Aug 28,2023 10:37

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎన్‌టిఆర్‌ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ముద్రించిన ఎన్‌టిఆర్‌ నాణాన్ని సోమవారం ఆవిష్కరించనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ నాణాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే ఎన్‌టిఆర్‌ కుటుంబ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. 44 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్‌, 5 శాతం జింక్‌తో తయారు చేశారు. అలాగే ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్‌టిఆర్‌ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఎన్‌టిఆర్‌ శతజయంతి ఈ ఏడాదితో ముగిసింది. కనుక 1923- 2023 అని ముద్రితమై ఉంది. ఎన్‌టిఆర్‌ రూ.వంద నాణెం విడుదల కార్యక్రమానికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపిన విషయం తెలిసిందే. ఇక టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆయన ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. నాణేం విడుదల తరువాత చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌లో దొంగ నోట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు.