ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : సెప్టెంబర్ 5 న విశాఖపట్నంలోని కళాభారతిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవం నిర్వహిస్తున్నామని లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఆదివారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ ... ప్రతి సంవత్సరం జనవరి 18 న ఎన్టీఆర్ వర్ధంతి, అమితాబచ్చన్ తండ్రి హరివన్స్రారు బచ్చన్ వర్ధంతి సందర్భంగా వార్షిక సాహిత్య పురస్కారం కార్యక్రమాన్ని ఈ ఏడాది ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలతో కలిపి నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా గత 18 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న లోక్ నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారంను ఈ ఏడాది తనికెళ్ల భరణి ప్రదానం చేస్తున్నట్టు తెలిపారు. ఈ పురస్కారం జ్ఞాపికతోపాటు రెండు లక్షల నగదును అందజేస్తామని అన్నారు. ఎన్టీఆర్ కు సుదీర్ఘకాలం సేవలందించిన ప్రత్యేక అధికారి గోనేటి రామచంద్రరావు, వ్యక్తిగత సహాయకులు మోహన్, భద్రతాధికారి కృష్ణారావు, డ్రైవర్ లక్ష్మణులను తలా ఒక లక్ష రూపాయలు నగదు తో సత్కరించినట్టు తెలిపారు. ఈ శత జయంతి ఉత్సవంకు ముఖ్య అతిథిగా మిజోరం గవర్నర్ కంపంపాటి హరిబాబు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మంచు మోహన్ బాబు, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, లోక్ సత్తా వ్యవస్థాపకులు ఎన్.జయ ప్రకాష్ నారాయణ, విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ ఏ.కృష్ణారావు హాజరవుతారని తెలిపారు.










