Aug 20,2023 13:03

అప్పటి వరకు కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ చిత్రాల్లో నటించిన రుహానీ శర్మ 'హెర్‌' చిత్రంలో సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా తనలోని మరో కోణాన్ని చూపించి, ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నారు. ' మా అమ్మ ఇండిపెండెంట్‌ ఉమెన్‌. టీచర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. కష్టపడి చదువుకొని, ఉద్యోగాలు చేస్తున్న వారిలో మా అమ్మ ఒకరు. ఆమెను చూస్తూంటే గర్వంగా ఉంటుంది. అటువంటి వారినందరినీ మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. అందుకే హీరోయిన్లను డాక్టర్లుగా, లాయర్లుగా తెరపై కనిపిస్తే చాలామంది స్ఫూర్తి పొందుతారు' అన్నారు రుహానీ శర్మ.

33

పేరు : రుహానీ శర్మ
పుట్టిన తేది : 18 సెప్టెంబర్‌, 1994
చదువు : పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పట్టభద్రురాలు
అలవాట్లు : ప్రయాణాలు, స్విమ్మింగ్‌,
ఇష్టమైన ఆహారం : రాజ్మా-చావల్‌,
ఇష్టమైన క్రీడ : క్రికెట్‌,
ఇష్టమైన గమ్యం : ఫ్లోరిడా,
వృత్తి : నటి, మోడలింగ్‌.

55

తొలిసారి చి.ల.సౌ. చిత్రంలో సున్నితమైన మనస్కురాలిగా కనిపించి, తన అభినయంతో ఆకట్టుకున్న రుహానీ అనేక భాషల్లో నటించారు. 2018లో విడుదలైన చి.ల.సౌ. చిత్రంలో అంజలి పాత్రలో పోషించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌లో ఆమె స్వస్థలం. తండ్రి సుభాష్‌ శర్మ, తల్లి ప్రాణేశ్వరి శర్మ, చెల్లి శుభి ఉన్నారు. ఆమెకు వాళ్ల అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. దాంతో 2013లో పంజాబీ మ్యూజిక్‌ వీడియోలు 'క్లాస్‌రూమ్‌', 'కుడి తు పటాకా'లో కనిపించారు. అందులో ఆమె అభినయానికి మంచి ప్రశంసలు రావడంతో మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆమె పారాచూట్‌ ఆయిల్‌, క్లోజప్‌, హీన్జ్‌ టొమాటో కెచప్‌, జిఆర్‌టి జ్యువెలర్స్‌, కళ్యాణ్‌ జ్యువెలర్స్‌ వంటి వ్యాపార సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నారు.
         'నా జీవితంలో మా అమ్మే స్ఫూర్తి. నా కుటుంబమే నాకు బలం. సినిమాలు లేకపోతే.. ఇంటి పట్టునే ఉంటా. వాళ్లతో సమయం కేటాయించడం చాలా ఇష్టం. నాకో చెల్లెలు ఉంది. తనకు నటన, సినిమా అంటే పెద్దగా ఆసక్తి లేదు. కానీ నా సినిమాల్ని బాగా విశ్లేషిస్తుంది. సలహాలు ఇస్తుంది. నాకో బుజ్జి కుక్కపిల్ల కూడా ఉంది. నాకు పెట్స్‌ అంటే మమకారం ఎక్కువ. వాటితో చక్కటి కాలక్షేపం. అమితాబచ్చన్‌తో ఓ కమర్షియల్‌ యాడ్‌లో నటించాను. ఆ అనుభవాల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆయనో లెజెండరీ పర్సనాలిటీ. సెట్లో ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకొన్నాను. నేను నటించిన సినిమాల్లో చాలా వరకూ పద్ధతి ఉన్న అమ్మాయిగా నటించాను. అలా అని బోల్డ్‌ని చూసి భయపడే రకాన్ని కాదు. అసలు నేనా టైప్‌ కానే కాదు. తెరపై ఎలాంటి సన్నివేశంలో నటించడానికైనా సిద్ధమే. కానీ ఆ సన్నివేశం కథకు అవసరమా, కాదా? అనేది చాలా ముఖ్యం. ఏ సినిమాలో నటిస్తున్నాం? మనతో పనిచేసేవాళ్లెవరు? సినిమా స్థాయేంటి? ఈ సినిమాతో ఏం చెప్పాలనుకొంటున్నాం? అనేది చూసుకొంటాను.' అని చెప్పారు.

77


            ''హెర్‌' చూసిన వాళ్లంతా 'తెరపై కనిపిస్తోంది నువ్వేనా.. అని ఆశ్చర్యపోయారు. నాకు కావాల్సింది కూడా అదే. ''మర్దానీ'' నా ఫేవరెట్‌ సినిమాల్లో ఒకటి. చాలా కాలం క్రితమే చూశా. 'హెర్‌' చూసినవాళ్లంతా ''మర్దానీలో రాణీముఖర్జీలా ఉన్నావ్‌!'' అంటున్నారు. ఇది నాకు దక్కిన బెస్ట్‌ కాంప్లిమెంట్‌. కాస్త ఖాళీ దొరికినా ప్రయాణాలు చేస్తుంటాను. నేను చూసిన అందమైన ప్రదేశాలలో ఇటలీ ఒకటి. అక్కడి వాతావరణం చాలా బాగుంటుంది. ప్రయాణాలు చేయడం వల్ల, కొత్త వ్యక్తుల్ని కలుసుకోవడం వల్ల.. మన జీవిన విధానమే మారిపోతుంది. ప్రశాంతత అలవాటు అవుతుంది. బిజీ లైఫ్‌కి కాస్త బ్రేక్‌ ఇచ్చి, ఓ టూర్‌ వేస్తే.. మళ్లీ కావల్సినంత ఉత్సాహం లభిస్తుంది' అని అన్నారు.
          రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించిన చి.ల.సౌ.లో ఆమె నటనకు మంచి ఆదరణ, ప్రశంసలు లభించాయి. సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌ ద్వారా ఆమె ఉత్తమ తొలినటి అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత రంజిత్‌ శంకర్‌ రచన, దర్శకత్వం వహించిన థ్రిల్లర్‌ చిత్రం కమలలో ఆమె మలయాళంలోకి ప్రవేశించింది. 'ఆగ్రా'తో హిందీలోకి అడుగుపెట్టారు. ఆమె రొమాంటిక్‌ కామెడీ 'కడైసి', బెంచ్‌ కార్త్‌' తో తమిళంలో అరంగేట్రం చేసింది.