
నేషనలైజ్డ్ బ్యాంకు సెంట్రల్ ఆఫీస్ ఉన్న బొంబాయిలో రీజనల్ మేనేజర్ స్థాయి లీలాధర్‌ది. అఫీషియల్ మీటింగ్ ఉండి పట్టణంలోని పెద్ద స్టార్ హోటల్లో దిగాడు.
వచ్చిన అతిథి, బ్యాంకులో పెద్ద మేనేజర్ అని గుర్తించిన లిఫ్ట్ బారు 'సార్, నా వద్ద మారని వెయ్యి రూపాయల నోట్లు ఉన్నాయి. వాటికి కొత్త నోట్లు ఇప్పిస్తారా' అని వినయంగా అడిగాడు.
'అయ్యో, మార్చుకోవడానికి గడువు అయిపోయింది కదండీ'
బాధగా ముఖం పెట్టిన లిఫ్ట్ బారు 'ఎలాగొలా మార్చుకోవచ్చని ఆశపడ్డాను సార్. చేతిలోని డబ్బు చెల్లనిదని తలుచుకుంటే బాధేస్తోంది. డబ్బు విలువ ఏమిటో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది'
'అది అంతే బ్రదర్, మనిషి తయారుచేసే డబ్బు మనిషి జీవితాల్ని శాసిస్తుంది. డబ్బుంటే హీరో, లేకుంటే జీరో ఈ సమాజంలో' అంటూ గదిలోకి వెళ్లాడు. రాత్రంతా మనీ సంబంధిత పత్రికలను తిరగేసి హాయిగా నిద్ర పోయాడు.
తెల్లారిందే నిద్ర లేచి షూస్ వేసుకుని వాకింగ్ బయలుదేరాడు. పట్టణంతో తనకున్న అనుబంధాలను నెమరువేసుకుంటూ నడుస్తున్నాడు. 'అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ల క్రితం ఈ పట్టణంలో పని చేశాను. అప్పటికీ ఇప్పటికీ పోలికే లేదు. ఎకరాల కొద్దీ పంట పొలాలు అపార్ట్‌మెంట్ నిలయాలుగా, పెద్ద కాలనీలుగా రూపాంతరం చెంది ఉన్నాయి' అని ఆశ్చర్యపోయాడు.
చిన్నగా నడుస్తూ ఉంటే పెద్ద అందమైన కాంప్లెక్స్ ఒకటి దారిలో కనిపించింది. పరిశీలనగా చూస్తే అది పట్టణ వాసులు నిర్మించుకున్న గ్యాస్ ఆధారిత క్రెమటోరియం. పేరుకు అది శ్మశాన వాటికే గానీ అదొక పెద్ద మల్టీప్లెక్స్ లాగా ఉంది. మైకులో నుంచి ఘంటశాల భగవద్గీత మృదు మధురంగా వినిపిస్తోంది. చుట్టూ పూల మొక్కలు చక్కగా పెంచారు. వేదాంత పూరిత వాక్యాలు గోడ నిండుగా రాసి ఉన్నాయి.
'అరే, చాలా బాగా కట్టారే, నిజమే, చావుకు చావు ఉండదు కదా, చావు పుట్టుకలు పండుగల్లాగా తీసుకొంటేనే కదా మనిషి మనుగడ' అని తనకు తాను సమాధానం ఇచ్చుకున్నాడు.
రోడ్డులో ఇద్దరు పిల్లలు గాలి బెలూన్లు ఎగురవేస్తున్నారు. అందులో ఒక బెలూనులోని గాలి 'సురు' మని బయటికి వచ్చేసింది. 'అయ్యో, గాలి పోయిందే, ఎలా?' అని బాధపడుతూ ఉన్నాడు పిల్లాడు.
లీలాధర్ ముసిముసి నవ్వులు నవ్వుతూ మనసులో ఇలా అనుకున్నాడు 'బెలూనులో గాలి ఉంటేనే దానికి విలువ. ఒక్కసారి అది బయటికి వస్తే బెలూను విలువ శూన్యం. మనిషి సంపాదించే డబ్బు కూడా అంతే కదా. సరిగా హ్యాండిల్ చేస్తే సరి, లేకుంటే జీవితమంతా సినిమా కష్టాలే'.
అప్పుడే శ్మశాన వాటిక ముందు ఒక అంబులెన్సు వచ్చి ఆగింది. శవాన్ని దించి లోపలికి తీసుకెళ్తున్నారు. మామూలుగా శవమంటే వందలాది జనం గుమికూడతారు. అయితే ఈ శవం దగ్గర జనం పెద్దగా లేరు. ఎందుకో లీలాధర్‌కి ఆసక్తి కలిగి అక్కడే కొద్దిసేపు నిలబడ్డాడు.
'చూడడానికి ఖరీదైన మనిషి శవం లాగా అనిపిస్తోంది. పట్టుమని పది మంది కూడా చుట్టూ లేరు ఏమిటబ్బా' అని ఆశ్చర్యపోయాడు.
చివరి మజిలీ చూస్తే కానీ ఎవరిది గొప్ప జీవితమో తెలియదేమో... ఇంతలో ఓక్స్ వాగన్ కారు ఒకటి వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక గొప్ప ఇంటి మహిళ, ఇంటి పని మనిషి దిగారు. శవం దహనానికి వెళ్లేంత వరకూ వారు అక్కడే మౌనంగా నిలబడ్డారు. దహనం పూర్తయ్యాక ఇంటికి వెళ్లాలని కారులో కూర్చుంటున్నారు.
అప్పుడు లీలాధర్‌కి ఫ్లాష్ లాగా వెలిగింది 'ఎక్కడో చూసిన ఆమె ముఖం...' దగ్గరికి వెళ్లి చూసి, తెలిసిన ఆమె అయితే పలకరిద్దామని గబగబా నడిచాడు. అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. కారు తుర్రుమంది.
వారి గురించి తెలుసుకుందామని శ్మశాన వాటిక భవనంలోకి వెళ్లాడు. దహనానికి వచ్చిన శవం ఎవరిదని అడిగాడు. వారు నింపాదిగా 'డాక్టర్ పుష్కల్ ది' అని చెప్పారు.
పక్కనే పిడుగు పడినట్లయ్యింది.
అంటే, కారులో వచ్చి వెళ్లిన ఆమె, డాక్టర్ భార్య అన్నమాట.
అతడికి తెలియకనే ఆలోచనలు గతంలోకి జారిపోయాయి.
అప్పట్లో- 'పట్టణంలో పెద్ద పేరున్న డాక్టర్ ఎవరు' అని అడిగితే, చిన్న పిల్లలు సైతం టక్కున 'పుష్కల్ సార్' పేరే చెప్పే వాళ్లు. జనరల్ మెడిసిన్ చేసి చిన్న హాస్పిటల్ ప్రారంభించాడు.
పేషెంట్ ముఖం చూస్తే చాలు, రోగాన్ని ఇట్టే కనిపెట్టేసేవాడు. మంచి చౌక ధర మందులు రాసిచ్చేవాడు. ఎంత పెద్ద రోగమైనా టక్కున తగ్గిపోయేది. తనకు సాధ్యం కాని కేసుల్ని మాత్రం, నగరాల్లోని పెద్ద ఆస్పత్రులకు పొమ్మని సలహా ఇచ్చేవాడు.
చాలా డిసిప్లెయిన్ ఉన్న వ్యక్తి. ఎప్పుడైనా అవసరమైతే బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకునే వాడు. తీసుకున్న అప్పు భయంగా, భద్రంగా తీర్చేవాడు. 'అప్పంటే నాకు భయం సార్. తీసుకున్న అప్పు తీర్చేంతవరకూ నాకు నిద్ర పట్టదు సార్' అనే వాడు.
అయితే ఎప్పుడూ తనతో 'ఐ హావ్ ఒన్ బిగ్ డ్రీమ్' అని చెప్పేవాడు. అదేమిటంటే పట్టణంలోనే అతి పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని. చెప్పేటప్పుడు అతడి ముఖంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడేది.
అప్పుడప్పుడూ తను పేషెంట్‌గా ఆయన దగ్గరకు వెళ్లేవాడు. సొంత మనిషి లాగా పలకరించే వాడు. అక్కడే ఫార్మసీ చూసేది ఆయన భార్య. ఆమె కూడా నవ్వుతూ పలకరించేది.
అలాంటి కావాల్సిన మనిషితో, ఉద్యోగ రీత్యా వివిధ రాష్ట్రాలు తిరిగి టచ్ పోయింది.
లీలాధర్ మనసు మనసులా లేదు. 'అయ్యో, ఇలా జరిగిందేమిటి' అని ఆలోచనలో పడ్డాడు.
వెంటనే వెళ్లి మేడమ్‌ని కలవాలని, ఏం జరిగిందో కనుక్కోవాలని అనుకున్నాడు. శ్మశాన వాటిక సిబ్బందిని అడిగి డాక్టర్ ఇంటి అడ్రెస్ తీసుకున్నాడు.
గబగబా నడిచి రూమ్‌కి వెళ్లి ఫ్రెష్ అయ్యాడు. సర్రున కారులో వెళ్లి డాక్టర్ ఇంటి వద్ద ఆపాడు. అక్కడ ఎలాంటి సందడీ లేదు.
చిన్న ఇల్లు అయినా ముచ్చటగా ఉంది. ఇంటి పెద్ద గేటుకు మనీ ప్లాంట్ అల్లుకుని ఉంది. వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు. పని మనిషి బయటికి వచ్చింది. 'మీరు ఎవరండీ' అని అడిగింది. వివరాలు చెప్పాడు. వచ్చి కూర్చోమని చెప్పి సోఫా చూపింది.
గోడ గడియారం శబ్దం తప్పితే ఇంకేమీ అక్కడ వినిపించడం లేదు. గోడకు వేలాడుతున్న ఫొటోలను చూశాడు. డాక్టరు అందుకున్న అవార్డులు, రివార్డుల ఫొటోలవి. పెద్ద పెద్ద వారితో సన్మానాలు అందుకుంటున్న చిత్రాలు.
ఆరోగ్యం మీద ఆయన రాసిన వివిధ ఆర్టికల్స్ ఫైల్ టీపారు పైన ఉంది. తీసి ఒక్కొక్క ఆర్టికల్ చూస్తున్నాడు.
అలికిడి అయితే తల ఎత్తి చూశాడు. అప్పుడే వచ్చిన డాక్టర్ భార్య ఎదురుగా వచ్చి కూర్చుంది. అతడిని ఆమె కనిపెట్టినట్లు ఆమె ముఖం చెబుతోంది.
చిన్నగా 'సారీ మేడమ్' అన్నాడు.
అంతా 'విధి రాత' అంది.
'మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సార్' అని అడిగింది.
'బొంబాయి' అని బదులిచ్చాడు.
'ఏమీ అనుకోకపోతే.. సార్ ఎలా చనిపోయారు మేడమ్'
'ఛాతీలో నొప్పి రావడంతో రెండు వారాలుగా బెంగళూరులోని కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్‌మెంట్ ఇప్పించాము. ప్రాణాలు కాపాడడానికి అక్కడి డాక్టర్లు శతవిధాలా ప్రయత్నించారు. లాభం లేకుండా పోయింది. చివరికి గుండెపోటు తీవ్రంగా రావడంతో నిన్ననే చనిపోయారు'
కొన్ని క్షణాల మౌనం.
'డాక్టర్ బిగ్ డ్రీమ్ నెరవేరిందా?'
'అదే ఆయన ప్రాణం మీదికి తెచ్చింది'
ఆశ్చర్యంగా 'అవునా' అని అడిగాడు.
'పట్టణంలోనే కాదు, చుట్టు పక్కల జిల్లాల్లో కూడా అలాంటి హాస్పిటల్ ఉండకూడదని కోట్లు పోసి కట్టారు. పెద్ద పెద్ద ఆధునిక యంత్రాలన్నీ కొన్నారు. అవసరం అనుకున్నవి విదేశాల నుంచి కూడా తెప్పించారు. ఎక్కడా రాజీ పడలేదు'
ఇంతలో పనిమనిషి కాఫీ తెచ్చి టీ పారు పైన పెట్టింది.
'మరి ఏమి జరిగింది మేడమ్' ఆసక్తిగా అడిగాడు.
'బ్యాంకుల్లోనే కాదు, ఇతర ఫైనాన్స్ సంస్థల్లో కూడా అప్పు చేశారు. బడ్జెట్ చేయిదాటి పోయింది. మిత్రులు, బంధువుల దగ్గర రెండు, మూడు రూపాయల వడ్డీకి తీసుకున్నారు. ఎలాగైతేనేమి, మూడేళ్ల ముందు హాస్పిటల్ పూర్తయ్యింది. అయితే అనుకున్నట్లు హాస్పిటల్ జరగలేదు. పట్టణానికి దూరంగా ఉండడం వల్ల పేషెంట్లు తక్కువగా వచ్చే వారు. అంతే కాక ఇక్కడి జనానికి హాస్పిటల్ ఫీజులు ఎక్కువనిపించాయి. 'ఇంకొంచెం ఖర్చు పెడితే నగరాల్లో ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు కదా' అని అనుకునే వారు. ఇతర డాక్టర్లు దీనిని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. వారికి చేతనైనంత కష్ట నష్టాలను మాకు కలిగించారు. రోజూ హాస్పిటల్‌కి వచ్చి ట్రీట్‌మెంట్ అందించే పెద్ద పేరున్న డాక్టర్లు చిన్నగా రావడం మానుకున్నారు.
రోజువారీ హాస్పిటల్ ఆదాయం, ఖర్చులు లేక్కలేసి డాక్టర్ చాలా బాధపడే వారు. తెల్ల ఏనుగులా తయారయ్యింది హాస్పిటల్ నిర్వహణ. సిబ్బందికి జీత భత్యాలు మొదలుకుని కరెంట్ బిల్ కట్టడం వరకూ డబ్బుల కోసం వెదుక్కోవాల్సి వచ్చేది. దానికి తోడు అప్పులిచ్చిన వారు అప్పు తీర్చమని గట్టిగా అడగడం ప్రారంభించారు. హాస్పిటల్ దగ్గరికి వచ్చి గొడవ చేసేవారు. ఎంతంటే అంత మాట్లాడే వారు. మనిషి బతకడానికి గాలి ఎంత అవసరమో, సంఘంలో నిలబడడానికి డబ్బు అంత అవసరం అని ఆలస్యంగా అర్థం చేసుకున్నాం. అప్పటికే చేయి దాటి పోయింది.
పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఆయనలో మానసిక ఒత్తిడి ప్రారంభమైంది. ఆలోచించి ఆలోచించి ఆరోగ్యం చెడింది. నిదానంగా హాస్పిటల్‌ని అమ్మి అందరి అప్పులూ తీర్చేద్దామని అనుకున్నాము. పెద్ద బడ్జెట్ కావడంతో తక్కువ మంది మాత్రమే కొనడానికి వచ్చారు. వారు కూడా రూపాయి వస్తువు అర్థ రూపాయికి అడగాలని మంతనాలు జరిపారు. అందుకు ఆయన ఎంతో నొచ్చుకున్నారు. ఇంతలోనే జరగరానిది జరిగింది.'
చెబుతున్న ఆమె కళ్ల నుంచి నీళ్లు చీర పైన బొటబొటా రాలాయి.
అక్కడ కొద్దిసేపు శ్మశాన ప్రశాంతత నెలకొంది.
ఆమె దృష్టిని మరల్చాలని- 'మరి పిల్లలు మేడమ్' అన్నాను.
'అమ్మాయి అమెరికాలో ఉంది. అబ్బాయి జర్మనీలో ఉన్నాడు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు.'
కొంచెం బాధగా 'మరి, సార్ అంత్య క్రియలకు వాళ్లు రాలేదా మేడమ్'
'నేనే రావద్దన్నాను. అప్పుల వాళ్ల ఒత్తిడి ఎక్కువైంది. శవం హాస్పిటల్ నుంచి ఇంటికి కూడా రాలేదు. నేరుగా శ్మశాన వాటికకే వెళ్లింది. ఇంటికొస్తే అప్పుల వాళ్లు శవాన్ని కూడా ఎత్తనివ్వరని నా భయం. ఈ మధ్య అప్పులిచ్చిన వాళ్లు మమ్మల్ని చెడ్డ నీడలా వెంటాడుతున్నారు. హాస్పిటల్ అమ్మినా, వారి అప్పు తీర్చకుండా ఎక్కడ ఎగర కొడతామోనని వారి అనుమానం. మా కదలికలను వారు నిశితంగా గమనించడం చూశాను. అందుకే శవాన్ని ఇంటికి తీసుకురాకుండా ఈ నిర్ణయం తీసుకున్నాను.'
ఆమె మాటలకు లీలాధర్ ఉలిక్కిపడ్డంత పనైంది. ఏదో తెలియని అలజడి అతడి మనసులో. బాధతో కాఫీ కూడా తాగాలనిపించలేదు. లేచి నమస్కారం చేసి బయటికి వచ్చాడు.
రోడ్డుపై కారు స్పీడుగా వెళుతోంది. లీలాధర్ మనసు కారుకన్నా వేగంగా వెళుతోంది.
'డాక్టర్లు పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టి కోట్లు సంపాదిస్తున్నారని మాత్రమే విన్నాను. అంటే ఇన్నాళ్లు నాణేనికి ఒకవైపే చూశానా? హాస్పిటల్ కట్టి, ప్రాక్టీసు జరగక దెబ్బతిన్న వాళ్లు కూడా ఉన్నారా... అసలు తప్పు ఎవరిది?..
సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా కోట్ల అప్పులు చేసి నష్టపోయిన డాక్టరుదా? పచ్చగా ఉంటే చాలు అప్పు ఇస్తే ఎక్కడికీ పోదని డబ్బులిచ్చిన వారిదా?
అప్పులిచ్చిన వాళ్లు శవాన్ని ఎత్తనివ్వరేమోనని, ఎవ్వరికీ తెలియకుండా దహనం చేశారు. అంటే పరిస్థితి... ఎంత దారుణంగా తయారై ఉంటే కానీ వారు ఈ నిర్ణయం తీసుకుని ఉండరు.
పాపిష్టి డబ్బు ఎంత నీచానికైనా దిగజారేట్లు చేస్తుందని తెలుసు కానీ, మరీ... ఇంటి నుంచి శవాన్ని కూడా ఎత్తనివ్వరా? అయ్యో... ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా ఈ సమాజంలో?' లీలాధర్ మనసు చిన్నగా మూలిగింది.
ఆర్ సి కృష్ణ స్వామి రాజు
93936 62821