Jan 24,2023 07:39

ఉమ్మడి విశాఖ జిల్లాలో పరవాడ రాంకీ ఫార్మాసిటీ, హెటిరో, దివీస్‌, అచ్యుతాపురం సెజ్‌లలో 150 కంపెనీలు ఉన్నాయి. వేలాది మంది కార్మికులు పని చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణమే అందుబాటులో ఆసుపత్రులు కూడా లేవు. సిఎస్‌ఆర్‌ నిధులు కేటాయించి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించగల యాజమాన్యాలు కూడా ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వాల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో యాజమాన్యాలు ఇవేవీ పట్టించుకోవడం లేదు. బ్రాండిక్స్‌ యాజమాన్యం త్వరితగతిన గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును అమలు చేయాలి. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి.

నకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌ లోని బ్రాండిక్స్‌ పరిశ్రమలో సుమారు 16 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో అత్యధికులు మహిళా కార్మికులే. ఈ పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో 2022 జూన్‌ 3, ఆగస్టు 2 తేదీల్లో రెెండు నెలల వ్యవధిలోనే రెండు సార్లు విషవాయువులు లీక్‌ అయ్యాయి. కార్మికులు కళ్లు తిరిగి, వాంతులు చేసుకుని కంపెనీ పరిసర ప్రాంతాల్లో అచేతనంగా పడిపోయారు. వారిని వాహనాలతో చుట్టుపక్కల ఆసుపత్రుల్లో చేర్పించారు. 539 మంది తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. బాధితులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. యాజమాన్యం కూడా అంతంతమాత్రంగానే సాయం చేసింది. ప్రసార మాధ్యమాల్లో ఈ ఘటనను చూసిన గౌరవ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) సుమోటోగా ఈ కేసును తీసుకొని ఈ నెల 18న తుది తీర్పు ఇచ్చింది. త్రిసభ్య ధర్మాసనం ఈ ఘటనలో 539 మంది బాధితులకూ ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున రూ.5 కోట్ల 39 లక్షలు చెల్లించాలని, పర్యావరణ పునరుద్ధరణ కోసం రూ.4 కోట్లా 61 లక్షలు పర్యావరణ కేంద్రానికి ఇవ్వాలని, మొత్తం రూ.10 కోట్ల జరిమానా విధించింది. బాధితులకు మూడు నెలల్లోనూ, పర్యావరణానికి ఆరు నెలల్లోనూ చెల్లించాలని ఆదేశించింది. ఎన్‌జిటి ఆదేశాలను బ్రాండిక్స్‌ మేనేజ్‌మెంట్‌ తక్షణమే అమలు చేయాలి. గ్రీన్‌ టిబ్య్రునల్‌ ఇచ్చిన తీర్పు కార్మికుల్లో మనోధైర్యాన్ని నింపింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) బృందం, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసిఎంఆర్‌) బృందం కూడా ఈ సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించాయి. ఈ బృందాలు ఇచ్చిన నివేదికల ఆధారంగా గ్రీన్‌ ట్రిబ్యునల్‌ బాధితులకు ఊరటనిచ్చే మంచి తీర్పునిచ్చింది. బాధితులు నేటికీ తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. ప్రభుత్వం, యాజమాన్యం ఈ ఘటనలో కుమ్మక్కై ఆరు నెలలుగా వాస్తవాలను మరుగునపరిచారు. ప్రభుత్వం వేసిన విచారణ కమిటీ నేటికీ నివేదికను బహిర్గతపరచలేదు. నష్టం ఏం జరిగింది? నివారణ చర్యలు ఏమిటి? భవిష్యత్తులో ఇలాంటి విష వాయువులు వెదజల్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తెలపలేదు. బ్రాండిక్స్‌ యాజమాన్యానికి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పనక్కర్లేదు. ప్రమాదంలో అమ్మోనియం వాయువు పీల్చారని ప్రచారం చేశారు. అమ్మోనియం వాయువు పీల్చిన లక్షణాలేవీ లేవని ''సైంటిస్ట్స్‌ ఫర్‌ ది పీపుల్‌'' ప్రకటించింది. అమ్మోనియం విడుదల అయి వుంటే బయోమేకర్‌ మెటబాలిస్‌ ద్వారా గుర్తించివచ్చని పేర్కొన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో వేసిన కమిటీ రిపోర్టు నేటికీ బహిర్గతం చేయలేదు.
            ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలో 2003లో మొదటి దశ ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఇజెడ్‌) పది వేల ఎకరాలతో ఏర్పడింది. రైతులకు అతి తక్కువ నష్టపరిహారం ఇచ్చి భూసేకరణ చేశారు. ఆర్థిక మండలిలో విదేశీ, స్వదేశీ కంపెనీలకు అనేక రాయితీలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ రాయితీలను ఉపయోగించుకుని వచ్చిన కంపెనీ బ్రాండిక్స్‌ ఇండియా అపెరల్‌ సిటీ (బిఐఎసి) పార్కు. ఈ కంపెనీకి వెయ్యి ఎకరాల భూమి కేటాయించారు. ఒక ఎకరాకు ఒక రూపాయి చొప్పున సంవత్సరానికి వెయ్యి రూపాయల లీజుకు ఇచ్చారు. ఇది శ్రీలంకకు చెందిన కంపెనీ. ఈ బహుళజాతి కంపెనీలో లోదుస్తులు, టీ షర్టులు, షార్టులు, లెగ్గింగ్స్‌ తదితర దుస్తులు తయారుచేసి అమెరికా, ఇంగ్లాండ్‌, యూరప్‌, తదితర దేశాలకు ఎగుమతులు చేస్తారు. భారతదేశంలో అతి పెద్ద దుస్తులు ఎగుమతి చేసే కంపెనీ ఇది. ఇక్కడ తయారుచేసే దుస్తులకు విదేశాల్లో విపరీతమైన గిరాకీ ఉంది. ఒక్కొక్క ఇన్నర్‌ విలువ వేల రూపాయల్లో ఉంటుంది. బ్రాండిక్స్‌లో లోదుస్తులు తయారు చేసే 14 పరిశ్రమలు ఉండేవి. నేడు ఎన్ని ఉన్నాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వం వెయ్యి ఎకరాలు మంజూరు చేసినప్పుడు 60 వేల మందికి ఉపాధి కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి వాగ్దానం చేశారు. ఇంతవరకు గరిష్టంగా 22 వేల మందికి మాత్రమే ఉపాధి కల్పించారు. ఈ పరిశ్రమలకు 60-70 కిలోమీటర్ల నుంచి కార్మికులు నిత్యం పనికి వస్తుంటారు. బ్రాండిక్స్‌లో ప్రస్తుతం సుమారు 16 వేల మంది పని చేస్తున్నారు. వీరిలో మహిళలు, అందునా ఒంటరి మహిళలు అత్యధికం. ఈ కంపెనీలో 16 మంది కార్మికులు ఒక యూనిట్‌గా పని చేస్తారు. వారిలో ఏ ఒక్కరు మిషన్ల స్పీడ్‌ను అందుకోకపోయినా అనుకున్న ఉత్పత్తి సమయానికి ఇవ్వలేరు. తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక కొంతమంది మహిళలు మధ్యలోనే ఉద్యోగానికి స్వస్తి పలుకుతున్నారు. గతంలో ఇచ్చిన ప్రోత్సాహకాలు తగ్గించేస్తున్నారు. దుమ్ము, ధూళి కాలుష్యంతో అనారోగ్య సమస్యలు అనేకం ఉత్పన్నమవుతున్నాయి. మేనేజ్‌మెంట్‌ నాణ్యమైన మాస్కులుగానీ, భద్రతా పరికరాలనుగానీ ఇవ్వడం లేదు. ఈ దుస్థితిలోనే కార్మికులు పనిచేస్తున్నారు.
       నేడు కొన్ని కంపెనీలు మూతపడుతున్నాయి. కార్మికుల కనీస వేతనాలను అమలు చేయడంలో కూడా తీవ్రమైన జాప్యం జరుగుతోంది. కార్మికులకు చట్టం ప్రకారం ఇవ్వాల్సిన నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదు. ఈ ఆర్థిక మండలిలో రాజ్యాంగం పేర్కొన్న ప్రాథమిక హక్కులు కూడా అమలు కావు. కార్మిక సంఘాలకు అనుమతి లేదు. సమ్మెలు నిషేధం. ఆందోళనలు చేయరాదు. 'ప్రత్యేక ఆర్థిక మండళ్లు దేశ అభివృద్ధికి సోపానాలు' అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి. దానికి భిన్నంగా ప్రభుత్వాలు ఇచ్చిన రాయితీలను ఉపయోగించుకుని లాభాలు పొందుతున్నాయి. లేకపోతే రాయితీలు, లాభాలు ఎక్కడ వస్తే అక్కడకు వెళ్లిపోతున్నాయి. యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
 

                                                                 భద్రతా ప్రమాణాలు ఎక్కడ ?

ఆర్థిక మండళ్లలో భద్రతా ప్రమాణాలను సరిగా పాటించరు. భద్రతా ఆడిటింగ్‌ చేయడంలో తీవ్రమైన వైఫల్యాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏ పరిశ్రమలో ప్రమాదాలు సంభవిస్తాయో తెలియదు. రసాయనిక మార్పులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలిపే ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నా దాన్ని మన పరిశ్రమల్లో వాడటం లేదు. పైగా విదేశాల్లో వాడి వదిలేసిన పాత టెక్నాలజీనే వాడుతున్నారు. దానికి ప్రభుత్వాలు పర్మిషన్లు ఇస్తున్నాయి. ఈ పరిశ్రమల్లో పనిచేస్తున్న వారు ఎక్కువ మంది యువతీయువకులే. అలాంటి వాళ్లను కాపాడుకోవాల్సిన యాజమాన్యాలు వారి నిండు ప్రాణాలకు ఖరీదు కట్టి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ప్రభుత్వ కార్మిక శాఖ, ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్‌, పర్యావరణ పరిరక్షణ బోర్డు, లేబర్‌ డిపార్టుమెంట్‌ ఉమ్మడిగా పని చేసి భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీలపై చర్యలు తీసుకున్న దాఖలాలు అతి తక్కువగానే ఉన్నాయి. ఎప్పుడైనా పెద్ద ప్రమాదం సంభవిస్తే భద్రతా ప్రమాణాలు గుర్తుకు వస్తాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి భద్రతా ఆడిటింగ్‌ చేయాలని నిబంధన ఉన్నా తుంగలోకి తొక్కుతున్నారు. ఫార్మా కంపెనీల్లో రోజూ ఏదోఒక ప్రమాదం సంభవిస్తూనే ఉంటోంది. వేలాది మంది పని చేస్తున్న చోట భద్రతా ప్రమాణాల డొల్లతనం కోకొల్లలు. విడివిడిగా ఉన్న పరిశ్రమల్లో చెప్పనక్కర్లేదు.
          కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులను పూర్తిగా యాజమాన్యాల దయాదాక్షిణ్యాలకు వదిలేసేలా కార్మిక చట్టాలలో సమూల మార్పులు చేసింది. కార్మికుల ప్రాణాలకన్నా లాభాలే పరమావధిగా వుంది. భద్రతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చి యాజమాన్యాలకు కొమ్ముకాస్తోంది. ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులు చైతన్యవంతంగా పోరాడినప్పుడు కొంత నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. సెజ్‌ల్లో భద్రతా వైఫల్యాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వికలాంగులైన వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వీరిని ఆదుకునే నాథుడే లేకపోయె. ఉమ్మడి విశాఖ జిల్లాలో పరవాడ రాంకీ ఫార్మాసిటీ, హెటిరో, దివీస్‌, అచ్యుతాపురం సెజ్‌లలో 150 కంపెనీలు ఉన్నాయి. వేలాది మంది కార్మికులు పని చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణమే అందుబాటులో ఆసుపత్రులు కూడా లేవు. సిఎస్‌ఆర్‌ నిధులు కేటాయించి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించగల యాజమాన్యాలు కూడా ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వాల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో యాజమాన్యాలు ఇవేవీ పట్టించుకోవడం లేదు. బ్రాండిక్స్‌ యాజమాన్యం త్వరితగతిన గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును అమలు చేయాలి. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి. కార్మికులు పనిచేసే చోట మనోధైర్యాన్ని ఇచ్చే పద్ధతిలో ప్రభుత్వాల పర్యవేక్షణ వుండాలి.

(వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)
కె. లోకనాథం

కె. లోకనాథం