
గత రెండేళ్లుగా అలలు అలలుగా కరోనా మహమ్మారి కుదిపిన కుదుపులకు అల్లాడిపోయిన ప్రజలు కరోనా కేసుల తగ్గుదలతో కాస్త ధైర్యంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ పరిస్థితులలో ప్రపంచవ్యాపితంగా మంకీ పాక్స్ అనే మహమ్మారి విజృంభిస్తోంది. కేవలం ఆఫ్రికాకు మాత్రమే పరిమితమైందనుకున్న ఈ వ్యాధి.. యూరప్, అమెరికా, ఆసియా ఖండాలకు కూడా పాకి, ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పుడు భారత్‌లోనూ కేసులు వెలుగు చూస్తుండడం, తాజాగా కేరళలో ఒక మరణం నమోదు కావడంతో మనదేశంలో ఆందోళన మొదలైంది. జులై 14న మన దేశంలో మొదటి కేసు నమోదు కాగా, ఆగస్టు మూడో తేదీ నాటికి ఈ సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. జులై 23న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని సూచించడం, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలు హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలు.. లక్షణాలు, నివారణ గురించి ప్రత్యేక కథనం..

మనదేశంలో ఇప్పటికి ఢిల్లీలో నాలుగు, కేరళలో ఐదు కేసులు మొత్తం తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఈ తొమ్మిది మందిలో ఐదుగురికి విదేశీ ప్రయాణ చరిత్ర ఉంది. మిగిలిన నలుగురికి ఎటువంటి ప్రయాణచరిత్ర లేదు. కొన్ని రాష్ట్రాలలో అనుమానిత కేసులకు ఐసోలేషన్ పద్ధతిలో వైద్యం జరుగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో..
తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ కేసుల ప్రస్తావన వస్తోంది. నిర్దారణ అయిన కేసులు లేనప్పటికీ అనుమానిత కేసులు కలవరం రేపుతున్నాయి. తాజాగా గుంటూరులో మంకీపాక్స్ అనుమానిత కేసు కలకలం రేపింది. ఓ ఎనిమిదేళ్ల బాలుడి ఒంటిపై దద్దుర్లు కనిపించటంతో కుటుంబసభ్యులు జీజీహెచ్‌లో చేర్పించారు. బాలుడ్ని ప్రత్యేకవార్డులో ఉంచి, చికిత్స అందించారు. మంకీపాక్స్ లక్షణాలు కనిపించటం వల్ల బాలుడి శాంపిల్స్‌ను గాంధీ ఆసుపత్రికి పంపించారు. బాలుడి తల్లిదండ్రులు ఒడిశాకి చెందినవారు కాగా.. ఉపాధి కోసం పల్నాడుకి వచ్చారు.

మన దేశంలో..
మన దేశంలో మంకీపాక్స్‌తో కేరళకు చెందిన యువకుడు (22) జులై 30న మృతి చెందాడు. యువకుడి మృతి నేపథ్యంలో 20 మందిని ప్రస్తుతం క్వారంటైన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. మృతుడి కుటుంబసభ్యులు, స్నేహితులు సహా అందరినీ క్వారంటైన్‌లో ఉంచి గమనిస్తున్నారు. కేంద్రం ఈ వ్యాధి కోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేసింది. మంకీపాక్స్ లక్షణాలు, చికిత్సకు సంబంధించి విధి విధానాలనూ ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.. జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
సాధారణంగా వర్షాల నేపథ్యంలో చికెన్ పాక్స్ కేసులు నమోదవుతుంటాయి. మంకీపాక్స్ లక్షణాలు చాలావరకు చికెన్ పాక్స్ తరహాలోనే ఉండటంతో గందరగోళం నెలకొంటోంది. దీనికి తోడు వ్యాధి లక్షణాలు కనిపించిన వాళ్లకు.. మంకీపాక్స్ సోకిందేమో అని అధికారులు హడలిపోతుండడం, వైరస్ నిర్ధారణకు శాంపిల్స్‌ను ఉన్నతస్థాయి పరీక్షా కేంద్రాలకు పంపిస్తున్నారనే వార్తలను విని, ప్రజలు భయకంపితులు అయిపోతున్నారు. అయితే ఈ పరీక్షలలో నెగెటివ్‌గా తేలిన కేసులన్నీ చాలావరకు చికెన్‌పాక్స్ కేసులు కావడం కొంతవరకు ఊరట కలిగిస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, రాజస్థాన్, యుపీ.. ఇలా చాలాచోట్ల మంకీ పాక్స్ వైరస్ భయంతో పరీక్షలు జరపగా.. నెగెటివ్‌గా తేలడం, అవన్నీ చికెన్‌పాక్స్ కేసులు కావడం గమనార్హం.
ఈ తేడాలను గుర్తించడం ఎలా ?
శరీరంలో దద్దుర్లు, బొబ్బలు వచ్చే ప్రాంతాన్నీ, బొబ్బలు కొనసాగే రోజులను బట్టి, జ్వరం వచ్చే తీరును బట్టి వచ్చిన వ్యాధి మంకీ పాక్సా, చికెన్ పాక్సా అనే ప్రాథమిక అంచనాకు రావచ్చు.
చికెన్ పాక్స్‌లో
ముందుగా చర్మంపై దద్దుర్లు మొదలవుతాయి. ఆ తరువాత జ్వరం వస్తుంది. ఈ దద్దుర్లు చిన్నచిన్నవిగా ఉంటాయి. శరీరమంతా రావచ్చు. విపరీతంగా దురద ఉంటుంది. అరిచేతులు, అరికాళ్ళకు దద్దుర్లు వచ్చే అవకాశం చాలా తక్కువ. చికెన్ పాక్స్ వల్ల ఏర్పడే దద్దుర్లు బొబ్బలుగా మారి, చిట్లి చెక్కులు కడతాయి. వారం రోజుల తర్వాత వాటంతా అవే తగ్గిపోతాయి.
మంకీ పాక్సులో
మంకీపాక్స్ సోకిన వారిలో ముందుగా జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో దగ్గు, గొంతునొప్పి, లింఫ్ గ్రంధులు వాపు వంటి లక్షణాలు కనిపించవచ్చు. నాలుగైదు రోజుల తరువాత దద్దుర్లు, బొబ్బలు కనిపిస్తాయి. మంకీపాక్స్‌లో దద్దుర్లు పెద్దవిగా ఉంటాయి. దురద పెద్దగా ఉండదు. దద్దుర్లు, బొబ్బలు ముందుగా అరిచేతులు, అరికాళ్ళు, కళ్ల వద్ద ఏర్పడి తర్వాత శరీరమంతా విస్తరిస్తాయి. మంకీ పాక్స్‌లో అరచేతులు పాదాల పైన దద్దుర్లు వస్తాయి. చాలామందిలో మూడువారాల వరకూ ఇవి ఏర్పడుతూనే ఉంటాయి. జ్వరం కూడా ఎక్కువ రోజులు వస్తూనే ఉంటుంది.
ఇంకుబేటరీ పీరియడ్
వ్యాధికారక సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించినప్పటి నుంచి వ్యాధి లక్షణాలు కనిపించేవరకు పట్టే కాలాన్ని ఇంకుబేటరీ పీరియడ్ అంటారు. మంకీపాక్స్ వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పటి నుంచి వ్యాధి లక్షణాలు బయటపడడానికి ఐదు నుంచి 21 రోజులు పట్టవచ్చు. వ్యాధి లక్షణాలు దరిదాపుగా రెండు నుంచి నాలుగు వారాలు పాటు కొనసాగవచ్చు. మంకీపాక్స్ వ్యాధిలో మరణాలు పెద్దగా లేకపోయినప్పటికీ ఇంకుబేటరీ పీరియడ్ ఎక్కువగా ఉండడం, వ్యాధి లక్షణాలు ఎక్కువ రోజులు కొనసాగడమన్నది పెద్ద సమస్య. పక్కవాళ్లకు అంటుకోకుండా నెల రోజుల పాటు ఐసోలేషన్ ఉండడమన్నది పేద ప్రజలకు కష్టసాధ్యం.
పుట్టుక ఇలా..

మంకీపాక్స్ ఇప్పటికిప్పుడే పుట్టుకొచ్చిన కొత్త జబ్బేమీ కాదు. ఈ వ్యాధిని 1958లో మొట్టమొదటగా వైద్య ప్రయోగశాలలో ఉపయోగిస్తున్న కోతులలో గుర్తించారు. అందుకే దీనికి మంకీ పాక్స్ అనే పేరు పెట్టాను. ఆ తరువాత డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (ణ=జ) 1970లో మనుషుల్లోనూ గుర్తించారు. అప్పటి నుంచి మధ్య, పశ్చిమాసియాలోని అనేక దేశాలలో అప్పుడప్పుడు నమోదవుతూనే ఉంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి ఆసియా ఖండాన్ని దాటి, ఆగస్టు మూడో తేదీనాటికి 80 దేశాలకు పాకి, 22,000 మందికి సోకిందన్నది అధికారిక సమాచారం. మంకీపాక్స్ కోతులకే పరిమితం కాలేదు. కోతులతో పాటు ఉడుతలు, ఎలుకలకూ వస్తుంది. వీటితో అనుసంధానంగా ఉన్నటువంటి మనుషులకూ వస్తుంది. మనిషికి వచ్చిన తర్వాత, మనిషి నుంచి మనిషికీ వస్తుంది.
మనిషి నుంచి మనిషికి..
మంకీపాక్స్ వ్యాధి సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే పెద్ద పెద్ద తుంపర్ల ద్వారా రోగికి దగ్గరలో ఉన్న ఎదుటివ్యక్తికి రావచ్చు. గాలి ద్వారా సోకిన ఆధారాలు ఇంతవరకు రుజువు కాలేదు.
- ఈ వ్యాధి సోకిన వ్యక్తి చర్మాన్ని నేరుగా తాకడం ద్వారా.
- రోగి వాడిన వస్తువులను తాకడం ద్వారా, రోగి వాడిన బట్టలను, మంచాన్ని రెండు రోజులలోపు ఉపయోగించడం ద్వారా
- పురుష స్వలింగ సంపర్కం ద్వారా.
- మంకీపాక్స్ సంపర్కం ద్వారా వ్యాప్తి చెందే జబ్బు కానప్పటికీ ఇప్పటివరకు నమోదైన మంకీ పాక్స్ కేసులలో 98% పురుష స్వలింగ సంపర్కులు ఉండడం అంతర్జాతీయ నిజం. ఈ విషయాన్ని ఎంతో పేరొందిన సైన్స్ పత్రిక 'న్యూ ఇంగ్లాండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్' ప్రచురించింది. ఇదే విషయాన్ని వైద్యరంగంలో ప్రముఖపాత్ర పోషిస్తున్న బ్రిటిష్ మెడికల్ జర్నల్ కూడా ప్రచురించింది. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని, 'గే'లు జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ప్రకటించింది.
మనల్ని మనమే రక్షించుకోవచ్చు!

మంకీ పాక్స్ నుంచి మనల్ని మనమే రక్షించుకోవాలి. వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసుకొని, ఆచరించగలిగితే దరిదాపుగా మంకీపాక్స్ సోకకుండా చేసుకోవచ్చు.
ఎవరికి ప్రమాదం ఎక్కువ?
మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉన్నా, దీంతో మరణాలు సంభవించే అవకాశం చాలా తక్కువ. ఈ వ్యాధికి ప్రత్యేకమైన వైద్యం లేకపోయినా, వ్యాధిని ముందుగానే గుర్తిస్తే లక్షణాలను బట్టి వైద్యం చేసుకుంటే దరిదాపుగా 99% మంది ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు. ఈ వ్యాధి తీవ్రత మూడేళ్లలోపు చిన్నపిల్లలలో, 60 ఏళ్లు పైబడిన పెద్దలలో, బీపీ, షుగర్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఎయిడ్స్ లాంటి మొండివ్యాధులతో బాధపడుతున్నవారిలో, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వారిలో, మూత్రపిండం ఆపరేషన్ జరిగిన, కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేసుకుంటున్న వారిలో, స్టెరాయిడ్ మందులు ఎక్కువ కాలం వాడుతున్న వారిలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
మంకీపాక్స్ వైద్యం

మంకీపాక్స్‌కి ప్రత్యేకమైన వైద్యం ఏమి అందుబాటులో లేదు. జ్వరానికి జ్వరం మందులు, ఒళ్ళు నొప్పులకు నొప్పులు మందులు వేసుకోవాలి. దురద (జిల) ఉంటే అందుకు సంబంధించిన మందులు వాడుతూ, లక్షణాల ఆధారంగా వైద్యం చేసుకోవడమే. కరోనాకి వాడుతున్నట్లుగా కొన్ని యాంటీ వైరల్ మందుల మీద ప్రయోగాలు జరుగుతున్నాయి.
మంకీ పాక్స్‌కి స్మాల్‌పాక్స్ (పెద్దమ్మవారు)కి ఉన్న సంబంధం..

స్మాల్‌పాక్స్‌కి కారణమైన వైరస్, మంకీపాక్స్‌కి కారణమైన వైరస్‌లు వేరైనప్పటికీ ఈ రెండు వైరస్లు వ్యారిసెల్లా వైరస్ కుటుంబానికి చెందినవే. మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు, పెద్ద అమ్మవారు అంటే స్మాల్‌పాక్స్ వ్యాధి లక్షణాలు దరిదాపుగా ఒక్కటే. స్మాల్‌పాక్స్ కంటే మంకీపాక్స్ వ్యాప్తి తీవ్రత తక్కువ. స్మాల్‌పాక్స్‌ని 1980లోనే ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించడం జరిగిపోయింది. అప్పటినుంచి ప్రపంచంలో ఎక్కడా ఒక్క స్మాల్‌పాక్స్ కేసు నమోదు కాలేదు. స్మాల్‌పాక్స్ టీకాని విస్తృతంగా వేయించుకోవడం కారణంగానే దాన్ని నిర్మూలించగలిగాం. గతంలో స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి మంకీపాక్స్ రాకుండా 80% రక్షణ ఉంటుందని పరిశోధనా ఫలితాలు తెలియజేస్తున్నాయి. స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్ ఉపయోగించడం ఆపివేసి సుమారుగా 40 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ వ్యాక్సిన్ ద్వారా వచ్చిన వ్యాధి నిరోధక శక్తి క్రమంగా తగ్గడం కూడా మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తి చెందడానికి ఒక కారణంగా పరిశోధకులు వ్యక్తపరిస్తున్నారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని, మంకీపాక్స్ నివారణ చర్యగా ప్రజలందరికీ స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్ వేసే విధంగా జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మనదేశంలో వ్యాక్సిన్ తయారుకోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ఇప్పటికే వ్యాక్సిన్ తయారీదారులను ఆహ్వానించి, వ్యాక్సిన్ తయారీ సన్నాహక కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఈ వ్యాక్సిన్ విషయంలో మనదేశంలో ఏం చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మంకీపాక్స్ టాస్క్‌ఫోర్స్ కమిటీ వీలైనంత త్వరగా నిర్ణయించాల్సిన అవసరం ఉంది.
ఇలా చేయాలి
- మంకీపాక్స్ బాధితులను ఇతరులకు దూరంగా ఐసోలేషన్‌లో ఉంచాలి.
- శరీరంపై దద్దుర్లు పూర్తిగా తగ్గేంతవరకు ఐసోలేషన్‌లో ఉండాలి.
- ొ బాధితులు మూడు లేయర్ల మాస్క్ ధరించాలి. దద్దుర్లకు బయటి గాలి తగలకుండా.. చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి.
- బాధితులకు దగ్గరకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖానికి మాస్క్‌లు, చేతులకు గ్లౌజులు ధరించాలి. ఆ తర్వాత చేతులను సబ్బుతో లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.
- ఇంటి పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి
- జ్వరం ఉండి, వంటి మీద దద్దుర్లు, బొబ్బలు వచ్చిన ప్రతి ఒక్కరూ అది చికెన్‌పాక్స్ అని అనిపించినా ఐసోలేషన్‌లోనే ఉంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, మంకీ పాక్స్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.
- కరోనా నిబంధనలుగా మనం పాటిస్తున్న మాస్కు ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం, తరచుగా చేతులను శుభ్రం చేసుకోవడమనే నిబంధనలను మంకీ పాక్స్ కట్టడికి కూడా తప్పక ఆచరించాలి.
- విదేశాల నుంచి, మంకీ పాక్స్ నమోదవుతున్న రాష్ట్రాల నుంచి వచ్చినవారికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది.
ఇవి చేయొద్దు..
- మంకీపాక్స్ బాధితుల దుస్తులు, టవళ్లు, పడకను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు.
- బాధితులు ఉపయోగించిన దుస్తులను మిగతావారి దుస్తులతో కలిపి శుభ్రం చేయకూడదు. వాటిని ప్రత్యేకంగా ఉతకాలి.
- మంకీపాక్స్ లక్షణాలు కన్పిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తిరగొద్దు.
ఆసియాలోని దేశాలలోకి
ప్రవేశించిన తేదీలు
21 మే ... ఇజ్రాయిల్
24 మే ... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
15 జూన్ ... జార్జియా
20 జూన్ ... లెబనాన్, సింగపూర్
22 జూన్ ... సౌత్ కొరియా
24 జూన్ ... తైవాన్
30 జూన్ ... టర్కీ
12 జులై ... రష్యా
14 జులై ... ఇండియా, సౌత్ అరేబియా
20 జులై ... ఖథర్
21 జులై ... థాయిలాండ్
25 జులై ... జపాన్
29 జులై ... ఫిలిప్పీన్స్
ఆగస్టు 4 నాటికి అత్యధిక కేసులు నమోదైన మొదటి పది దేశాలు
వ.సం దేశం పేరు నమోదైన
కేసుల సంఖ్య
1. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 6,616
2. స్పెయిన్ 4,577
3. యునైటెడ్ కింగ్డమ్ 2,749
4. జర్మనీ 2,781
5. ఫ్రాన్స్ 2,239
6. బ్రెజిల్ 1,474
7. నెదర్లాండ్స్ 927
8. కెనడా 890
9. పోర్చుగల్ 633
10. ఇటలీ 505