Jan 29,2023 08:37

బురద గుంటల్లో
పాదాలను చిలకరిస్తూ
పసిపిల్లల కేరింతలు

చిరుజల్లులు
అప్పుడే విరిసిన
ఆనందాల హరివిల్లు
విప్పారి చూస్తున్న చిరుకళ్లు

ఇంటి ముందు నుంచి
పారుతున్న పిల్ల కాలువలో
కాగితప్పడవల విన్యాసం

తొలకరి వాన చినుకులతో
పులకిస్తున్న పుడమి
గుమ్మనంగా మట్టి వాసన

చిట్టచివరి కొమ్మలపై
పిట్టల సంగీత విభావరి
అడవి అడవంతా
పురివిప్పిన మయూరం

అల్లంత దూరంలో అలల సవ్వడి
పురాస్మృతుల్ని
తనలో కలుపుకుంటున్న సంద్రం

నిశ్శబ్దంగా రంగులద్దుకున్న
హృదయపు లయలు
అక్కడ.. తారే జమీన్‌ పర్‌

ప్రకృతి ఒడి నుంచీ
ఒక లిచీ ఒక చెర్రీ
ఇంకా ఏదో ఆస్వాదించటానికి
తడిసి ముద్దవుతున్న
లేలేత దేహాలు

వొకానొక కన్నుల పంట
అంతిమంగా స్టార్‌ఫ్రూట్‌
నోరూరించే నక్షత్ర ఫలం
ఆకాశం నుంచి కాదు
భూమ్మీదనే..!

డా. కటుకోఝ్వల రమేష్‌
99490 83327