Oct 16,2022 08:48

సూర్యప్రతాపానికి బెదిరిన మేఘాలన్నీ
లేడిపిల్లల్లా పరుగులు తీస్తున్నాయి,
కలిసి చాన్నాళ్ళయినట్లుంది
పూర్వవిద్యార్థుల్లా ఒక్కచోట చేరి
తెగ ముచ్చట్లాడుతున్నాయి,
వాటి నవ్వులముత్యాలు
వానచినుకులై రాలిపాడుతున్నాయి,
పుడమిగొంతులో పడిన చినుకులు
పచ్చని ముత్యాలై చిగురించడం మొదలుపెట్టాయి!

ఎదురుచూసి ఎదురుచూసి
అలసిపోయిన ఎడారిమనసు
ఒక్కసారిగా ప్రేమవర్షంతో నిండిపోయింది,
దిగులుగా వాలిన మట్టిగుండె
కరిగి కరిగి ఊపిరి నింపుకుంది!

వర్షం ఎంత పనిచేసింది
ఒక్కసారిగా ఎండముల్లును
అవతలికి విసిరిపడేసింది,
వేడివేడి నిట్టూర్పులన్నిటినీ
చటుక్కున ఊది పారేసింది!

ఇన్నాళ్లు నిప్పులు కక్కిన సూర్యుడు
మేఘాల వెనక దాగిపోయి
తన మాట చెల్లదని చల్లబడ్డాడు,
మట్టితో చుట్టరికం చేసే రైతు
లోకానికి తిండి పెట్టడానికి సిద్ధమయ్యాడు!

- పుట్టి గిరిధర్‌
94914 93170