Apr 18,2023 07:37

           పోలీస్‌ కస్టడీ లోనే గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌, అతని సోదరుడు అష్రాఫ్‌ హత్యోదంతం ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ సారథ్యంలోని బిజెపి జమానాలో శాంతిభద్రతల వైఫల్యాన్ని సూచిస్తుంది. రాష్ట్రంలో చట్ట వ్యతిరేక పాలన నడుస్తోందని అక్కడి ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, హక్కుల కార్యకర్తలు ఘోషిస్తున్నారు. యోగి సర్కారు ఆ విమర్శలను చెవికెక్కించుకోకపోగా ముందుకేనంటోంది. గతంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా పని చేసిన అతీక్‌, అతని సోదరుడు అష్రాఫ్‌లను ఒక కేసులో విచారణ నిమిత్తం శనివారం కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు, అనంతరం జైలుకు తరలించే క్రమంలో వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి తుపాకులతో అతీక్‌, అష్రాఫ్‌లను కాల్చి చంపారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగింది. కాల్పులు జరిపిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకుముందు చిన్న కేసుల్లో వీళ్లు నిందితులని, పేరు కోసం, పెద్ద డాన్‌లుగా మారి నేర సామ్రాజ్యాన్ని ఏలడం కోసం జర్నలిస్టుల ముసుగులో వచ్చి కాల్పులు జరిపారని పోలీసులు వల్లె వేశారు. యోగి ప్రభుత్వం ముగ్గురితో జ్యుడీషియల్‌ కమిటీ వేసింది. చూస్తుంటే పోలీసులు అల్లిన కట్టు కథకు ఆ కమిటీ సర్టిఫై చేసేలా కనిపిస్తోంది.
         ఎన్‌కౌంటర్లు, కస్టడీ హత్యల సమయంలో పోలీసులు చెప్పే కథలన్నీ పూసగుచ్చినట్లు ఒకే విధంగా ఉంటాయి. యు.పి. ప్రయాగ్‌రాజ్‌ లోనూ అదే స్క్రిప్టు పునరావృతమైంది. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్లను తరలించేటప్పుడు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. బయటి నుంచి వ్యక్తులొచ్చి పాయింట్‌ బ్లాంక్‌లో తుపాకీ గురిపెట్టి కాల్చడం పోలీసుల మద్దతుతోనే జరుగుతుంది. ఇటువంటి ఘటనలు ప్రభుత్వానికి తెలీకుండా జరగవు. కచ్చితంగా ప్రభుత్వ కుట్ర ఉండి తీరుతుంది. అతీక్‌, అష్రాఫ్‌ల హత్యలకు రెండు రోజుల ముందు గురువారం ఝాన్సీ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతీక్‌ కుమారుడు అసద్‌, అతని సహచరుడు గులాం హతులయ్యారు. ఉమేష్‌పాల్‌ హత్య కేసులో వీరు నిందితులు. 2005లో జరిగిన బిఎస్‌పి ఎంఎల్‌ఎ రాజ్‌పాల్‌ హత్య కేసులో ఉమేష్‌పాల్‌ కీలక సాక్షి. ఆ ఉమేష్‌ పాల్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 24న మర్డర్‌ అయ్యాడు. ఆ కేసులో అతీక్‌, అష్రాఫ్‌, అసద్‌, గులాం నిందితులు. ఆ నలుగురూ హతమయ్యారు. దర్యాప్తులు, కోర్టులు ఇవేమీ లేకుండా నిందితులను లేపేయడమనే సిద్ధాంతాన్ని యోగి ప్రభుత్వం అమలు చేస్తోందని అర్థమవుతోంది. అది కూడా ఒక మతానికి సంబంధించిన వారే లక్ష్యం.
       యు.పి. లో యోగి ప్రభుత్వం వచ్చింది మొదలు ముస్లింల అక్రమ నిర్బంధాలు, ఎన్‌కౌంటర్లు అప్రతిహతంగా సాగిపోతున్నాయి. వాటిపై దర్యాప్తులు, విచారణలు ఏమీ లేవు. రాష్ట్రంలో నేరస్తుల, అసాంఘిక శక్తుల పీచమణిచేందుకు కఠినంగా వ్యవహరిస్తున్నామని యోగి సర్కారు తమ చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలను సమర్ధించుకుంటోంది. ఇదే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మతోన్మాద మూకలు, ప్రైవేటు సైన్యాలకు పూర్తి మద్దతిస్తోంది. గోరక్షణ పేరిట యు.పి. లో ముస్లింలు, దళితులపై జరిగిన దాడులు అన్నీ ఇన్నీ కావు. తరచూ పురివిప్పుతున్న మత ఘర్షణలను అదుపు చేయడంలో వైఫల్యాలను మూటగట్టుకోవడంతో పాటు ఒక వర్గానికి ప్రభుత్వం కొమ్ము కాస్తోంది. ప్రజాస్వామ్యం, లౌకికతత్వంపై దాడి చేస్తోంది. రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులను ప్రభుత్వమే కాలరాస్తోంది. నేరస్తులను చట్ట ప్రకారం శిక్షించాలి. అందుకు ఎవ్వరూ కాదనరు. ప్రభుత్వమే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే క్రిమినల్స్‌కు, చట్టబద్ధ పాలన చేస్తామనే రాజ్యానికి తేడా ఉండదు. వంద మంది దోషులు తప్పించుకోవచ్చేమో, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనేది మన న్యాయ వ్యవస్థ అభిలాష. యు.పి. హత్యలపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో ఉన్నత స్థాయి విచారణ జరిపించేందుకు యోగి సర్కారు ముందుకు రావాలి.