Jul 20,2022 06:52

కోడిగుడ్డు నిషేధం లాంటి ఈ ప్రక్రియ ద్వారా... పౌష్టికాహార విషయంలో పిల్లలకూ, పెద్దలకూ ఒక తప్పుడు సమాచారాన్ని  ఇస్తున్నారు. కోట్లాది మంది పిల్లలకు పౌష్టికాహారాన్ని దూరం చేయడమే కాకుండా, ఆహారం కోసం వచ్చి ఆ విధంగా చదువుకునే నిరుపేద పిల్లలకు చదువును కూడా దూరం చేసే మనువాద భావజాలం ఇక్కడ అంతర్లీనంగా ప్రస్ఫుటమౌతున్నది. ఇవే అంశాలను సిలబస్‌ లోనూ చొప్పించి మొత్తానికి మసి పూసేందుకు విద్యా శాఖ కంకణం కట్టుకున్నట్లు కనబడుతుంది.

జాతీయ విద్యా విధానంలో పొందుపరచిన కొత్త లొసుగు ఒకటి బయటపడింది. అది నేరుగా పిల్లల ఆరోగ్యం మీదా దేశ భావితరాల భవిష్యత్‌ మీదా ప్రభావం చూపబోతున్నది. ఒక విధంగా నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ-2020 పేరుతో మొత్తానికి దేశ సంస్కృతి మీద దాడి జరుగుతున్నది. 140 పేజీల బహిర్గతం కాని ఎన్‌.ఇ.పి డాక్యుమెంట్‌లో దాగిన అంశాల్లో బయటపడిన దారుణ అంశం ఏమిటంటే... ఇకపై మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్డుకూ మాంసాహారానికి స్వస్తి పలకాలని నిర్ణయించడం. ఇది ఒక ఎత్తైతే ఆ నిర్ణయానికి చూపిన జుగుప్సాకరమైన కారణాలు మరొక ఎత్తు. కోడిగుడ్డు, మాంసాహారం దేశానికీ, దేశ ఆరోగ్యానికీ హానికరమని నిర్ధారించారు. దీనికి జాతీయవాదమనే మరొక పదాన్ని చేర్చి మోసపుచ్చే ప్రయత్నానికి పూనుకున్నారు ఈ జాతీయ విద్యా విధానకర్తలు (అంటే ఆరెస్సెస్‌ వారే అని చెప్పకనే అర్ధమవుతున్నది). కోడిగుడ్డు, మాంసాహారం మధ్యాహ్న భోజన పథకం నుండే కాదు. ఆ ఆహార సంబంధ అంశాలను మొత్తం పాఠ్యాంశాల నుండి కూడా తొలగించనున్నారు. ఇప్పటికే పాఠ్యాంశాలలో గోల్వాల్కర్‌ లాంటి వారు వచ్చి చేరారు. విషయానికొస్తే చాలా అశాస్త్రీయమైన నిర్హేతుకమైన కారణాలు చూపి ఇటువంటి నిర్ణయాలను దేశ భవిష్యత్తుపై రుద్దడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. కోడిగుడ్డు, మాంసాహార నిషేధ నేపథ్యంలో తగిన మద్దతు కోసం వారు వాడిన కొన్ని పదాలు అర్ధరహితాలుగాను అతివాద మూర్ఖత్వంగాను అనిపిస్తున్నాయి. 'జీన్‌ డైట్‌ ఇంటరాక్షన్‌', 'ఇండియన్‌ యత్నిసిటీ', 'నేచురల్‌ చాయిస్‌', 'రేస్‌', 'హోలిస్టిక్‌' లాంటివి మచ్చుకు కొన్ని. అంటే కోడిగుడ్డు తింటే శరీరంలో జన్యుపరమైన అనారోగ్యం వస్తుందట. భారతీయ స్వజాతీయతకు అడ్డంకిగా ఉంటుందట. అందరూ గుడ్డును సహజంగా కోరుకోకపోవచ్చు. లేదా ఇష్టపడకపోవచ్చట. ఈ డాక్యుమెంట్‌ని తయారుచేసిన ఎనిమిది మంది అపర మేధావులలో ఉపాధ్యాయులుగానీ పిల్లల తల్లిదండ్రులుగానీ లేరు.
     కోడిగుడ్డు నిషేధం లాంటి ఈ ప్రక్రియ ద్వారా... పౌష్టికాహార విషయంలో పిల్లలకూ, పెద్దలకూ ఒక తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు. కోట్లాది మంది పిల్లలకు పౌష్టికాహారాన్ని దూరం చేయడమే కాకుండా, ఆహారం కోసం వచ్చి ఆ విధంగా చదువుకునే నిరుపేద పిల్లలకు చదువును కూడా దూరం చేసే మనువాద భావజాలం ఇక్కడ అంతర్లీనంగా ప్రస్ఫుటమౌతున్నది. ఇవే అంశాలను సిలబస్‌ లోనూ చొప్పించి మొత్తానికి మసి పూసేందుకు విద్యా శాఖ కంకణం కట్టుకున్నట్లు కనబడుతుంది. ''పొజిషన్‌ పేపర్‌ ఆన్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌ బీయింగ్‌'' డాక్యుమెంట్‌లో ఈ విధంగా రాశారు. ''కోడిగుడ్డు, ఫ్లేవర్డ్‌ మిల్క్‌, బిస్కెట్లు లాంటి వాటిని నిషేధించాలి. ఎందుకంటే వీటిలో ఉన్న అధిక క్యాలరీలూ, కొవ్వు పదార్థాలు ఊబకాయానికి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయి. భారతీయుల శరీర ఆకృతి దృష్ట్యా కోడిగుడ్డు, మాంసం లాంటి కొవ్వు పదార్ధాలు తింటే షుగరు, రుతు సంబంధ సమస్యలు, వంధత్వం లాంటి జీవనశైలికి సంబంధించిన రోగాలు సంక్రమిస్తాయి. మాంసాహారాన్ని తినడం వలన అవి హార్మోన్ల సమస్యలకు దారితీస్తాయని దేశవ్యాప్తంగా జరిపిన పరిశోధనలలో తేలింది. భారత స్వజాతీయతకు, మన జాతికి అవసరమైన సహజమైన ఆహారమేదో జీన్‌-డైట్‌ ఇంటరాక్షన్‌ ద్వారా తెలిసింది'' అంటూ రాసుకొచ్చారు. దీని ద్వారా వీరు తమ హిందుత్వ ఎజెండాను బహిరంగంగా జాతీయ విద్యా విధానం లోకి ఎక్కిస్తున్నారు. వారు చేస్తున్న వాదనలకు ఎటువంటి పరిశోధనల రుజువులను గానీ సాక్ష్యాలనుగానీ చూపలేదు. అసలు ఉంటేనే కదా! ఇటువంటి అంశాలను సమర్ధిస్తూ వీరు చేసిన పరిశోధనలను జత చేయలేదు. గతంలో సమర్పించిన దాఖలాలు కూడా లేవు. పైగా, పిల్లలకు పౌష్టికాహారం ఎంత అనివార్యమో ఎన్నో పరిశోధనలు ఎన్నో ఏళ్లగా నిరూపిస్తూనే ఉన్నాయి. ప్రధానంగా గుడ్డు, మాంసం యొక్క పౌష్టిక విలువ ఎనలేది. శరీర ఎదుగుదలకు, మానసిక పరివర్తనకు వీటి అవసరం తెలిసిందే. అంతేకాక ఈ ఆహారం శరీరానికి అవసరమైన ప్రోటీన్లను, విటమిన్లనూ, సహజ లవణాలను, ఐరన్‌ లాంటి ఎన్నిటినో అందిస్తాయి. ఎదిగే శరీరానికి కొవ్వు పదార్ధాల ఆవశ్యకత కూడా ఎంతో ఉంది. అలాగే కోడిగుడ్డులో మంచి కొలెస్ట్రాల్‌ ఉన్నదనే ఇంగితం వీరికి లేదు.
     'జీన్‌-డైట్‌ ఇంటరాక్షన్‌' అంటే మనం తినే ఆహారం మన శరీర జన్యువు మీద ఎటువంటి ప్రభావం (వీరి దృష్టిలో చెడు ప్రభావం) చూపుతుందో తెలుసుకునే ప్రక్రియ. కోడిగుడ్డు, మాంసం పిల్లల ఎదుగుదలపై ఎటువంటి మంచి ప్రభావం చూపుతాయో వేరే చెప్పాలా? మరొక చోట (పేజీ 24) 'ఇతర దేశాలలో లాగా కాకుండా భారతీయులు సహజంగా ఇష్టపడే ఆహారం శాఖాహారమని...ఆహారపు అలవాట్లు జన్యుపరంగా సంక్రమిస్తాయని' నిర్ధారించారు. ఇది పచ్చి అబద్దం. నిజానికి భారతదేశంలో 80 శాతానికి పైగా ప్రజలు మాంసాహారాన్ని భుజిస్తారు. అలాగే ప్రపంచ దేశాల ఆహారపు అలవాట్లు స్థానిక భౌగోళిక, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి తప్ప జన్యువుల మీద కాదు. పైగా వారి వాదనకు ఆయుర్వేదంలో అలా ఉన్నట్టు ఉటంకించడం మరొక తప్పు. ఆయుర్వేదంలో ఎక్కడా కోడిగుడ్డు, మాంసం ప్రస్తావనే లేదు. పైగా చరకుడు తన చరక సంహితలో భిన్న రకాల మాంసాహారాలను, వాటి ప్రాశస్త్యాన్ని తన శ్లోకాలలో ఉటంకించాడు. భారతదేశ చరిత్ర మాంసాహారంతో ముడిపడి ఉన్నదని సింధు నాగరికత చెపుతుంది (అనేక తవ్వకాల్లో సింధు నాగరికత కాలపు మట్టి కుండలలో వండిన కొవ్వు పదార్థాల ఆనవాళ్లు బయటపడ్డాయి. మేక, గొర్రె, పంది ఆనాటి వారి సహజ ఆహారం).
     మన పాలకులు భారతీయత మీద...అలాగే ఏది భారతీయ ఆహారం? ఏది కాదు? అనే విషయాల మీద... చూపుతున్నంత ఆసక్తి భావి భారత పౌరుల ఆరోగ్యం పట్ల చూపకపోవడం దురదృష్టం. ఇదే పత్రంలో 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల మానసిక ఆరోగ్యం గురించి ప్రస్తావిస్తూ వారికి సాత్విక ఆహారం ఇవ్వాలని నిర్దేశించారు (సాత్విక ఆహారం అంటే ఏమిటో చెప్పలేదు. దానికి తగిన శాస్త్రీయ ఆధారాలేమిటో చెప్పలేదు). ఆయుర్వేద ఆధారిత ఆహారం (ఆయుర్వేద ఆహారమనేది ఒకటుందని అది మాంసాహారానికి వ్యతిరేకమనే భ్రమలో వారు ఉన్నా...మనం లేము) ఇవ్వాలంటూ కొత్త అంశాన్ని రాసుకొచ్చారు.
ఈ డాక్యుమెంట్‌పై సామాజిక శాస్త్రవేత్తలూ పోషకాహార నిపుణులు, ఆరోగ్య నిపుణులు స్పందించాలి. నూతన జాతీయ విద్యా విధానం 2020 ఇప్పటికే ప్రజలలో ఒక భయాన్ని సృష్టించింది. తమ రాజ్యాంగ హక్కులను హరించే కుట్రగా బహుజన సమాజం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇక ఇటువంటి అనవసర, అశాస్త్రీయ ప్రజా వ్యతిరేక అంశాలను నూతన జాతీయ విద్యావిధానం నుండి తొలగించాల్సిన అవసరాన్ని గ్రహించి పాలకులు ఆ దిశగా పూనుకోవాలి.

(వ్యాసకర్త : వైద్యుడు, సామాజిక కార్యకర్త,
సెల్‌: 9849000037)
డా|| మాటూరి శ్రీనివాస్‌

డా|| మాటూరి శ్రీనివాస్‌