Aug 26,2023 20:46

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :తొలిసారిగా రాష్ట్రంలో రెండు ప్రభుత్వాస్పత్రులకు ఎన్‌ఎబిహెచ్‌ గుర్తింపు లభించింది. విశాఖలోని గవర్నమెంటు మెంటల్‌ కేర్‌ ఆస్పత్రి, హాస్పిటల్‌ ఫర్‌ చెస్ట్‌ డిసీజెస్‌కు నేషనల్‌ అక్రిడియేషన్‌ బోర్డు ఫర్‌ హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ ప్రొవైడర్‌ (ఎన్‌ఎబిహెచ్‌) మంజూరు చేసింది. క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో భాగంగా ఉన్న ఎన్‌ఎబిహెచ్‌ నాణ్యతా ప్రమాణాలను బట్టి ఆస్పత్రులకు గుర్తింపు ఇస్తుంది. 10 చాప్టర్లు 100 ప్రమాణాలకు కలిగిన ఈ విభాగం 503 లక్ష్యాలతో పనిచేస్తుంది. రాష్ట్రంలో అన్ని టీచింగ్‌ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు పిహెచ్‌సి, యుహెచ్‌సి, సిహెచ్‌ఎస్‌, విహెచ్‌సిలలో సైతం జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2022ా23 సంవత్సరంలో జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాలను 2,041 ఆరోగ్య కేంద్రాలు సాధించగా, అందులో 452 ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఈ విషయంలో ఎపి మొదటిస్థానంలో ఉంది.