
ప్రతి జీవికి పునరుత్పత్తి ఒక లక్షణం. మానవ పునరుత్పత్తిలో తల్లిదండ్రుల నుంచి ఉద్భవించిన జీవ ప్రక్రియే ఈ సమాజం. 'లోకమందు మాతాపితలు మిత్రుండును వీరు మువ్వురే హితులు' అంటాడు చిన్నయసూరి తన 'మిత్రలాభము'లో. తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు, తల్లిదండ్రుల పట్ల పిల్లలు చూపే ప్రేమానురాగాలు... అచంచలమైన, నిస్వార్థమైన అనుబంధం...అదే రక్తసంబంధంలోని మాధుర్యం. తల్లిదండ్రుల ప్రేమను ఈ విశ్వంలో ఎవరూ భర్తీ చేయలేరు. తమ పిల్లలకు ఎంత వయసు వచ్చినా, ఎంత ఎత్తుకు ఎదిగినా... అమ్మానాన్నకు చిన్నపిల్లల్లానే కనిపిస్తారు. 'అమృతం దొరికితే పంచుకునేవాళ్లు దేవతలు/ అదే అమృతం దొరికితే పిల్లలకు పంచిపెట్టేవాళ్లు అమ్మానాన్నలు' అంటాడో కవి. అమ్మ ఈ ప్రపంచంలోకి తీసుకొస్తే...నాన్న ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. అమ్మ చంకనెత్తుకొని 'చందమామ రావె...జాబిల్లి రావె' అని గోరుముద్దలు పెడితే, తన వీపుమీద అంబారీ ఎక్కించుకొని ఆనందపడతాడు నాన్న. తమ ఆశలను తమ బిడ్డల ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటారు. దానికోసం ఎంత కష్టమైనా భరిస్తారు. చివరకు పస్తులుండి కూడా... బిడ్డల కడుపు నింపుతారు. తమ ఆశలకు ప్రతిరూపాలుగా... తమ కలలకు ప్రతిబింబాలుగా చూసుకుంటారు. అలాంటి తల్లిదండ్రులను వృద్ధాప్యంలో మరొక బాల్యాన్ని అందించాల్సిన బాధ్యత వారి పిల్లలది.
ఈ ఆధునిక యుగంలో ఆశల తీరాల వెంట పరుగులెడుతున్న పిల్లలతో కలిసి వుండలేని పరిస్థితి కూడా కొందరు తల్లిదండ్రులకు ఎదురవుతుంటుంది. సొంత ఊరులోనో, సొంత రాష్ట్రంలోనో ఉపాధి దొరక్క... పక్క రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలస వెళ్లాల్సిన అనివార్య పరిస్థితిని నేటి ప్రపంచీకరణ కల్పించింది. ఇప్పుడు వృద్ధాశ్రమాల్లో, ఇళ్లల్లో అనాథలుగా బతుకులీడ్చే తల్లిదండ్రులది ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదగాథ. 'మనిషి విసిరేయబడుతున్నాడిప్పుడు/ ఊరికొక్కడు దేశానికొక్కడుగా/ వృద్ధులైన తల్లిదండ్రులు పల్లెటూళ్లలో/ కన్నబిడ్డలు చదువులకని హాస్టళ్లలో/ ఇక్కడ తల్లిదండ్రులు తీరికలేని బిజీలో/ అక్కడ తల్లిదండ్రులు ఆలన లేని వేదనలో/ మనిషి జీవితంలో ఇదో విషాదఘట్టం' అంటాడో కవి. ఈ సమాజంలో అమ్మానాన్న లేకుండా అనాథలుగా బతుకుతున్నవారు కొందరు. అమ్మానాన్నలను వదిలేసి అనాధలుగా బతుకుతున్నవారు ఇంకొందరు. 'నీటి బావుల్లాంటి అమ్మానాన్నలు దూరమయ్యాక/ ఎండమావుల్లాంటి జీవితం ఏహ్యమనిపించింది/ ఇక ఆనందం అనూహ్యమనిపించింది' అంటాడో కవి. ఈ చరిత్రలను ఏ సిరాతో రాసినా... సారాంశం ఒక్కటే. బతుకుదెరువు కోసం ఉన్న ఊరుని, కన్నవాళ్లని వదిలేసి పట్టణాలకు, విదేశాలకు వలసపోతున్న కన్నీటి కథలే. 'మనమే తల్లిదండ్రులమయ్యే వరకు తల్లిదండ్రుల ప్రేమ మనకు తెలియదు' అంటాడో రచయిత. ఎవరి జీవితం ఉన్నతస్థితికి చేరినా... వారి ఉన్నతి వెనుక తల్లిదండ్రుల నిరంతర శ్రమ వుంటుందనేది నగ్నసత్యం. అదే సమయంలో పిల్లలకు...వారి తల్లిదండ్రులే సర్వస్వం. పిల్లలను ప్రోత్సహించాలి... వారికి అండగా నిలబడాలి. లేదంటే పిల్లల మనస్సులో విచారం, కోపం తలెత్తే అవకాశం వుంటుంది. ఇటువంటి సంఘటనలు మనుషుల మధ్య దూరం పెరగడానికి కారణమౌతాయి.
అంతేకాదు, ఈ పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లలతో, పిల్లలు తల్లిదండ్రులతో గడపగలిగే సమయాలు అరుదైపోయాయి. 'బూర్జువా వర్గం కుటుంబ వ్యవస్థ మీద వున్న మమకారపు మేలి ముసుగును లాగిపారేసి, కుటుంబ సంబంధాలను కేవలం ఆర్థిక సంబంధాలుగా దిగజార్చింది' అంటాడు కారల్ మార్క్స్ 'కమ్యూనిస్టు ప్రణాళిక'లో. తమ ఉనికికి రూపం ఇచ్చి, తమ ఉన్నతికి బాటలు వేసిన అమ్మానాన్నలకు ఓ చిరుకానుక ప్రతియేటా జులై నాలుగో ఆదివారం నిర్వహించే 'జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం'. 'తల్లిదండ్రుల శక్తి: సంతోషం, ఆరోగ్యం, ఆశాజనకంగా పిల్లలను పెంచడం' అనే థీమ్‌తో ఈ రోజును నిర్వహిస్తున్నారు. ఇదే ఆశావహ దృక్పథంతో తల్లిదండ్రులు పిల్లల ఒత్తిడిని అర్థం చేసుకోగలిగితే...పిల్లలు శ్రవణుడిలా తల్లిదండ్రులను ప్రేమించగలిగితే...వారి అనుబంధం మరింత బలపడుతుంది. నేటి పిల్లలు...రేపటి తల్లిదండ్రులేనన్న వాస్తవాన్ని గుర్తించిన రోజే నిజమైన తల్లిదండ్రుల దినోత్సవం.