Dec 11,2022 13:47

నాన్‌వెజ్‌ అంటే ఇష్టంగా తినేవారికి ఒకటేమిటి.. ఎన్ని రకాల నాన్‌వెజ్‌ వంటకాలున్నా దేని రుచి దానిదే. అందునా పల్లెటూళ్ళలో పాత పద్ధతుల్లో చేసే నాన్‌వెజ్‌ వంటల రుచే వేరు. అంతేకాక కట్టెలపొయ్యి మీద మట్టి పాత్రల్లో వండితే.. వాహ్ ఆ రుచే రుచి. ఇప్పటి తరం ఎన్ని వీడియోలు చూసి చేసినా, ఎన్ని అధునాతన, ఖరీదైన మసాలాలు జొప్పించినా వాటి అసలు రుచి రానేరాదు. అందుకే రంగనాయకమ్మ, గోవింద రాజులు దంపతులు చేస్తున్న పల్లెటూరి తాజా నాన్‌ వెజ్‌ వంటలను ఈ వారం రుచిలో అందిస్తున్నాం. మరి.. నాటి రుచులను ఎలా చేయాలో తెలుసుకుందామా..!

                                                                              బోటీ

బోటీ

కావలసినవి : బోటీ- కేజీ, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 6, గోంగూర, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 2 స్పూన్లు, ఉప్పు - తగినంత, కారం - 2 స్పూన్లు, పసుపు - 1/4 స్పూను, గరం మసాలా - స్పూను, నూనె - 1/2 కప్పు, కొత్తిమీర తరుగు
తాలింపుకు : నూనె : 1/4 కప్పు, తాలింపు దినుసులు - స్పూను, ఎండుమిర్చి - 6, పొట్టు ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు - 10
తయారీ : ముందుగా గోంగూర, నిలువుగా చీల్చిన 6 పచ్చిమర్చి, కారం, నీళ్ళు పోసి మెత్తగా ఉడికించి, తగినంత ఉప్పు వేసి మెదుపుకుని పక్కనుంచుకోవాలి.
బాండీలో నూనె వేడిచేసి ఉల్లి, పచ్చిమిర్చి తరుగును 5 నిమిషాలు వేయించాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ పచ్చివాసన పోయే వరకు వేయించాలి. శుభ్రం చేసిన బోటీ ముక్కలను వేసి ఉప్పు, కారం, తగినన్ని నీరు పోసి ఒకసారి తిప్పి మూతపెట్టి ఉడికించాలి. కూర దగ్గరకొచ్చిన తరువాత గరం మసాలా వేసి తిప్పి ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర వేసి బాగా కలుపుకుని కొత్తిమీర తరుగు చల్లి పోపు పెట్టుకోవాలి. అంతే నోరూరించే బోటీ గోంగూర కూర రెడీ.

    పీతలు

                                                                               పీతలు

కావలసినవి : పీతలు - కేజీ, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 6, ఉల్లి కాడల తరుగు - 1/4 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 2 స్పూన్లు, ఉప్పు - తగినంత, కారం - 2 స్పూన్లు, పసుపు - 1/4 స్పూను, గరం మసాలా - స్పూను, నూనె - 1/4 కప్పు, కొత్తిమీర తరుగు
తయారీ : బాండీలో నూనె వేడిచేసి ఉల్లి, పచ్చిమిర్చి, ఉల్లికాడల తరుగులను 5 నిమిషాలు వేయించాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ పచ్చివాసన పోయే వరకు వేయించాలి. దానిలో శుభ్రంచేసి పెట్టుకున్న పీతలను వేసి ఒకసారి కలిపి, ఉప్పు, కారం, తగినన్ని నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించాలి. కూర అంచుల వెంబడి నూనె విడిపోతుండగా గరం మసాలా వేసి అంతా ఒక్కసారి కలియతిప్పి కొత్తిమీర తరుగు చల్లి స్టౌ ఆఫ్‌ చేయాలి. అంతే నోరూరించే పీతల కూర రెడీ.

  కొరమీను

                                                                               కొరమీను

కావలసినవి : కొరమీను చేపలు - కేజీ, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 6, ఉల్లి కాడల తరుగు - 1/4 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 2 స్పూన్లు, ఉప్పు - తగినంత, కారం - 2 స్పూన్లు, పసుపు - 1/4 స్పూను, గరం మసాలా - స్పూను, నూనె - 1/4 కప్పు, చింత పండు - 100 గ్రా., కొత్తిమీర తరుగు
తయారీ : బాండీలో నూనె వేడిచేసి ఉల్లి, పచ్చిమిర్చి, ఉల్లికాడల తరుగులను 5 నిమిషాలు వేయించాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ పచ్చివాసన పోయే వరకు వేయించాలి. దానిలో శుభ్రంచేసి పెట్టుకున్న కొరమీను ముక్కలు, ఉప్పు, కారం వేసి ఒకసారి గంటె లేకుండా కూర కలిసేలా గిన్నెను తిప్పుతూ కలిపి, మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత చింతపండు పులుసు పోసి మరో ఐదు నిమిషాలు ఉండికించి కొత్తిమీర తరుగు చల్లాలి. అంతే ఘుమఘుమలాడే కొరమీను పులుసు రెడీ.

    రొయ్యలు

                                                                                 రొయ్యలు

కావలసినవి : రొయ్యలు - కేజీ, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 6, టమోటాలు - 2, ఉల్లి కాడల తరుగు - 1/4 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 2 స్పూన్లు, చిక్కని కొబ్బరి పాలు - కప్పు, జీరా పొడి - స్పూను, ధనియా పొడి - స్పూను, ఉప్పు - తగినంత, కారం - 2 స్పూన్లు, పసుపు - 1/4 స్పూను, గరం మసాలా - స్పూను, నూనె - 1/4 కప్పు, కొత్తిమీర తరుగు
తయారీ : బాండీలో నూనె వేడిచేసి ఉల్లి, పచ్చిమిర్చి, ఉల్లికాడల తరుగులను 5 నిమిషాలు వేయించాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ పచ్చివాసన పోయే వరకు వేయించి, ఉప్పు, టమోటా ముక్కలను వేసి తిప్పుతూ మెత్తగా అయ్యే వరకూ ఉడికించాలి. తరువాత శుభ్రం చేసిన రొయ్యలను యాడ్‌చేసి అడుగంటకుండా మధ్యమధ్యలో తిప్పుతూ మూత పెట్టిఉడికించాలి. కూర అంచుల వెంబడి నూనె విడిపోతుండగా జీరా పొడి, ధనియా పొడి, కారం వేసి కూరను బాగా కలపాలి. నిమిషం తరువాత కొబ్బరిపాలు పోసి ఒకసారి తిప్పి మూత పెట్టి ఉడికించాలి. కూర దగ్గరగా వచ్చిన తరువాత కొత్తిమీర తరుగు చల్లి స్టౌ ఆఫ్‌ చేయాలి. అంతే కమ్మని రొయ్యల కూర రెడీ.