధన సమాచార నిర్వహణ సంస్థ (ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్) వద్ద ఉన్న సమాచారం. ఇందులో అమెరికా అధీనంలో ఉన్న రాతి చమురు నిల్వలు లెక్కలోకి తీసుకోలేదు. ఆ మాటకొస్తే ఇంకా చాలా దేశాల్లో కూడా ఈ రాతి చమురు నిల్వలను పరిగణనలోకి తీసుకోలేదు. అందుచేత ఆ విషయాన్ని పక్కన పెడితే, ప్రపంచంలో ఉన్న చమురు, నిల్వలలో అత్యధిక భాగం అత్యంత అభివృద్ధి చెందిన దేశాలకు వెలుపలే ఉన్నాయి.
ఇక సహజవాయువు నిల్వల గురించి చూద్దాం. ప్రపంచం మొత్తం మీద 188 లక్షల కోట్ల ఘన మీటర్ల పరిమాణంలో సహజవాయువు నిల్వలు ఉన్నాయి. అందులో జి-7 దేశాల వద్ద కేవలం 8 శాతం మాత్రమే ఉంది. అయితే ఈ దేశాలు చమురు మీద, సహజవాయువు మీద అత్యధికంగా ఆధారపడి వున్నాయి. ఇటీవల ఈ దేశాలలో కొన్ని వేరే ఇంధనాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకి: ఫ్రాన్స్ అణు ఇంధనం మీద ఎక్కువ కేంద్రీకరించింది. పర్యావరణానికి ఎదురౌతున్న సమస్యల దృష్ట్యా కూడా ఈ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు దృష్టి పెంచుతున్నాయి. అయినప్పటికీ, ఈ జి-7 దేశాలు ఇప్పటికీ చమురు, సహజ వాయువుల మీద గణనీయంగా ఆధారపడివున్నాయి. ఆ దేశాల భౌగోళిక పరిధుల్లో మాత్రం ఈ ఇంధనాలు చాలా పరిమితంగా లభ్యం అవుతున్నాయి.
ఇక వ్యవసాయ ఉత్పత్తుల విషయానికి వస్తే ఈ సంపన్న దేశాల ఉత్పత్తి సామర్ధ్యం చాలా పరిమితం. ఆ దేశాల్లోని భౌగోళిక పరిస్థితుల కారణంగా ఈ పరిమితులు ఏర్పడ్డాయి. బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవానికి, తద్వారా పారిశ్రామిక పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భావానికి బాటలు వేసినది జౌళి పరిశ్రమ. కాని అందుకు కావలసిన పత్తి మాత్రం బ్రిటన్‌లో ఎక్కడా పండదు. మొత్తం కావలసిన పత్తినంతటినీ దిగుమతి చేసుకోవలసిందే. అదే మాదిరిగా సంపన్న పారిశ్రామిక దేశాలన్నీ శీతల ప్రదేశంలోనే ప్రధానంగా ఉన్నందువలన, ఆ దేశాల్లో చాలా రకాల పంటలు పండే అవకాశం లేదు. ఒకవేళ పండినా కావలసినంత పరిమాణంలో పండవు. ఏడాది పొడవునా పండవు. అదే సమశీతోష్ణ, ఉష్ణ దేశాలలోనైతే ఈ పంటలన్నీ ఏడాది పొడవునా, కావలసినంత పరిమాణంలో పండుతాయి. ఆ దేశాలు ఈ పంటలను సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు సరఫరా చేస్తుంటాయి. పానీయాలు, ఆహార ధాన్యాలు, పత్తి తదితర పీచు పదార్ధాలు-ఏవి కావాలన్నా సంపన్న పెట్టుబడిదారీ దేశాలు ఈ ఉష్ణ, సమశీతోష్ణ ప్రాంతాలలోని దేశాల మీద ఆధారపడవలసినదే. ఇటీవల కాలంలో ఈ సంపన్న దేశాలు ఆహారధాన్యాల ఉత్పత్తిలో అభివృద్ధి సాధించి మిగులు పంటను ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. అదే మిగులును అడ్డం పెట్టుకుని మూడో ప్రపంచ దేశాల మీద ఒత్తిడులు తీసుకువచ్చి, ఆ దేశాలలో ఆహార పంటలు పండించడం మానివేసి, తమకు (సంపన్న దేశాలకు) కావలసిన ఇతర పంటలను పండించి సరఫరా చేయాలని బలవంతం చేస్తున్నాయి.
మొత్తంగా చూసినప్పుడు అత్యంత సంపన్న దేశాలన్నీ చాలా రకాల ముడి సరుకుల కోసం, ఖనిజాల కోసం, వ్యవసాయ ఉత్పత్తుల కోసం తక్కిన ప్రపంచం మీద ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఆ సరుకులను తక్కువ ధరలకు నిరంతరాయంగా అవి పొందగలగాలి. ఇదే వలసపాలన కాలంలోనైతే అవి ఈ సరుకులను ఏ ధరా చెల్లించకుండానే, కొల్లగొట్టుకుపోగలిగాయి. ఇప్పుడు ఆ వలస విధానం లేదు. కాని సంపన్న దేశాలకు మాత్రం ఆ సరుకుల అవసరం మెండుగా ఉంది.
అందుచేత సామ్రాజ్యవాదం తనకు ముడిసరుకులను, ఖనిజాలను అందించే మూడో ప్రపంచ దేశాలలో తనకు అనుకూలంగా వ్యవహరించే ప్రభుత్వాలను నెలకొల్పసాగింది. ముఖ్యంగా చమురు ఉత్పత్తి దేశాలలో ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇక నయా ఉదారవాద విధానాలను అడ్డం పెట్టుకుని మూడో ప్రపంచ దేశాలను రుణ ఉచ్చులోకి లాగి ఆ తర్వాత తమకు అనుకూలంగా ఆ దేశాలు వ్యవహరించే విధంగా వాటిపై వివిధ షరతులను విధించడం సర్వసాధారణం అయిపోయింది. దాని వలన ఆ మూడో ప్రపంచ దేశాలు తమ తమ దేశాల స్వంత ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోలేని స్థితిలో పడిపోయాయి. వాణిజ్యంలో సంపన్న దేశాలపై ఆధారపడవలసిన పరిస్థితికి నెట్టబడ్డాయి.
ఈ నయా ఉదారవాద పెత్తనాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేని ప్రభుత్వాలను రకరకాల కుట్రల ద్వారా తొలగించడం కూడా సామ్రాజ్యవాద వ్యూహంలో భాగమే. తన గూఢచారి విభాగం సిఐఎ ద్వారా కుట్రలు పన్ని, తనకు లొంగి వుండని ప్రభుత్వాలను కూలదోయడం, రకరకాల ఆంక్షలను విధించడం ద్వారా ఆ ప్రభుత్వాలను ఇరుకున పెట్టడం వంటి వివిధ రకాల చర్యలకు సామ్రాజ్యవాదం పూనుకుంది. అయితే ఇటీవల కాలంలో సామ్రాజ్యవాద పెత్తనాన్ని ప్రతిఘటిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోంది. అమెరికా ఆంక్షలకు గురవుతున్న దేశాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వుండడమే ఈ ప్రతిఘటన పెరుగుతోందనడానికి నిదర్శనం. సామ్రాజ్యవాదం ఆయువు పట్టు ఇక్కడే ఉంది.
ఒకటో, రెండో దేశాల మీద ఆంక్షలు విధించడం అనేది ఎక్కువ ప్రభావం కలిగించగలుగుతుంది. అది సామ్రాజ్యవాదానికి ఉపయోగపడుతుంది. అదే ఆంక్షలకు గురవుతున్న దేశాల సంఖ్య రానురాను పెరుగుతూంటే అది సామ్రాజ్యవాద ఆధిపత్యానికే ముప్పుగా మారుతుంది. ఆంక్షలకు గురవుతున్న దేశాలు తమకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను తట్టుకోడానికి ఒకదానికి ఒకటి తోడుగా నిలవడం జరుగుతుంది. అప్పుడు ఆంక్షలకు గురి కాకున్నప్పటికీ, తక్కిన మూడో ప్రపంచ దేశాలలో కొన్ని తమ తమ ఆర్థిక అవసరాల రీత్యా ఈ దేశాలతో చేతులు కలపడానికి తయారౌతాయి. అంతే కాదు, ఆంక్షలకు గురవుతున్న దేశాలలో అనేక రకాల వనరులు కలిగివున్న దేశాలు కూడా ఉంటే అప్పుడు ఆంక్షలు సామ్రాజ్యవాదానికే నష్టం కలిగిస్తాయి. ఇటీవల రష్యా మీద విధించిన ఆంక్షల విషయంలో సామ్రాజ్యవాదానికి అదే పరిస్థితి ఎదురైంది.
ఉక్రెయిన్ యుద్ధం కేవలం ఒక ఏడాది క్రితమే ప్రారంభం అయినట్టు, రష్యా వంటి ఒక పెద్ద, బలమైన దేశం తన పొరుగున ఉన్న ఒక చిన్న, బలహీనమైన దేశం ఉక్రెయిన్ మీద దురాక్రమణకు పూనుకున్నందువల్లనే ఆ యుద్ధం ప్రారంభం అయినట్లు పశ్చిమ దేశాల మీడియా చిత్రీకరిస్తోంది. కాని నిజానికి దాదాపు ఒక దశాబ్దం క్రితమే ఉక్రెయిన్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన దేశాధ్యక్షుడు విక్టర్ యానుకోవిచ్‌ను నయా ఉదారవాద శక్తులు సిఐఎ ద్వారా కుట్ర చేసి కూలదోయడంతో ఘర్షణ పరిస్థితులు మొదలయ్యాయి. పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదానికి, రష్యాకు మౌలికంగానే వైరుధ్యం ఉంది. ప్రపంచం మొత్తం మీద ఉన్న సహజవాయువు నిక్షేపాల్లో దాదాపు ఐదో వంతు ఒక్క రష్యాలోనే ఉన్నాయి. దానితోబాటు ప్రపంచంలోని చమురు నిక్షేపాల్లో 5 శాతం వరకూ ఒక్క రష్యా వద్దే ఉన్నాయి. ఇదే కీలకమైన కారణం.
ఉక్రెయిన్ యుద్ధానికి మూలం రష్యాకు, పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదానికి నడుమ ఉన్న ఘర్షణే అని గుర్తించే వ్యాఖ్యాతలు కూడా అదేదో ఏకధృవ ప్రపంచం నుండి బహుళధృవ ప్రపంచంవైపు జరుగుతున్న మార్పులో భాగంగా పరిగణిస్తున్నారు తప్ప రష్యా లోని చమురును, సహజ వాయువు నిల్వల మీద ఆధిపత్యం కోసం సాగుతున్న ఘర్షణగా దీనిని చూడడం లేదు. అటువంటి ఆధిపత్యం కోసం ప్రయత్నం ఎప్పటి నుంచో సాగుతోంది.
బోరిస్ ఎల్సిన్ అధ్యక్షుడుగా ఉన్న కాలంలో అతని చుట్టూ డజన్లకొద్దీ సిఐఎ మనుషులు ఉండేవారు. అందువలన అతడిని సామ్రాజ్యవాదం తన అదుపులో ఉంచుకోగలిగింది. అదే పుతిన్ వచ్చాక పరిస్థితి మారిపోయింది. పుతిన్ ఇతరత్రా చాలా పొరపాట్లు చేసి వుండొచ్చు. కాని రష్యామీద పశ్చిమ దేశాల పెత్తనానికి మాత్రం ఫుల్‌స్టాప్ పడింది. ఇటీవల ఉక్రెయిన్ పర్యటించిన సందర్భంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ''ఉక్రెయిన్ యుద్ధం వెనుక తమ అసలు లక్ష్యం రష్యాలో అధికార మార్పిడి'' అని మాట జారడం మనకేమీ ఆశ్చర్యం కలిగించదు. పశ్చిమ దేశాలకు లొంగి వుండే ప్రభుత్వం రష్యాలో ఉండాలన్నది సామ్రాజ్యవాదుల కాంక్ష.
ఐతే ఏక కాలంలో అనేక దేశాల మీద ఆంక్షలు విధించడం, అందునా రష్యా వంటి పెద్ద దేశం మీద కూడా ఆంక్షలు విధించడం పశ్చిమ దేశాలకు ఇప్పుడు ప్రాణసంకటంగా మారింది. ఈ ఆంక్షల ప్రభావం ఆంక్షలకు గురైన దేశాలలోని ప్రజానీకం మీద మాత్రమే పడుతోందని అనుకోరాదు. ఆంక్షలు విధిస్తున్న దేశాలలోని శ్రామిక ప్రజల మీద కూడా ఆంక్షల ప్రతికూల ప్రభావం పడుతోంది. రష్యా నుండి సహజ వాయువు దిగుమతులు ఆగిపోవడంతో దానిని ఉపయోగించే సంపన్న దేశాల శ్రామిక ప్రజలు, ముఖ్యంగా యూరప్ దేశాలలోని కార్మికవర్గం, వేలాదిగా రోడ్ల మీదకి వచ్చి యుద్ధానికి వ్యతిరేకంగా, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్నారు. 1970 దశకం తర్వాత ఇంత భారీ ప్రదర్శనలు యూరప్ లో ఎన్నడూ జరగలేదు. పైగా ఆంక్షల ప్రభావం వలన రష్యా కరెన్సీ విలువ పడిపోతుందని, అక్కడ ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని ఆశించిన అమెరికాకు రివర్స్ అయింది. రూబుల్ విలువ డాలర్‌తో పోల్చుకున్నప్పుడు పెరిగింది. అంతే కాదు, ఆంక్షలు విధించిన దేశాలలో ద్రవ్యోల్బణం ఇప్పుడు పెరిగిపోతోంది. ఇప్పటి పరిస్థితి సామ్రాజ్యవాద ఆధిపత్యానికి పెద్ద సవాలుగా తయారైందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
( స్వేచ్ఛానుసరణ )
ప్రభాత్ పట్నాయక్