మంగ పుట్టగానే తల్లి మరణించింది. ఆ దిగులుతో తండ్రి రత్నయ్య తను చేస్తున్న వ్యాపారం మీద మనసు పెట్టలేకపోయేవాడు. దాంతో వ్యాపారంలో నష్టాలొచ్చాయి. వ్యాపారాన్ని మూసివేసి, వున్న కొద్దిపాటి వ్యవసాయం చేసుకోసాగాడు. దాంతో మంగ నష్ట జాతకురాలని, ఆమె పుట్టిన తరువాత అన్నీ అశుభాలే జరుగుతున్నాయని గ్రామంలో అనుకోసాగారు. రత్నయ్య మాత్రం కూతుర్ని ప్రేమగా పెంచి, పెద్ద చేశాడు.
ఒకరోజు సంతకెళ్ళే ఆ వూరి వ్యాపారి ఒకడు బయలుదేరి వెళుతూ వుంటే అనుకోకుండా మంగ ఎదురొచ్చింది. ఆయన సంతకెళ్ళి తిరిగొచ్చే సమయంలో గుర్రబ్బండి బోల్తాపడి, ఆయనకు కాలు విరిగింది. దాంతో ఆమె ఎదురొస్తే మంచిదికాదని నమ్మకం ఒకటి ఏర్పడిపోయింది. ఇదంతా తెలిసి మంగ బాధపడేది. మంగకు పెళ్ళీడు రాగానే రత్నయ్య పొరుగూర్లో తన తాహతుకు తగిన సంబంధం చూసి పెళ్ళిచేసి మంగను కాపురానికి పంపాడు.
మంగ భర్తకు గ్రామంలో చిన్న చిల్లరకొట్టు ఉంది. అదే అతనికి బతుకు తెరువు. మంగ అతనింట్లో కాలు పెట్టినప్పటి నుండి అతనికి మంచిరోజులు ప్రారంభమయ్యాయి. వ్యాపారం పెరిగి, రాబడి బాగా పెరిగింది. ముందే నమ్మకాల మనిషైన మంగ భర్త ఆమెను అదష్ట దేవతగా భావించాడు. ఆమెను ఎంతో అభిమానంగా చూసుకోసాగాడు. ఆయన ఏ పనిమీద బయటకు పోవాలన్నా మంగ ఎదురు రావాల్సిందే. ఆమె సలహా తీసుకోకుండా ఏ నిర్ణయమూ తీసుకునేవాడు కాదు. మంగకు ఆశ్చర్యం అనిపించేది. తన వూర్లో తనను దురదష్టానికి ప్రతిరూపం అన్నారు. ఇప్పుడు తన భర్త తనను అదష్టానికి ప్రతిరూపంగా భావిస్తున్నాడు. ఎంత ఆలోచించినా అసలు విషయం ఆమెకు బోధపడలేదు.
పట్టణంలో చదువు ముగించుకుని, స్వగ్రామం చేరింది పక్కింటి వాణి. ఆమెతో మంగకు మాటలు కలిశాయి. రోజులు గడిచేకొద్దీ స్నేహం బలపడింది. సొంత విషయాలు మాట్లాడుకునే చనువు ఏర్పడింది. మంగ తన మనసులోని సందేహాన్ని బయటపెట్టింది వాణి దగ్గర. దానికామె, 'ఏదో ఒకటో రెండో అనుభవాలు మనిషిని గుడ్డిగా కొన్ని నమ్మకాలు ఏర్పరుచుకునేలా చేస్తాయి. జీవితాంతం వాటిని పట్టుకుని ఊగులాడుతుంటాడు. ఏ అనుభవమైనా యాదచ్ఛికంగా కలిగేదే. అవేవీ స్థిరమైనవికావు. వాటి ఆధారంగా స్థిరమైన నిర్ణయాలను ఏర్పరుచుకోవటం తెలివైన పనికాదు. నీ జీవితానుభవాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
నువ్వు పుట్టినపుడు నీ తల్లి చనిపోవడానికి కారణం నువ్వు కాదు. ఆమె అనారోగ్యం కావచ్చు. లేదా సమయానికి సరైన వైద్యం అంది ఉండకపోవచ్చు. అలానే నువ్వు కాలుపెట్టగానే నీ భర్తకు వ్యాపారం కలిసిరావడం పూర్తిగా నీ అదష్టంకాదు. ఆయన పట్టుదల, కషి, వ్యాపార దక్షత కారణాలు. ఆయనకు నీ మీద వున్న అభిమానంతో అదష్టం అంతా నీదేనని అనిపించి వుండొచ్చు. అది సహజం. అందువల్ల నువు దురదష్టవంతురాలివీ కాదు. అలా అని మహర్జాతకురాలివని కూడా భావించకూడదు. ఎవరికైనా సుఖదుఃఖాలు సహజం. ఒకరి అదష్టానికి గానీ దురదష్టానికి గానీ ఎవరూ కారణం కాదు. అంతా వారికున్న శక్తి యుక్తులు, ప్రయత్న బలమూ కారణమై ఉంటాయి.
అంతేకానీ అంతటికీ ఎవరో కారణం అన్న మూఢ నమ్మకంతో ఎవరినీ కించపరచడం, అవమానించడం చేయకూడదు' అన్నది వాణి.
మూఢనమ్మకాలు ఎంత అసత్యమైనవో, అస్థిరమైనవో అప్పుడు అర్థమైంది మంగకు.
గంగిశెట్టి శివకుమార్