Oct 30,2022 14:01

'బొయ్యి'మని హారన్‌ మోగిస్తూ బెంగళూరు - కాకినాడ శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఏదో స్టేషన్లో ఆగింది. అప్పుడు సమయం మధ్యాహ్నం ఒంటిగంట. మరి ఆ టైంలో ఆ బండికి అక్కడ హాల్ట్‌ లేదు. సిగల్‌ ఇవ్వక ఆగినట్టుంది. ప్లాట్‌ఫాం మీద జనం లేరు. ఓ కోతుల గుంపు మాత్రం వుంది. కోతులు అటూ ఇటూ గెంతుతూ హడావిడి చేస్తున్నాయి.
అదే ట్రైన్లో తన అమ్మానాన్నలతో కలసి ప్రయాణం చేస్తున్న పదేళ్ల నాని ఉన్నాడు. నానీ చురుకైనవాడు, తెలివైనవాడు. సరదా పనులు చాలా చేస్తుంటాడు. నాని దృష్టి ప్లాట్‌ఫాం మీద కోతుల గుంపుపై పడింది. కిటికీలోంచి తల బయటపెట్టి, వాటి వైపు చేతులూపుతూ 'హారు కోతులూ!' అంటూ అరిచాడు. అవి వాడిని మిర్రి మిర్రి చూస్తున్నాయి. వాటి దృష్టంతా నాని చేతుల మీదే వుంది. ఏదైనా ఆహారం పెడతాడేమో తినాలని ఆశ పడుతున్నట్టున్నాయి వాటి చూపులు.
సరిగ్గా అప్పుడే నానీకి బెంగళూరు స్టేషన్లో నాన్న కొన్న అరటిపళ్లు గుర్తొచ్చాయి. అంతకుముందే మధ్యాహ్న భోజనం ముగించి తను, అమ్మా నాన్న ఒక్కో పండు తిన్నారు. ఇంకా మూడు పళ్లు మిగిలాయి.
'అమ్మా! కోతులు అరటిపళ్లని ఇష్టంగా తింటాయి కదా, వాటికి అరటిపళ్లని వెయ్యనా? ఇది లంచ్‌ టైం కదా!' అన్నాడు నాని తల్లితో.
'అలాగే కన్నా! అయినా కోతులకి లంచ్‌ టైం ఏమిట్రా?' అంది అమ్మ నవ్వుతూ.
'అరె! అరటిపళ్లు మూడే వున్నాయి కదా, మరి కోతులేమో.. అంటూ వాటిని లెక్కపెట్టి, ఆరున్నాయి. ఇప్పుడెలాగ?' అన్నాడు. మళ్ళీ వాడే 'అరటి పళ్ళను కోతులవైపు విసిరేయనా? అవే పంచుకుని, తింటాయి' అన్నాడు.
'వద్దు..వద్దు.. దేనికి దొరికితే అదే తినేస్తుంది. కొన్నిటికి అసలే దొరక్కపోవచ్చు. అవి ఉసూరుమంటాయి' అంది అమ్మ.
'అయితే మరేం చేద్దాం?' అన్నాడు నాని.
'ఉన్నదాన్ని సమంగా పంచుకోవడం గొప్ప గుణం. ఈ సంగతిని మంచీ చెడ్డ తెలిసిన మనుషులే పాటించడం లేదు. అవి కోతులు.. అవేం పంచుకు తింటాయి గానీ.. నువ్వే ఒక్కో పండును సగానికి కోసి.. ఒక్కో ముక్కనీ ఒక్కో కోతి వైపు విసురు. అన్ని కోతులకీ ముక్కలు దొరుకుతాయి' అంది అమ్మ. అంతకుముందు ఆపిల్‌ కోయడానికి బ్యాగు నుండి తీసిన చాకును నానికి అరటిపళ్లు కోయడానికి ఇచ్చింది.
చకచక ఒక్కో అరటి పండును రెండేసి ముక్కలు చేసి, కాగితం ప్లేటులో సర్ది, కిటికీ దగ్గరికి చేరాడు వాడు. నాని చేతిలో అరటిపళ్ల ముక్కల ప్లేటుని చూడ్డంతోనే అంతక్రితం వరకు అల్లరిచిల్లరిగా వున్న కోతులు కంపార్టుమెంటు కిటికీకి ఎదురుగా వచ్చి, కుదురుగా కూర్చున్నాయి. నాని ఒక్కో ముక్కని ఒక్కో కోతి వైపు విసిరాడు. కోతులూ అంతే ఒడుపుగా, ఆత్రంగా ఒక్కోకోతి ఒక్కోముక్కని పట్ట్టుకున్నాయి. ఆరు కోతులకీ ముక్కలు అందాయి.
కోతులు బుద్ధిగా కూర్చుని, అరటిపండు ముక్కల్ని నేర్పుగా తోలు తీసి తినడం చూసిన నాని సంబరంతో చప్పట్లు కొట్టాడు. సిగల్‌ ఇవ్వడంతో బండి నెమ్మదిగా కదిలింది. చేతులూపుతూ కోతులకు 'టాటా' చెప్పాడు నాని. కోతులూ మెరుస్తున్న కళ్లతో నానీని చూస్తూ అరటిపండు ముక్కల్ని తినసాగాయి.

ఎస్‌. హనుమంతరావు
8897815656