Nov 05,2023 21:40

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:జాతీయ రహదారి నెంబరు 516ఇ విస్తరణ కోసం ధ్వంసం చేసి, స్వాధీనం చేసుకున్న భూములకు సంబంధించి ఆదివాసీలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆదివారం లేఖ రాశారు. విజయనగరం నుంచి రాజమండ్రి వరకు జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ 156ఇ) నిర్మాణానికి ప్రభుత్వం అనుమతినిచ్చిందని, దీనికోసం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అనంతగిరి, అరకు, డుంబ్రిగుడ, హుకుంపేట, పాడేరు, జి మాడుగుల, జికెవీధి, కొయ్యూరు, రాజవొమ్మంగి మొత్తం 11 మండలాల్లో రహదారి నిర్మాణ పనులను గుత్తేదారు ప్రారంభించి 30 శాతం పూర్తి చేశారని తెలిపారు. ముఖ్యంగా జిరాయితీ పట్టా భూమి, అటవీ పోడు భూములు కలిపి సుమారు 50 ఎకరాలు రహదారికి ఇరువైపులా ధ్వంసం చేశారని, ఆదివాసీలకు అటవీ పోడు భూములే ప్రధానమైన జీవనాధారమని పేర్కొన్నారు. కాఫీ తోటలు, వరి, రాజ్‌మా చిక్కుడు, పసుపు పంట సుమారు 1500 మంది సాగుచేస్తున్నారని తెలిపారు. 2005వ సంవత్సరానికన్నా ముందు అటవీ ప్రాంతంలో జీవిస్తున్న, సాగుచేస్తున్న ఆదివాసీలకు వ్యక్తిగత, ఉమ్మడి అటవీ యాజమాన్యపు హక్కును కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేని అన్నారు. పదెకరాలకు తక్కువ లేకుండా వ్యక్తిగత అటవీహక్కు పత్రాలు జారీచేయాల్సిన అధికారులు హక్కు పత్రాలు లేవని మాయమాటలు చెప్పి బలవంతంగా లాక్కొన్నారని, తాగునీరు పైపు, గ్రామ ఆలయాన్ని కూడా ధ్వంసం చేశారని వివరించారు. జికెవీధి మండలం, పెదవలస పంచాయతీ (4), సంకడ పంచాయతీ (6), రింతాడ పంచాయతీ (4) గ్రామాల్లో వున్న స్థానిక ఆదివాసీలు జాతీయ రహదారి నిర్మాణంలో సాగు భూమి కోల్పోయినా.. వారికి నేటికీ నష్టపరిహారం చెల్లించలేదని సిపిఎం నిర్వహిస్తున్న ప్రజారక్షణ భేరి బృందానికి ఆయా గ్రామాల ప్రజలు వినతిపత్రాలు సమర్పించారని తెలిపారు. 5వ షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉన్న గ్రామాల్లో భూసేకరణకు ఆదివాసీ గ్రామసభ (పీసా) అభిప్రాయం, ఆమోదమూ తీసుకోలేదని వివరించారు. అటవీహక్కుల కమిటీ (ఎఫ్‌ఆర్‌సి) తీర్మానమూ లేకుండా వందలాది ఎకరాల కాఫీ తోటలు, పచ్చని చెట్లను కూడా తొలగిస్తున్నారని పేర్కొన్నారు. కనీసం రహదారి నిర్మాణ బాధితుల జాబితా వివరాలనూ పంచాయతీ, సచివాలయం కేంద్రంలో ప్రదర్శించలేదని లేఖలో తెలిపారు. అమాయక ఆదివాసీలపై దౌర్జన్యానికి పాల్పడిన ఎన్‌హెచ్‌516ఇ ఆధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు అటవీహక్కుల చట్టం ప్రకారం పోడు వ్యవసాయానికి భూమి కేటాయించాలని, తక్షణమే గ్రామసభ నిర్వహించి బాధితుల జాబితాను ప్రకటించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం మంజూరు చేయాలని, బాధిత ఆదివాసీలకు న్యాయం జరిగేట్లు చూడాలని కోరారు.