ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్: మున్సిపల్ కార్మికులు చలో విజయవాడకు పోనివ్వకుండా పుట్టపర్తి పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం చలో విజయవాడ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా పుట్టపర్తి పట్టణ పోలీసులు పలువురు కార్మికులను నిర్బంధించారు. నిర్బంధంలోకి తీసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ లోనే ఉంచుకున్నారు. గురువారం విజయవాడలో జరిగే ధర్నాకు పోకుండా ఎక్కడికి అక్కడ నిర్బంధంలోకి తీసుకున్నారు. ఎనుములపల్లికి చెందిన వెంకటేశు అనే కార్మికుడు కాలు విరిగి ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటుండగా అతనిని కూడా కనికరం లేకుండా స్టేషన్లో పెట్టారు. అరెస్ట్ అయిన వారిలో పుట్టపర్తి మున్సిపల్ కార్మికులు పెద్దన్న, రామయ్య, గోవిందు, నర్సింలు నాగార్జున, వెంకటేశు, రామదాసు పి.వెంకటేశు, రమణ తదితరులు ఉన్నారు.
జిల్లా యూనియన్ ప్రధాన కార్యదర్శి అరెస్ట్
మున్సిపల్ కార్మికుల యూనియన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ ను అమడుగూరులో పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి నల్లమాడ సర్కిల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయనను కూడా సాయంత్రం వరకు నిర్బంధంలో పోలీసులు ఉంచుకున్నారు.
అక్రమ అరెస్టులు అన్యాయం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ ఎస్ వెంకటేష్
మున్సిపల్ కార్మికులు విజయవాడలో జరిగే మహా ధర్నాకు పోకుండా పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్ వెంకటేశు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించమని జిల్లా అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేకపోయిందన్నారు. దీంతో కార్మికులు దశలవారీగా ఉద్యమిస్తున్నారు. అక్రమ అరెస్టులతో న్యాయమైన ఉద్యమాన్ని ఆపలేరని ఆయన తెలిపారు.