
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా ఉంది. వివిధ రాజకీయ పార్టీలు, పలువురు ప్రముఖులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆనాడున్న వివిధ వైద్య కళాశాలలు, ఆయా ప్రాంతాల్లోని సాధారణ యూనివర్సిటీలకు ఎఫిలియేట్ అయినందున వేర్వేరు అడ్మిషన్ షెడ్యూల్స్‌తోపాటు పరీక్షలు కూడా ఏక కాలంలో లేకపోవడం తదితర అసంగతాల నేపథ్యంలో వైద్య విద్యలో ఏకరూపత తీసుకురావడానికి ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎంతగానో దోహదం చేసింది. అన్ని వైద్య విధానాలను, పారా మెడికల్ కోర్సుల పర్యవేక్షణను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చారు. దేశంలోనే తొలి వైద్య విశ్వవిద్యాలయమిది. ఆ తరువాతనే ఇంకొన్ని రాష్ట్రాలు ఆ బాట పట్టాయి. అంతటి చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకొన్నది నాటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు. వైద్య విశ్వవిద్యాలయ వ్యవస్థ పకడ్బందీగా రూపొందించడానికి తీవ్రంగా కృషి చేశారు. ఆయన మరణానంతరం ఆ విశ్వవిద్యాలయానికి ఎన్టిఆర్ పేరు పెట్టారు. ఎన్‌టి రామారావు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు, తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు. దేశంలో పేరెన్నికగల నాయకుడు. ఇదంతా దశాబ్దాల చరిత్ర. ఇప్పుడు హఠాత్తుగా ఆ పేరు మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం సరైనది అనిపించుకోదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మార్చడం మంచి సంప్రదాయం కాదు.
వైద్య ఆరోగ్యరంగ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేసిన వారికి గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే యూనివర్శిటీ పేరును మారుస్తున్నామని సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభలో అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైద్య ఆరోగ్య రంగంలో ఎన్నో మంచి పనులు చేశారు. వాటిలో అనేకం చిరస్థాయిగా మిగిలిపోతాయన్నదీ నిజం. ఆయనకు గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అనుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త సంస్థనో వ్యవస్థనో ఏర్పాటు చేసి దానికి వైఎస్ఆర్ పేరు పెట్టవచ్చు. ప్రతిష్టాత్మకంగా, ప్రజా ప్రయోజనకరంగా నిర్వహించవచ్చు. అంతే తప్ప అందుకోసం ఇప్పటికే ఉన్న ఒక సంస్థ పేరు మార్చడం సరికాదు. జనానికి ఇప్పటికే అలవాటైన పేర్లను మార్చడం కంటే ఒక ఉత్కృష్ట సంస్థను ఏర్పాటు చేసి నామకరణం చేసే దిశగా ప్రభుత్వం యోచించడం మంచిది. అయితే ఒక ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి లేదా మాజీ ప్రభుత్వాధినేతల పేరిట ప్రభుత్వ పథకాలు, సంస్థలు లేదా వ్యవస్థలను ఏర్పాటు చేయడం, ఆ పార్టీ అధికారం కోల్పోయి ఇంకో పార్టీ అధికారం చేపట్టాక ఆ పేర్లు మార్చడం విజ్ఞత అనిపించుకోదు. అది సుపరిపాలనకు ఏవిధంగానూ తోడ్పడదు. ప్రజా ప్రయోజనాలే పాలకులకు పరమావధిగా ఉండాలి. ప్రజాభిమానం పొందడానికి షార్ట్‌కట్స్ ఉండవు.
కొన్ని వీధులు మొదలు మహా నగరాల వరకూ అనేక పేర్లను మార్చడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నదే! అయితే, ఆ మార్పుల వెనుకగల కారణాలేమిటి, నెరవేరే ప్రయోజనాలేమిటి అన్నది పరిశీలించాలి. నిజంగా అవి ప్రజల మనోభావాలకు, చారిత్రక ప్రాధాన్యతకు పెద్దపీట వేసేవా లేక ఎవరో కొందరి ప్రయోజనాల కోసమా అన్నదీ చూడాలి. ఇందుకు కొన్ని గొప్ప ఉదాహరణలు, ఇంకొన్ని చెత్త ప్రయత్నాలూ ఉన్నాయి. ప్రపంచ మానవాళికి ఫాసిజం నుండి విముక్తిని ప్రసాదించిన సోవియట్ ఎర్ర సైన్యానికి నాయకత్వం వహించిన జోసెఫ్ స్టాలిన్ పేరిట పెట్రోగ్రాడ్ పేరు మార్పును అందరూ స్వాగతిస్తారు. మన దేశంలోనూ వలస పాలననాటి మద్రాస్, వాల్టేర్ తదితర పేర్ల మార్పు వెనుక బ్రిటిష్ వ్యతిరేక స్ఫూర్తి ఉంది. ఇలాంటివి అవసరం. కాని గాంధీ, నెహ్రూ వంటి జాతీయోద్యమ నాయకుల పేరిట లేదా వారి స్మృతి చిహ్నాలుగా ఉన్న వీధులు, ప్రాంతాలు, సంస్థల పేర్లు మార్చడానికి, ప్రార్థనా స్థలాల విషయంలోనూ విద్వేషాలు రెచ్చగొట్టడానికి సంఘపరివార్ శక్తులు చేస్తున్న కుయత్నాలు అలాంటి స్ఫూర్తికి పూర్తిగా భిన్నం. ఇటువంటివాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.