Sep 16,2023 20:24
  • సమస్యలు పరిష్కరిస్తామని అధికారుల హామీ

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని, గతంలో అంగీకరించిన ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం విశాఖలోని జివిఎంసి కార్మికులు చేపట్టిన సమ్మె విజయవంతం అయింది. పబ్లిక్‌ హెల్త్‌, వాటర్‌ సప్లై, యుజిడి, వెటర్నరీ, పార్కులు, క్లాప్‌, తదితర విభాగాలకు చెందిన సుమారు ఏడు వేల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెలో భాగంగా జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అన్ని సెక్షన్లలో ఉన్న కార్మికులందరి వారసులకు ఉపాధి కల్పించాలని, వాటర్‌ సప్లై కార్మికులకు స్కిల్‌, సెమీ స్కిల్డ్‌ వేతనాలు ఇవ్వాలని, క్లాప్‌ డ్రైవర్లకు జిఒ 7 ప్రకారం రూ.18,500 జీతం ఇవ్వాలని, వెటర్నరీ, పార్కులు, మలేరియా సెక్షన్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పెద్దపెట్టున నినదించారు. జివిఎంసి ఎడిసి సన్యాసిరావు, సిఎంఒహెచ్‌ నరేష్‌, ఇంజనీరింగ్‌ సెక్షన్‌ ఎస్‌ఇ రవి తదితర ఉన్నతాధికారులు నిరసన జరుగుతున్న ప్రాంతానికి వచ్చి కార్మికులతో మాట్లాడారు. మున్సిపల్‌ కార్మికులందరి సమస్యలనూ 15 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పర్మినెంట్‌ చేసేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని చెప్పారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించారు. నిరసన కార్యక్రమంలో జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షులు పి.వెంకట్‌ రెడ్డి, అధ్యక్షులు టి.నూకరాజు, ప్రధాన కార్యదర్శి ఉరుకూటి రాజు, క్లాప్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ నాయకులు అనిల్‌, సురేష్‌, వాటర్‌ సప్లై కార్మికుల యూనియన్‌ నాయకులు వెంకటరావు, శంకర్‌ రెడ్డి, యుజిడి సెక్షన్‌ నాయకులు ఇ.ఆదినారాయణ పాల్గొన్నారు.