జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా జడ్జి ఎన్.శ్రీనివాసరావు
ప్రజాశక్తి- నందిగామ (ఎన్‌టిఆర్) : జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నందిగామ 16వ కృష్ణా జిల్లా న్యాయస్థానం జిల్లా జడ్జి ఎన్. శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం నందిగామ 16వ కృష్ణాజిల్లా న్యాయస్థానం వద్ద జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్ ప్రారంభ సభలో జిల్లా జడ్జి ఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ... కక్షిదారులు అహంకారానికి వెళ్లకుండా కేసులను తక్షణమే పరిష్కరించుకోవాలని కోరారు. సమాజంలో మహిళలు, న్యాయవాదులు, న్యాయధికారులు, కక్షిదారుల పాత్ర ఎంతో ఉందని అందరూ సమిష్టిగా పనిచేసి సత్వర న్యాయం పొందాలని కోరారు. నందిగామ సబ్ కోర్టు జడ్జి వి.లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ ... ప్రతి ఒక్కరూ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా సానుకూల దృక్పథంతో తమ పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. నందిగామ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి సి.రమణారెడ్డి మాట్లాడుతూ ... కక్షిదారులు తమ విలువైన సమయాన్ని కాలయాపన చేయకుండా కేసులు రాజీమార్గంలో పరిష్కారం చేసుకోవాలని కోరారు. నందిగామ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు విజరు కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మహాలక్ష్మి, సీనియర్ న్యాయవాదులు బొందలపాటి రామకృష్ణ, మట్టా ప్రసాద్, గింజుపల్లి రమేష్, చిరుమామిళ్ళ శ్రీనివాసరావు, ఆజాద్ పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు ప్రసంగించారు.










