May 07,2023 07:43

అక్కడ నిలబడి చూస్తేనే కదా
దూప ఉట్టిన నేల
అర్సుకున్న తీరు బోధపడతది
అక్కడ మనసు వెట్టి చూస్తేనే కదా
గుండెవల్గిన పానం
మళ్ళీ.. నెగడులై కనిపించేది

అక్కడ మాట పుట్టనప్పుడు
పాటనో కవితనో పుట్టి
నిన్ను నీవు కొత్తగా ఆవిష్కరించుకునేది
కొత్తబాటకు ఊరు నుంచే
జోడెడ్ల బండి గట్టుకొని
మళ్ళీ నూతనత్వాన్ని చల్లుకుంటు సాగేది...

అక్కడ నిలబడినప్పుడు
అన్ని కొత్తగనే ఉంటాయి
మనిషి పాతబడినప్పుడు
కొత్తదేముంటది
అక్కడ పూసిన
ఎన్నో తడారని ప్రేమపూలను
గుండెగుమ్మిల నుండి ఎవరు దోయరు
ఇషం చిమ్మే కోరలను ఇడ్వకుండ
గాడనే నవ్వుకుంట చిలిమేస్తరు

మనం ఎన్కకు మళ్ళీ
అప్పుడప్పుడు పాత తొవ్వలను
కాళ్ళతో ముద్దిచ్చి రావాలి
మనల్ని మనమే వెతుక్కుంటూ
కొత్త చిరునామను కనుక్కోవాలి
ఇప్పుడు.. నా చిరునామా మారింది
అమ్మ జూపిన తొవ్వ
ముందల నడుస్తుంది

- బోల యాదయ్య,
9912206427