Aug 02,2023 15:31

ప్రజాశక్తి-ఏలేశ్వరం (కాకినాడ) : ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే ఏకైక నగర పంచాయతీ, అత్యధిక ఓట్లు గల ఏలేశ్వరంలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవలే 14వ వార్డు కౌన్సిలర్‌ మోదీ నారాయణస్వామి వైసీపీకి రాజినామా చేసి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు సమక్షంలో టిడిపిలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో బుధవారం 4 వ వార్డ్‌ కౌన్సిలర్‌ బొదిరెడ్డి గోపాలకృష్ణ, 6వ వార్డు కౌన్సిలర్‌ కోణాల వెంకటరమణ, 18వ వార్డ్‌ కౌన్సిలర్‌ ఎండగుండి నాగబాబు తమ అనుచరులతో కలిసి వైసిపికి రాజీనామా చేశారు. వీరు ఈనెల ఏడో తేదీన ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ఏలూరు రిజర్వాయర్‌ పరిశీలనకు వస్తున్న టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో టిడిపిలో చేరన్నట్టు తెలిపారు. ఏలేశ్వరంలో 20 వార్డులు ఉండగా 5 వార్డులు టిడిపి, 15 వార్డులు వైసీపీ గెలుపొందాయి. వైసీపీ నుండి నాలుగు వార్డు కౌన్సిలర్లు రాజీనామా చేయడంతో వైసీపీకి 11 వార్డు కౌన్సిలర్లు ఉండగా వారిలో కూడా ఇద్దరు కౌన్సిలర్లు చైర్‌ పర్సన్‌తో అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వారు దగ్గరలోనే వైసీపీని వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌కు ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, రౌతులపూడి ఎంపీపీ గంటుమల్ల రాజ్యలక్ష్మి, ప్రత్తిపాడు జడ్పిటిసి బెహరా రాజేశ్వరి వ్యతిరేక వర్గంగా ఏర్పడి తలనొప్పిగా మారారు. ఏలేశ్వరం కౌన్సిలర్లు రాజీనామా చేయడంతో కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి. ఈ సంక్షోభాలను రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఎలా పరిష్కరిస్తుందో వెచి చూడాలి.