లోలోపల సంఘర్షణ
గూడు కట్టుకున్న భావాలు
మతిలో మెదులుతున్న ఆలోచనలు
సిద్ధాంత, తాత్విక చింతనలు
కల్పన యుద్ధ కవిత్వమై
ఈ లోకమే ప్రేరణ
మేఘం వర్షిస్తే ..భూమి పులకరిస్తే
భూ పొరలను చీల్చి
మొలకెత్తే విత్తనంలా
శ్రమశక్తి సృష్టించే ఉత్పత్తిలా..
పారే ఏరులా..ఎగిసిపడే ఉప్పెనలా
మండే గుండెలో ప్రవహించే నెత్తురులా
ప్రజా సంకల్ప కవిత్వం సృజించాలని
నా కలం నుండి ప్రతి అక్షరం జనించనే
అందమైన ఊహలెన్నో ఊసులాడేలే
అంతులేని అక్షరాల మాల అల్లేనే
కలం కన్నులు చూడని ప్రజా అక్షరమే
చూస్తున్నది నేడు నా కవిత్వమే..
సామాజిక రుగ్మతలపై
సంధించిన బాణాన్ని
పొంగిపొర్లుతున్న కవిత్వాన్ని
కదులుతున్న, సాగుతున్న కలాన్ని..
జ్ఞాన సేకరణ సేద్యం చేస్తున్న నిరంతర శ్రామికుడని..
ఎస్‌కె బాజీ సైదార
88972 82981