- చలో విజయవాడకు బయలుదేరిన మున్సిపల్ కార్మికులు
ప్రజాశక్తి - గూడూరు టౌన్ (తిరుపతి) : పురపాలక సంఘంలో పనిచేసే కార్మికులను పర్మినెంట్ చేయాలని, ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటియు (అనుబంధం) ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతి జిల్లా మున్సిపల్ సంఘం ప్రదాన కార్యదర్శి బి.గోపీనాథ్, గూడూరు సిపిఎం సెంట్రల్ శాఖ కార్యదర్శి జోగి శివకుమార్ ఆధ్వర్యంలో బుధవారం 110 మంది పురపాలక సంఘంలో పనిచేసే కార్మికులు గూడూరు నుండి విజయవాడకు బయలు దేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పురపాలక కార్మికుల సమస్యలు కోసం గురువారం విజయవాడలో ధర్నా కార్యక్రమము నిర్వహిస్తున్నామన్నారు. మున్సిపల్ కార్మికులు సమాన పనికి సమాన వేతనం క్లాప్ ఆటో డ్రైవర్లకు 18,500/- ఇవ్వాలని పేర్కొన్నారు. మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ ఏడు ప్రకారం స్కిల్ సెమీ స్కిల్డ్ రిస్క్ హెల్త్ అలవెన్స్ అమలు చేయాలని తెలిపారు. సి.పి.ఎస్ రద్దు చేసి ఓ.పి.ఎస్ అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సి.ఐ. టి.యు పట్టణ అధ్యక్షులు బి.వి.రమణయ్య, సిఐటియు పట్టణ ప్రధాన కార్యదర్శి ఎస్.సురేష్, కెవిపిఎస్ నాయకులు అడపాల ప్రసాద్, పట్టణ మున్సిపల్ సంఘం అధ్యక్షులు ప్రసాద్ జిల్లా కమిటి సభ్యులు మురళి, మహేంద్ర, పట్టణ కమిటి సభ్యులు మణి, అంకయ్య, శ్రీనివాసులు, కిషోర్, వెంకట రమణ, బి.చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.