Jun 07,2023 07:46

2027 నాటికి భారతీయ రైల్వేలో 151 ప్రైవేట్‌ రైళ్లు నడుస్తాయి. స్టేషన్ల ఆధునీకరణ పేరుతో ప్రైవేటీకరణ కూడా అమలు చేస్తున్నారు. విమానాశ్రయాల తరహాలో రైల్వే స్టేషన్లలోనూ యూజర్‌ చార్జీలను ప్రవేశపెట్టేందుకు మోడీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. స్టేషన్లను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించే ఎత్తుగడ కూడా ఉంది. సామాన్యులకు ఆధారమైన రైల్వేలు మెల్లగా ధనికుల విలాసవంతమైన ప్రయాణాలకు వేదికగా మారుతున్నాయి. పోస్టులను భర్తీ చేయకుండా, భద్రతా లోపాలను సరిచేయకుండా...నిర్వహించే వందేభారత్‌ వేడుకలు... మరిన్ని రైల్వే విపత్తులకు దారి తీస్తాయి.

        'భారత రైల్వేలో ప్రయాణం ఇప్పుడు ఆహ్లాదకరమైన అనుభవంగా మారుతోంది. ఈ స్వాతంత్య్ర అమృతోత్సవ కాలంలో రైల్వేలు గొప్ప ప్రగతిని సాధిస్తున్నాయి. ప్రతి వందేభారత్‌ రైలు ఆధునిక భారతదేశాన్ని ప్రతిబింబిస్తున్నది. ప్రతి వందేభారత్‌ రైలు దేశ ప్రగతికి, స్వావలంబనకు ప్రతీకగా మారుతోంది'- ఇవీ ప్రధాని నరేంద్ర మోడీ మాటలు. జనవరి 15న సికింద్రాబాద్‌-విజయవాడ వందే భారత్‌ సర్వీస్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ విధంగా మాట్లాడారు.
         వందేభారత్‌, అమృతోత్సవాల వెలుగులో మోడీ ప్రభుత్వం మరచిపోయిన విషయం ఒకటుంది. అదే ప్రయాణీకుల భద్రత. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు అత్యధిక సంఖ్యలో వందేభారత్‌ రైళ్లను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
వందే భారత్‌ కోసం భద్రతతో సహా రైల్వేకు సంబంధించిన అన్ని ఇతర అత్యవసర అవసరాలూ వాయిదా వేయబడుతున్నాయి. ఏటా రైలు ప్రమాదాలు పెరుగుతున్నా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదు. సిగలింగ్‌ వ్యవస్థలో తీవ్ర లోపాలను ఎత్తిచూపుతూ కాగ్‌ చేసిన హెచ్చరికను, సీనియర్‌ అధికారి లేఖను ప్రభుత్వం రైల్‌ భవన్‌ చెత్తబుట్ట లోకి విసిరేసింది. దాదాపు 300 మంది ప్రాణాలను బలిగొన్న ఒడిశా రైలు దుర్ఘటన, రైలు రంగం పట్ల మోడీ ప్రభుత్వం చూపుతున్న తీవ్ర ఉదాసీనతకు స్పష్టమైన చిత్రం.
 

                                                                        'ప్రైవేటు' కోసమే....

సాధారణ బడ్జెట్‌కు ముందు ప్రత్యేక రైలు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిపివేయబడింది. బ్రిటీష్‌ పాలనలో 1924 నుండి రైల్వే గణాంకాలు ఇతర ప్రభుత్వ గణాంకాల నుండి విడిగా సమర్పించబడ్డాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఇది కొనసాగింది. స్వతంత్ర భారతదేశంలో మొదటి రైలు బడ్జెట్‌ను జాన్‌ మథారు సమర్పించారు. భారతదేశం వంటి పెద్ద దేశంలో రైల్వే వ్యవస్థ ప్రాముఖ్యతను గ్రహించి, స్వాతంత్య్రం తర్వాత కూడా ప్రత్యేక బడ్జెట్‌ సమర్పణ కొనసాగింది. అయితే, 2016లో మోడీ ప్రభుత్వం ప్రత్యేక రైలు బడ్జెట్‌ను ఆపివేసి సాధారణ బడ్జెట్‌లో భాగం చేసింది. వివేక్‌ దేవరారు కమిటీ సిఫార్సు మేరకు ఈ చర్య తీసుకున్నారు. దీంతో రైల్వే పనుల తీరును పరిశీలించాల్సిన పార్లమెంట్‌లో సవివరమైన రైల్వే బడ్జెట్‌ చర్చ కూడా కనుమరుగైంది. ప్రభుత్వానికి రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, వారి ప్రైవేటీకరణ ఎత్తుగడలపై పార్లమెంట్‌లో చర్చ జరగకూడదు. రెండు, రైలు ఛార్జీలలో పారదర్శకత లేకుండా చేయడం, ఫ్లెక్సీ వ్యవస్థను అమలు చేయడం మొదలైనవి.
 

                                                         ఉద్యోగ నియామకాలపై నిషేధం నష్టదాయకం

ప్రైవేటీకరణను వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా రైల్వే నియామకాలను వీలైనంత వరకు తగ్గించడం యుపిఎ-2 ప్రభుత్వ విధానం. మోడీ ప్రభుత్వం దీన్ని మరింత పకడ్బందీగా అమలు చేసింది. ప్రస్తుతం 10 లక్షల ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 3.14 లక్షల పోస్టులు రైల్వేలో ఉన్నాయి. భద్రతా విభాగంతోపాటు పది వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెక్యూరిటీ విభాగంలో సరిపడా ఉద్యోగులు లేకపోవడంతో 15-16 గంటల పాటు నిరంతరం పని చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మహిళా లోకోపైలట్‌లు సైతం 12 గంటల వరకు నిరంతరంగా పని చేయాల్సి వస్తోంది. పని ఒత్తిడి ప్రభావం సహజంగానే రైల్వేల నిర్వహణపై పడింది. అయితే వందే భారత్‌ హడావుడిలో మోడీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోవడం లేదు.
హెచ్చరికలను పట్టించుకోలేదు
          రైళ్లు పట్టాలు తప్పడాన్ని తీవ్రంగా పరిగణించి పరిష్కారం చూపాలని గత డిసెంబర్‌లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కాగ్‌ నివేదిక పేర్కొంది. పట్టాలపై నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో సహా పట్టాలు తప్పడానికి గల కారణాలను నివేదికలో పేర్కొన్నారు. దీంతోపాటు ఫిబ్రవరిలో సౌత్‌వెస్ట్‌ రైల్‌ జోన్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ మేనేజర్‌ సిగలింగ్‌ వ్యవస్థ లోని లోపాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. యశ్వంత్‌పూర్‌-నిజాముద్దీన్‌ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ సిగల్‌ తప్పి గూడ్సు రైలును ఢకొీట్టడంతో ఏర్పడిన పరిస్థితిని లేఖలో వివరించారు. లోకో పైలట్‌ అప్రమత్తంగా ఉండటం వల్లే పెను ప్రమాదం తప్పిందని, సిగలింగ్‌ వ్యవస్థలను తనిఖీ చేసి లోపాలను వెంటనే సరిచేయాలని అధికారి కోరినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు.
 

                                                              మరింత వేగంగా ప్రైవేటీకరణ లక్ష్యం

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైల్వేల ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తోంది. పిపిపి మోడల్‌ ముసుగులో ప్రైవేటీకరణ చేపడుతోంది. ఇప్పటికే 109 రూట్లలో ప్రైవేట్‌ రైళ్లను అనుమతించారు. తొలి ప్రైవేట్‌ రైళ్లు పరుగులు తీయడం ప్రారంభించాయి. 2027 నాటికి భారతీయ రైల్వేలో 151 ప్రైవేట్‌ రైళ్లు నడుస్తాయి. స్టేషన్ల ఆధునీకరణ పేరుతో ప్రైవేటీకరణ కూడా అమలు చేస్తున్నారు. విమానాశ్రయాల తరహాలో రైల్వే స్టేషన్లలోనూ యూజర్‌ చార్జీలను ప్రవేశపెట్టేందుకు మోడీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. స్టేషన్లను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించే ఎత్తుగడ కూడా ఉంది. సామాన్యులకు ఆధారమైన రైల్వేలు మెల్లగా ధనికుల విలాసవంతమైన ప్రయాణాలకు వేదికగా మారుతున్నాయి. పోస్టులను భర్తీ చేయకుండా, భద్రతా లోపాలను సరిచేయకుండా...నిర్వహించే వందేభారత్‌ వేడుకలు... మరిన్ని రైల్వే విపత్తులకు దారి తీస్తాయి.
 

/'దేశాభిమాని' సౌజన్యంతో/