Nov 07,2022 11:17

రాంబిల్లి (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలంలో ఉన్న నేవల్‌ ఆల్టర్నేటివ్‌ ఆపరేషన్‌ బేస్‌ ఎన్‌ఎఒబి.నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న డిమాండ్‌ చేశారు. సోమవారం డి.వెంకన్న ఓ ప్రకటన విడుదల చేశారు. మెయిన్‌ గేట్‌ వద్ద గత వారం రోజులుగా వేలాది మంది ఎన్‌ఎఒబి నిర్వాసితులు, మత్స్యకారులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తున్నారనీ, వీరి న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయకుండా తత్సారం చేయడం సరియైనది కాదు అని అన్నారు.
        2005 లో ఎస్‌ఏఓబి ప్రాజెక్టు నిర్మాణం కోసం 4,800 ఎకరాల భూమి, శారదా, వరాహ నదులను రాంబిల్లి, ఎస్‌.రాయవరం మండలాల పరిధిలో ఉన్న తొమ్మిది గ్రామాల ప్రజలు త్యాగం చేసి భూములు ఇచ్చారని అన్నారు. 2011లో రాంబిల్లి నుండి ఉమ్మడి విశాఖ కలెక్టరేట్‌ వరకు రెండు రోజులు పాటు వేలాది మందితో పాదయాత్ర నిర్వహించి అప్పటి జిల్లా కలెక్టర్‌ లవ్‌అగర్వాల్‌ నిర్వాసితులతో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. శారదా, వరాహా నదుల్లో చేపలు వేటాడుతున్న మత్స్యకారులందరికీ జెట్టి నిర్మాణం చేపడతామని, ఆ జెట్టి నిర్మాణం జరిగే వరకు ఎన్‌ఏఓబి నిర్మాణం జరిగినా చేపల వేటకు అంతరాయం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. నేడు దానికి భిన్నంగా వరహా, శారద నదుల చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టారని అన్నారు. కోప్పుగుండిపాలెం రాజాల అగ్రహం వ్యవసాయ భూములకు వరకు రోడ్డు వేస్తామని చెప్పి నేటికీ రోడ్డు వేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చేపల వేటకు వెళ్లడానికి గేట్లు పెట్టారనీ, నేడు ఆ గేట్లు నుండి రావద్దని హుక్కుం జారీ చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు దిక్కుతోచని పరిస్థితుల్లో రోడ్డెక్కి తమ నిరసన తెలియజేస్తున్నారని అన్నారు. స్థానిక పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటికీ దానిని ఎన్‌ఎఒబి నిర్మాణ పనుల్లో అమలు చేయడంలేదని ఆరోపించారు. స్థానిక నిర్వాసితులకు ఎల్‌, టీ కంపెనీ ఉపాధి కల్పించడంలేదని అన్నారు. ఎన్‌ఏఓబి ప్రాజెక్టులో సర్వం కోల్పోయిన వేల్పుగుండుపాలెం, దేవళ్లపాలెం, పిసినుగొట్టిపాలెం, రేవువాతాడ గ్రామాల ప్రజలకు ఎన్‌ఏఓబి నిర్వాసితుల కాలనీ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కాలనీలోనివారు వీధిలైట్లు, రోడ్లు, పారిశుధ్యం వంటి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. మేజర్‌ కుమారులు, కుమార్తెలకు ప్యాకేజీలు పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. ఎన్‌ఏఒబి ప్రాజెక్టులో భూములు, ఉపాధి కోల్పోయిన ప్రభావిత గ్రామాలైన చిన్న కళవలపల్లి, కొత్తపేట, గోవిందపాలెం, వాడపాలెం గ్రామాలను గుర్తించి ప్యాకేజీ అమలు చేయలేదన్నారు. నిర్వాసితుల ఒప్పందం ప్రకారం రెసిడెన్షియల్‌ స్కూల్‌, కేంద్రీయ విద్య, వైద్యం అమలు చేయడంలేదని ధ్వజమెత్తారు. జెట్టీ నిర్మాణం చేసేవరకు ప్రతి మత్స్యకారుడికి నెలకు రూ.18 వేలు జీవన భృతి ఇవ్వాలని, వాడనర్సాపురం, కొత్తపట్నం వద్ద డ్రెడ్జింగ్‌ చేయడం వలన తీర ప్రాంతం 4 నుండి 5 మీటర్లు ఎత్తు పెరగడం వలన వేటకు అంతరాయం కలిగిందన్నారు. ఈ రెండు గ్రామాల మత్స్యకారులకు డ్రెడ్జింగ్‌ ప్యాకేజీ తక్షణమే ఇవ్వాలని, మగవారితో సమానంగా మహిళలకు గంపల ప్యాకేజీ లక్షల రూపాయలు ఇవ్వాలని, తదితర సమస్యలన్నింటిని పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నారని వివరించారు. వెంటనే మత్స్యకారుల సమస్యలు పరిష్కారం చేయకపోతే వారి ఆగ్రహనికి గురికాక తప్పదని వెంకన్న స్పష్టం చేశారు,