వర్ష ఋతువుకు వీడ్కోలు పలుకుతూ మొగ్గ తొడిగి, ముద్దు ముద్దుగా మురిపిస్తాయి ముద్దబంతి పూలు, వాటి నేస్తాలు చేమంతులు. శరత్ కాలపు వెన్నెల్లో విరబూసి, హేమంతంలో మంచు బిందువులతో ఊసులాడుతూ కనువిందు చేస్తాయి. ప్రకృతిని పరవశింప జేస్తాయి. మూడు ఋతువులలో మహరాణిలా మెలిగి, సంక్రాంతి సంబరమంతా తానై తనివితీరా తృప్తినిచ్చి సంవత్సరంలో నాలుగు నెలలు కళకళలాడి టాటా చెప్పేది ఈ మారీగోల్డ్ ఒకప్పుడు. అయితే ఇప్పుడు అనేక రకాల హైబ్రిడ్ మొక్కలు అందుబాట్లోకి వచ్చాయి. తోటల్లోనే కాక పెరటిలో, కుండీలలో, టెర్రస్ పైన పెంచుకునే అవకాశం ఉంది. బంతి శాస్త్రీయనామం టాగిటిస్. వ్యవహారంలో బంతి, ఆంగ్లంలో మారిగోల్డ్, మెక్సికన్ మారిగోల్డ్, టాగేటేట్టే అని పిలుస్తారు. దీనికున్న ఘాటైన వాసన వలన దోమలు, కీటకాలు ఆ పరిసరాలకు దూరంగా ఉంటాయి. దానిలో ఉన్న మిథనాల్ యాంటీ బయాటిక్‌గా పనిచేయడం వలన చర్మవ్యాధుల మందుల తయారీలో వాడతారు. వీటిలో దాదాపు 50 రకాలున్నాయి. మరి ఈ వారం విరబూసే బంతులు, చామంతులను చూసొద్దామా!
ముద్దబంతి
పూరేకలు ముద్దగా ఉండి పసుపు, బంగారు రంగు కలసిన రంగుతో అందంగా ఉంటుంది. బంతి పువ్వు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఈ పువ్వే.
కారం బంతి
దీన్నే మనం దేశవాళి బంతి అని కూడా అంటాం. మొక్కకు చిన్నచిన్న పువ్వులు చింతపిక్క ఎరుపు రంగులో మెరుపులీనుతూ ఉండి, చెట్టు నిండా పూస్తాయి.
హైబ్రిడ్ చామంతి
శీతల ప్రాంతంలో అరచేతి పరిమాణంలో విచ్చుకుంటాయి. ఇందులో చాలా రంగులు, రకాలు ఉన్నాయి.
చామంతి
ప్రపంచంలో గులాబీల తర్వాత ఎక్కువ రంగులు, రకాలు ఉన్న పూల మొక్క చామంతి. ఇది విభిన్నమైన రంగులు, రకరకాల ఆకారాలు, పరిమాణాలు ఉండే పూల మొక్క. అటు సుగంధాలను ఇటు ఆనందాలను పంచుతుంది. ఆస్టరేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం క్రిసాంథిమమ్. ఇవి తూర్పు ఆసియా, ఈశాన్య ఐరోపాల నుంచి ప్రపంచమంతా వ్యాపించాయి. చామంతి పువ్వు జపాన్ దేశపు జాతీయ పుష్పం. దీని రకాలలో కొన్నింటిని చూద్దాం.
రేఖ బంతి
మొక్కలు అడుగులోపులో ఎత్తులోనే పెరుగుతాయి. పువ్వులు చిన్నచిన్నగా రేఖలు మాదిరిగా విచ్చుకుంటాయి. ఇందులో పసుపు, లేత కాషాయం, చింత పిక్క రంగులు ఉంటాయి.
చిట్టి చామంతి
పసువు రంగులోనే ఉండే చిన్న చిన్న పువ్వులు చెట్టునిండా విచ్చుకుంటాయి. వారం రోజులకు ఒకసారి కొద్దిగా నీటి వనరు అందిస్తే సరిపోతుంది.
కర్పూర చామంతి
మధ్యలో పసుపు రంగు బొద్ధి ఉండి చుట్టూతా రేకలు ఉండే చామంతిని కర్పూర చామంతి అంటారు. ఇది ఘాటైన సువాసన కలిగి ఉంటుంది. అందుకే దీనిని కర్పూర చామంతి అని పిలుస్తారు. అడుగు ఎత్తులోనే పువ్వులు పూస్తుంది. ఇందులో పసుపు తెలుపు రెండు రకాలు ఉంటాయి.
బొకే చామంతి
ఇది థాయిలాండ్ నుంచి దిగుమతి చేసుకున్న హైబ్రిడ్ రకం చామంతి. ఒక్క మొక్కకు ఒకేసారి వందల వేల పువ్వులు విచ్చుకొని బొకేలా కనిపిస్తాయి. ఒక్క ఆకు కూడా కనిపించకుండా పూలు విచ్చుకోవటం ఈ మొక్క ప్రత్యేకత. తక్కువ వాసనను కలిగి ఉంటుంది.
చిలుకూరి శ్రీనివాసరావు
8985945506