ప్రతి నిత్యం ఆకాశవాణి వార్తల
ఇంటి కష్టాలను చదువుతూ
చాట్లో బియ్యం పోసుకుని
మెరికే గింజల్ని ఏరిపోస్తూ
నిప్పులపై సలసల మరిగే
ఎసట్లో బియ్యం బోసి
తెడ్డుతో గలిపిన అమ్మకే ఎరుక
బియ్యంబస్తా బరువు...
అమాసకి సన్నవడి పున్నానికీ
పొద్దెక్కినట్లు కాకుండా
నిత్యసూర్యుడై పాలజొన్న కంకులను
వలస పక్షులు పాడుచేయకుండా
కావలి కాస్తున్న రైతులా
మన రాతలు రాస్తున్న
మట్టిమనిషి విలువ
అమ్మకే ఎరుక ..
ముంగారు కంటే ముందే
గట్టి విత్తనాలను మూటగట్టినట్లు
తన చిల్లులు పడిన జేబులో దాచిన చిల్లర విలువ
అమ్మకే ఎరుక ...
సచ్చిన మేకపిల్ల తోలుపై దరువేస్తూ
తన శ్రమను దోచిన
దాయాదుల దమననీతిని
దాపరికం లేకుండా జెప్పిన
మట్టిమనిషి నాయిన ..
నులక మంచాన్నే
నెమలి సింహాసనంగా ..
గుండుదారాన్నే
గుండెకు అదెరువుగా ..
వాస్తుశాస్త్రాన్ని అవపోశనపట్టిన పెద్దమేస్త్రీ
అక్షరజ్ఞానం లేని
నవ ఇంజనీర్ నాయిన..
విష్ణుమూర్తి చేతిలోని
శంఖ చక్రాలు
మా నాయిన చేతిలోని తాపిపల్లాలే..
అమ్మ ముఖంలో వెలుగుకై
కాళ్ళకు చక్రాలు కట్టుకొని
విశ్వాన్ని చుట్టివచ్చిన
పరశురాముడు నాయిన
ఏడుకొండల వాడికే
నిలువ నీడగట్టిన
వెంకట్రాములు మా నాయిన
ఉప్పరి తిరుమలేష్
96189 61384