అనూహ్యమేం జరగట్లేదు,
ఇప్పుడు జరుగుతున్నదంతా
ముందు ఊహించిందే....
అంచనాలేం తప్పట్లేదు,
చరిత్ర గొంతును నలిపిన చేతులతోనే,
అది వర్తమానాన్ని ఏలుతోంది..
మేకతోలును అదెన్నడూ కప్పుకోలేదు,
ముందు నుండీ దాని వికృత రూపాన్ని
బహిరంగంగానే ప్రదర్శిస్తోంది..
మనకన్నీ ముందే తెలుసు
అదొక మృగమనీ,
వేట దాని స్వభావమనీ ఎరుక,
అన్నీ తెలిసే అడవిని అప్పగించాక,
దాని కోరల నుండి కారుతున్న నెత్తుటి చుక్కల్ని చూసి దిగులెందుకు..?
చలిచీమలమై ఒక్కో మట్టి రేణువు జోడించి,
సుందరంగా నిర్మించుకున్న పుట్టలపైకి
దాని తాలూకు సర్పాల్ని ఉసిగొల్పుతోంది..
ఆ అండతోనే,
నక్కలు ఊళలేస్తూ,
పాములు బుసకొడుతున్నాయి,
తిని వదిలేసిన దేహాల కోసం
రాబందులు నిరీక్షిస్తున్నాయి..
ఇప్పుడు అడవంతా,
పిచ్చి పట్టిన మృగాల,
పచ్చి నెత్తుటి కంపు..
భయపడాల్సిన సమయం కాదు,
ఇప్పటికైనా మించిపోయిందేం లేదు.
జరగకూడనివెన్నో జరిగిపోయాయి..
ఆపాల్సినవింకా చాలానే ఉన్నాయి..
ఎలాగైనా సరే అడవిని కాపాడుకోవాలి..
అడవిని కాపాడుకోవాలి..
చంపడమే దాని అంతిమ లక్ష్యమైనప్పుడు..
పోరాటమే మన చివరి నిర్ణయమవ్వాలి..
జాబేర్ పాషా
00968 78531638