ఔను
మాకు భావోద్వేగం ఎక్కువ
ద్రవ్యం మా ఇంట లేనందున
బంధాల భావాలు
మా నరనరాన
హక్కుల కోసం
మా బతుకుల కోసం
కాగడాలై మండేది మేం
ఏ ఉద్యమమైనా
ఏ పోరాటమైనా
ఏ రాస్తారోకోనైనా
ముందువరుసలో మేం!
తూటా దిగినా
లాఠీ విరిగినా
థర్డ్ డిగ్రీ ప్రయోగమైనా
ఎన్ కౌంటర్ అయినా
ఆవేశంలో ఆత్మహత్యైనా
పోయేది మా ప్రాణాలే!
మా శవాల మీద పేలాలు ఏరుకుంటూ
రాజ్యాన్ని ఏలేది మీరూ!!
మా తల్లిదండ్రులకో దుశ్శాలువ
తరాల సరిపోయే సంపద మీ వాకిట
మా పేరు మీద ఓ స్మారకం
రాజ్యమే నిర్మాణం ఓ కొత్త ఒరవడి
డబ్బులు మావే
దరువులూ మావే
రాజ్యంలో భాగస్వామ్యం మేమెరుగం
మేం కానరాం
ఏనాడో ఒకనాడు
ఉప్పెనై విరుచుకుపడక మానదులే!
మేం నిర్మించుకుంటేనే
అది యాది
మీరు నిర్మిస్తే
అది ముమ్మాటికీ ఎత్తుగడే!
- గిరి ప్రసాద్ చెలమల్లు
9493388201