Jul 27,2022 06:52

ప్రభుత్వ నిరంకుశ వైఖరి వేలాది మంది మున్సిపల్‌ కార్మికులను సమ్మె లోకి దించింది. ఎత్తివేసిన హెల్త్‌ అలవెన్స్‌, సంక్షేమ పథకాలను నిలబెట్టుకోవడం కోసం కార్మికులు పట్టుదలతో పోరాటం సాగించారు. పర్మినెంట్‌, సమాన పనికి, సమాన వేతనం వంటి కీలక డిమాండ్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఉంది. ఇతర డిమాండ్ల పరిష్కారానికి ఒప్పుకుంది. హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలతో సహా చెల్లిస్తాననడం, నగర పంచాయితీ కార్మికులకు కూడా హెల్త్‌ అలవెన్స్‌ను ఇచ్చేందుకు అంగీకరించడంతో ''ప్రభుత్వం మెడలు వంచి, సాధించుకున్నాం'' అనే అభిప్రాయం కార్మికుల్లో వ్యక్తం కావడం సంతోషకరం. హెల్త్‌ అలవెన్సును 2019లో జారీ చేసిన జీఓ యం.ఎస్‌.నెం.233ను యథాతథంగా అమలు చేస్తామంటూ జీఓ యం.ఎస్‌. నెం. 109ను జులై 22న జారీ చేసింది. ఇది కార్మికుల పోరాట విజయం.

ఈ నెల 11 నుండి 15వ తేదీ వరకు జరిగిన మున్సిపల్‌ కార్మికుల సమ్మె పోరాటం రాష్ట్ర ప్రజానీకంపై ప్రభావం చూపింది. గత రెండేళ్ళపాటు అమలు చేసిన పథకాలకు కోత పెట్టి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వ తీరును మున్సిపల్‌ కార్మికులు సమ్మె ద్వారా నిలువరించారు.
     రాష్ట్రంలోని మొత్తం 123 మున్సిపాల్టీలకు గాను 112 చోట్ల సమ్మె జరిగింది. మొదటి రోజు నుండే ఇంజనీరింగ్‌ లోని ఆన్‌-ఆఫ్‌ కార్మికులు మినహా మిగతా కార్మికులందరితో పాటుగా పర్మినెంట్‌ సిబ్బంది పాల్గొనాలని నిర్ణయించడం జరిగింది. మొత్తం 33,485 మంది సమ్మెలో పాల్గొనగా వీరిలో ఒప్పంద పారిశుధ్య కార్మికులే అత్యధికం.
      ఈ జనవరిలో 11వ వేతన సవరణ పేరుతో నెలకు రూ.3 వేల వేతనం పెరిగిందనే సాకుతో ప్రభుత్వం ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్స్‌ చెల్లించలేదు. సంక్షేమ పథకాలను నిలిపివేసింది. వీటికి తోడు పర్మినెంట్‌ కార్మికులకు లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, హెల్త్‌ కార్డులు, సమస్యలు, ఇంజినీరింగ్‌ కార్మికులకు జీఓ ఆర్‌.టి.నెం.30 సవరించకపోవడం తదితర సమస్యలు కార్మికులలో అసంతృప్తిని పెంచాయి. రెండేళ్ళ క్రితం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం పర్మినెంట్‌ చేయడం సంతోషమే. అయితే గత 25-30 ఏళ్లగా మలినాలు శుభ్రం చేసి, పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పరిరక్షిస్తున్న మున్సిపల్‌, ఇంజినీరింగ్‌, పారిశుధ్య కార్మికుల్ని పర్మినెంట్‌ చేయకపోవడంతో కార్మికులందరిలో ఆగ్రహం వ్యక్తమైంది.
     ఈ నేపథ్యంలో సిఐటియు, ఎఐటియుసి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఇతర సంఘాలను కూడగట్టి జెఎసి ఏర్పాటు చేశారు. జెఎసి ఆధ్వర్యంలో జులై 11 నుండి నిరవధిక సమ్మెను నిర్వహించనున్నట్లు మున్సిపల్‌ మంత్రికి జూన్‌ 24న సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఆరోజు ఆయన జెఎసి నాయకత్వంతో మాట్లాడి 14 డిమాండ్లపైన ముఖ్యమంత్రితో మాట్లాడతానని... జీతం, హెల్త్‌ అలవెన్స్‌ కలిపి రూ.18 వేలకు ఒప్పుకోవాలని, 2024 ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతామని, సమ్మెను విరమించాలని జెఎసి నాయకత్వాన్ని కోరారు. కానీ, జెఎసి అందుకు అంగీకరించలేదు.
 

                                                                    సమ్మె జయప్రదం కోసం...

సమ్మె జయప్రదం కావడం కోసం వేలాది కరపత్రాల పంపకం, గేట్‌ మీటింగులు, జనరల్‌బాడీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మోటారు బైక్‌ ర్యాలీలు, చెవిలో పువ్వు, అర్థనగ ప్రదర్శనలు, వంటా వార్పు, మోకాళ్ళపై నిరసనలు, మానవ హారాలు, గాంధీ, అంబేద్కర్‌, వైఎస్సార్‌ విగ్రహాలకు వినతి పత్రాలు వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు.
 

                                                              సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వ కుట్ర

సమ్మెకు ముందు నుండి సమస్యలు పరిష్కరించకుండానే సమ్మె విరమించాలని జెఎసి నాయకత్వంపై ప్రభుత్వం ఒత్తిడి తేవడం. సమ్మెలో పాల్గొంటే కార్మికులపైన కేసులు పెడతాం. ఉద్యోగాలు తీసేస్తాం. పర్మినెంట్‌ వారికి 5 ఇంక్రిమెంట్లు కట్‌ చేస్తాం... వంటి బెదిరింపులు పెద్ద ఎత్తున సాగాయి. 'సమ్మె సందర్భంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, అవసరమైతే పోటీ కార్మికులకు రోజుకు రూ.700 నుండి రూ.800 చెల్లించాలని, పోలీస్‌ ప్రొటెక్షన్‌ తీసుకోవాలని, క్లాప్‌ ఆటోలను పూర్తిగా పనిలో వినియోగించుకోవాలని ఈనెల 11న మున్సిపల్‌ కమిషనర్లకు రాతపూర్వకంగా ప్రభుత్వం నిర్దేశించింది. కొన్ని ప్రాంతాలలో కమిషనర్లు సమ్మె టెంట్ల వద్దకు వచ్చి బెదిరించారు. దగ్గరుండి మరీ పోటీ కార్మికులతో పని చేయించారు. కొన్ని చోట్ల నాయకులను అరెస్టులు చేయించి రాత్రి పొద్దుపోయే వరకు వదిలిపెట్టలేదు. మరికొన్ని చోట్ల అధికార పార్టీ నాయకులు, మున్సిపల్‌ కమిషనర్లు, సిబ్బంది, వార్డు వాలంటీర్లు...రోడ్లు ఊడ్చడానికి, చెత్త తరలింపుకు ప్రయత్నించగా... చెత్తపైనే పండుకొని కార్మికులు స్వచ్ఛందంగా ప్రతిఘటించారు. అనేక చోట్ల వాహనాలను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసుల లాఠీ చార్జీలలో గాయపడినవారున్నారు. మొత్తంగా 530 మంది పైన కేసులు నమోదు చేసినప్పటికీ...ప్రభుత్వ కుట్రలను ఎదుర్కొని పోరాటాన్ని జయప్రదంగా నిర్వహించారు.
 

                                                        కార్మిక సంఘాలు - రాజకీయ పార్టీల మద్దతు

సిఐటియు, ఏఐటియుసి సంయుక్తంగా ఈనెల 6న ఆల్‌ ట్రేడ్‌ యూనియన్లతో విజయవాడలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించాయి. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.ఎం కు లేఖ రాశారు. అనంతపురం, ఒంగోలులో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించారు. కె.వి.పి.ఎస్‌ మద్దతు ప్రకటించింది. సిపిఎం, సిపిఐ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు సి.ఎం కు లేఖ రాశారు. టిడిపి అధినేత పత్రికా ప్రకటన ఇచ్చారు.
 

                                                                        ప్రభుత్వంతో చర్చలు

ఈ నెల 7వ తేదీన జెఎసి నాయకత్వాన్ని చర్చలకు ఆహ్వానించారు. ఇంజినీరింగ్‌ కార్మికుల జిఓఆర్‌టి నెం.30 సవరణ తోపాటుగా హెల్త్‌ అలవెన్స్‌ ఇవ్వాలన్న అంశంపైన సుదీర్ఘ చర్చ జరిగింది. ఎన్‌ఎంఆర్‌లు, పర్మినెంట్‌ కార్మికులు, స్కూల్‌ స్వీపర్ల సమస్యలతో పాటు హెల్త్‌ అలవెన్స్‌ పైన సుమారు 3 గంటల పాటు చర్చలు జరిగాయి. అయినా ప్రభుత్వంతో తేల్చుకోవలసిన హెల్త్‌ అలవెన్స్‌, జీతం (రూ.21 వేలు) పర్మినెంట్‌, సమాన పనికి సమాన వేతనం సమస్యలతోపాటు, 7న జరిగిన చర్చలలో వచ్చిన సానుకూల అంశాలు ఉన్నప్పటికీ మొత్తం డిమాండ్లు పరిష్కారం కాకుండా కొన్ని అంశాలు బయటకు చెప్పడం వల్ల సమ్మె పోరాటానికి నష్టం జరుగుతుందని, అంతేగాక మంత్రి గారితోనే చెప్పించాలనేది జెఎసి అభిప్రాయం. అందుకే అన్ని విషయాలను ముందుగా బయటికి చెప్పలేదు. కానీ, జెఎసి నాయకత్వాన్ని చర్చలకు పిలవకుండా 14వ తేదీన ఏకపక్షంగా హెల్త్‌ అలవెన్సును యథాతథంగా అమలు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇంజినీరింగ్‌, ఎన్‌.యం.ఆర్‌, పర్మినెంట్‌ కార్మికులకు సంబంధించిన సమస్యలపైన మినిట్ల ప్రతిని జెఎసి కి ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిన విషయాలను మంత్రి మీడియాకు చెప్పలేదు.
 

                                                                  కార్మికుల పోరాట విజయం

ప్రభుత్వ నిరంకుశ వైఖరి వేలాది మంది మున్సిపల్‌ కార్మికులను సమ్మె లోకి దించింది. ఎత్తివేసిన హెల్త్‌ అలవెన్స్‌, సంక్షేమ పథకాలను నిలబెట్టుకోవడం కోసం కార్మికులు పట్టుదలతో పోరాటం సాగించారు. పర్మినెంట్‌, సమాన పనికి, సమాన వేతనం వంటి కీలక డిమాండ్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఉంది. ఇతర డిమాండ్ల పరిష్కారానికి ఒప్పుకుంది. హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలతో సహా చెల్లిస్తాననడం, నగర పంచాయితీ కార్మికులకు కూడా హెల్త్‌ అలవెన్స్‌ను ఇచ్చేందుకు అంగీకరించడంతో ''ప్రభుత్వం మెడలు వంచి, సాధించుకున్నాం'' అనే అభిప్రాయం కార్మికుల్లో వ్యక్తం కావడం సంతోషకరం. హెల్త్‌ అలవెన్సును 2019లో జారీ చేసిన జీఓ యం.ఎస్‌.నెం.233ను యథాతథంగా అమలు చేస్తామంటూ జీఓ యం.ఎస్‌. నెం. 109ను జులై 22న జారీ చేసింది. ఇది కార్మికుల పోరాట విజయం. మిగిలిన హామీల పైన, మినిట్ల కాపీ, ఇతర హామీల అమలుకు జెఎసి నాయకత్వం చిత్తశుద్ధితో కృషి చేయాల్సి ఉంది.

/ వ్యాసకర్త : ఏపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి /
కె.ఉమామహేశ్వరరావు

కె.ఉమామహేశ్వరరావు