
ఇతర రాష్ట్రాలలో సర్వేలలో కూడా మోడీకి మద్దతు నలభై శాతం మించి వుండటం లేదు. అదే సమయంలో వ్యతిరేకులు, అసంతృప్తితో వున్నవారి శాతం అంతకంటే ఎక్కువగా వుంటున్నది. మహారాష్ట్ర లోనూ అదే అంచనా వచ్చింది. మరోవైపున మైనార్టీలలో అభద్రత, సామాజిక శక్తుల చలనం, ప్రతిపక్షాల ఐక్యత పెరుగుతున్నది. బిజెపి మతతత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఓట్లు చీలకుండా చూడాలనే భావన బలపడుతున్నది. బీహార్ రాజధాని పాట్నాలో జరిగే శిఖరాగ్ర సమావేశం దీనిపై స్పష్టమైన సంకేతాలివ్వవచ్చు. 450 స్థానాల్లో బిజెపికి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థి నిలిచేలా చూడాలన్న నినాదం ఇందులో భాగమే, సాధ్యాసాధ్యాలు ఎలా వున్నా ఇది దేశంలో రాజకీయ వాతావరణాన్ని సూచిస్తున్నది.
మే 28వ తేదీన అంగరంగవైభోగంగా ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటు నూతన భవనాన్ని ప్రారంభించారు. అయితే ఆ వెనువెంటనే బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ పిలిపించి ఉపన్యాసం ఇచ్చిపంపారు. కాకుంటే లోక్‌సభ ఎన్నికలు రానుండగా జరిగిన ఈ సమావేశంలో ఆయన యుద్ధానికి దూసుకుపోదామని పిలుపిస్తారనుకుంటే ఆ ఉపన్యాస పాఠం మారింది. మీ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలతో మంచి సంబంధాలు పాటించేలా జాగ్రత్తపడాలని ఉపదేశించారు. వారు ప్రాంతీయ సమస్యల విషయంలో వారి భావాలకు బిజెపి కూడా అండగా వుంటుందనే సంకేతం వెళ్లాలన్నారు. వాస్తవానికి పార్లమెంటు భవన ప్రారంభ సభలో మోడీ స్వయంగా తానే మాజీ ప్రధాని జెడిఎస్ అధినేత దేవెగౌడను అత్యంత ఆప్యాయంగా పలకరించారు. అత్యధిక ప్రతిపక్షాలు బహిష్కరించిన ఈ కార్యక్రమానికి దేవెగౌడతో పాటు ఎ.పి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, టిడిపి ఎంపీలు కూడా హాజరైన సంగతి తెలిసిందే. ఇదంతా ఊరికే పోలేదని గమనించాలి. కర్ణాటకకు తిరిగివెళ్లిన దేవెగౌడ బిజెపి ఏమీ అంటరాని పార్టీ కాదని ప్రకటించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దానితో పొత్తు పెట్టుకోవడం గురించి ఆలోచించవచ్చునన్నారు. ఇక ఎ.పి కి ఎంతో కాలంగా శూన్యహస్తం చూపిస్తున్న కేంద్రం హఠాత్తుగా రెవెన్యూ లోటు కింద రూ.10 వేల కోట్లు విడుదల చేసింది. ఇంతకాలం నిరాకరించిన అన్యాయాన్ని ప్రశ్నించే బదులు ఇది వైసిపి లొంగిపోయిన ఫలితమేనని టిడిపి విమర్శించింది. మోడీ, అమిత్ షాలను జగన్ పలుసార్లు కలుసుకోవడాన్ని తప్పు పట్టింది. కాని మరో రెండు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు స్వయంగా తానే వెళ్లి కలసి వచ్చారు. ఇది వచ్చే ఎన్నికల్లో పొత్తు కోసమని కథనాలు వస్తే ఇరు పక్షాలూ మౌనం పాటిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45 మీటర్లు కాగా 41.5కు తగ్గించి తొలిదశ పేరిట పూర్తిచేస్తామన్నట్టు కేంద్రం ప్రకటిస్తే దానిపై పరస్పరం కీచులాడుకుంటున్నాయి. ఇందుకోసం రూ.17 వేల కోట్లు మంజూరు చేస్తానని కేంద్రం తెలియజేసినట్టు రాష్ట్రం ప్రకటించింది. ప్రజలు ఘోషిస్తున్నట్టు పునరావాసానికి సంబంధించిన ప్రకటనేదీ వెలువర్చలేదు. ఇది కేంద్రానికి లొంగుబాటు అని టిడిపి అంటుంటే తమ ఘనత అని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. అంతేగాని నిధుల కోత, పునరావాసానికి ఎగనామం గురించి పట్టించుకోవడం లేదు. ఇదే సమయంలో తెలంగాణకు సంబంధించి లిక్కర్ కుంభకోణంలో బిఆర్‌ఎస్‌తో ఏదో రాజీకి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. గత వారం రోజుల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగాల్లో బిజెపి పై విమర్శ బదులు కాంగ్రెస్‌పై దాడి పెరిగిందని పరిశీలకులు అంటున్నారు.
అడుగు వెనక్కు
తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఈ ప్రత్యేక కోణాన్ని అలా వుంచితే దేశవ్యాపితంగా బిజెపి నూతన వ్యూహాన్ని తీసుకుందని చెప్పే ఉదాహరణలు ఇంకా వున్నాయి. మూడో సారి కూడా తన్నుకుంటూ వచ్చేస్తామని పైకి చెబుతున్నా తాము నమ్ముకున్న బ్రాండ్ మోడీ పలచబడిపోయిందనీ ఓట్లను రాబట్టే శక్తి చాలడం లేదని సంఘ పరివార్ గ్రహించిన కారణంగానే ఈ కొత్త హడావుడి అంటున్నారు. ఆరెస్సెస్ అధికార పత్రికలోనే ఈ విషయం పరోక్షంగా అంగీకరించారు. మోడీ జనాకర్షణ, హిందూత్వ భావజాలం మాత్రమే అధికారం తెచ్చి పెడతాయనుకుంటే పొరబాటని ఆ పత్రిక పేర్కొంది. ఆయన ఒక్కసారి ప్రచారానికి వస్తే ప్రజలు ఓట్లు గుమ్మరిస్తారనే భ్రమలు కర్ణాటక అంతకు ముందు హిమాచల్ ప్రదేశ్ తొలగించాయి. ఫిబ్రవరిలో ఎన్నికల తేదీలు ప్రకటించడానికి ముందునుంచే మోడీ అక్కడ కాలికి బలపం కట్టుకు తిరిగారు. 19 సభలు ఆరు రోడ్ షోలు నిర్వహించారు. ప్రతిజ్ఞలు చేయించారు. ఇది గాక జెపి నడ్డా 16 రోడ్‌షోలు, స్మృతి ఇరానీ 19, రాజ్‌నాథ్ సింగ్ 4, హిమంత బిస్వాస్ శర్మ 16 రోడ్‌షోలు చేశారు. యోగి ఆదిత్యనాథ్ తదితరులు కూడా విస్తారంగా తిరిగారు. అయితే విజయం సంగతి అటుంచి ఆ పార్టీ 31 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. మరి అమిత్ షా అదే పనిగా చెప్పుకున్న సోషల్ మీడియా నెట్‌వర్క్, సోషల్ ఇంజనీరింగ్, పన్నా ప్రముఖ్‌ల ప్రచారం ఏమైంది? అంతకుముందు మీడియా తన వంతు ప్రచారం చేసింది. ఆఖరుకు ఫలితాల తర్వాత కూడా కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి ఎంపికపై సిద్దరామయ్య, శివకుమార్ తగాదా చీలిక వరకూ వెళుతుందన్న వాతావరణం కల్పించింది. ఇవన్నీ ఎన్ని చేసినా వీటన్నిటిని బట్టి బ్రాండ్ మోడీ బలహీనమైందని తేలింది. ఆయన 46 సభల్లో పాల్గొంటే అందులో 15 మాత్రమే గెలవగలిగారు.
పెరిగిన హడావుడి
కళ్ల ముందు కనిపించే ఈ వాస్తవాలను రాజకీయంగా ఒప్పుకోవడం బిజెపి కి మరీ ముఖ్యంగా మోడీ కి తెలియని పని. ప్రచార పటాటోపం కొనసాగించడమే వారి మార్గంగా వుంటుంది. అందుకే ఆయన నమ్మకస్తుల ముఠా లోపాయికారిగానే చర్చ చేసి చెప్పకుండా చేయాలనుకున్నది చేస్తుంది. తొమ్మిదేళ్ల పాలన వార్షికోత్సవాలను ఆర్భాటంగా చేయాలన్న ఆలోచనకు కొత్త ట్విస్టుతో ముందుకు తెచ్చింది. దేశవ్యాపితంగా 500 నియోజక వర్గాల్లో సభలు తలపెట్టింది. ఓటర్లను ప్రభావితం చేయగల అయిదు లక్షల ప్రముఖ కుటుంబాలను కలుసుకోవలసిందిగా రాష్ట్రాల విభాగాలకు ఆదేశాలు వెళ్లాయి. నటీనటులను, సెలబ్రటీలను కలుసుకోవడం ఇందులో భాగమే. దేశంలోని మొత్తం నియోజక వర్గాలను 144 క్లస్టర్లుగా విభజించి ప్రజలతో సంబంధాలు పెంచుకోవడానికి ఎనిమిది రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తారట. మోడీ హయాంలో హైవేలు ఇతర మౌలిక సదుపాయాలు గొప్పగా పెంచినట్టు చెప్పడానికి వికాస్ తీర్థ జరుపుతారు. గతంలో చారు పే చర్చ లాగే ఇప్పుడు టిఫిన్ పే చర్చ ప్రహసనం సాగిస్తారు, దేశంలో 51 జాతీయ స్థాయి ర్యాలీలు జరుపుతారు. ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాలలో మోడీ మరోసారి ప్రచారంపై కేంద్రీకరిస్తారు. గతంలో ముఖ్యమంత్రులను మార్చడంలో కాంగ్రెస్‌ను గుర్తుచేసిన మోడీ నాయకత్వం ఆ పని విరమించింది. మరోవైపున రాష్ట్రాలలో మరీ దూకుడుగా వున్న అధ్యక్షులను మార్చే కార్యక్రమం ప్రారంభమైంది. ఉదాహరణకు తెలంగాణలో ఉత్తరాది తరహా పద్ధతులతో ఉద్రిక్తతలకు కారణమైన బండి సంజరుని మార్చడం గురించిన చర్చ వాస్తవ రూపం దాల్చుతుందంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చినా ప్రయోజనం లేదని వాపోతున్న డి.కె అరుణ, ఈటల రాజేందర్ వంటి వారికి పదవులు ఇచ్చి సంతృప్తిపర్చే తతంగం తప్పదంటున్నారు. ఎ.పి లోనూ టిడిపి నుంచి వచ్చిన నేతల ఒత్తిడి మేరకే చంద్రబాబును కలుసుకున్నట్టు చెబుతున్నారు.
సర్వేల సారం
అదానీ వ్యవహారంతో మొదలు పెట్టి అంతర్జాతీయం గానూ మోడీ ప్రభ మసకబారింది. అంతర్జాతీయ మీడియాలో వ్యతిరేక కథనాలను ఖండించడం ఒక పెద్ద కార్యక్రమంగా మారింది. ఇతర రాష్ట్రాలలో సర్వేలలో కూడా మోడీకి మద్దతు నలభై శాతం మించి వుండటం లేదు. అదే సమయంలో వ్యతిరేకులు, అసంతృప్తితో వున్నవారి శాతం అంతకంటే ఎక్కువగా వుంటున్నది. మహారాష్ట్ర లోనూ అదే అంచనా వచ్చింది. మరోవైపున మైనార్టీలలో అభద్రత, సామాజిక శక్తుల చలనం, ప్రతిపక్షాల ఐక్యత పెరుగుతున్నది. బిజెపి మతతత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఓట్లు చీలకుండా చూడాలనే భావన బలపడుతున్నది. బీహార్ రాజధాని పాట్నాలో జరిగే శిఖరాగ్ర సమావేశం దీనిపై స్పష్టమైన సంకేతాలివ్వవచ్చు. 450 స్థానాల్లో బిజెపికి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థి నిలిచేలా చూడాలన్న నినాదం ఇందులో భాగమే, సాధ్యాసాధ్యాలు ఎలా వున్నా ఇది దేశంలో రాజకీయ వాతావరణాన్ని సూచిస్తున్నది. బిజెపికి అనుకూలం గా వుండే ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా పార్లమెంటు ప్రారంభంలో స్వయంగా పాల్గొనకపోవడం యాదృచ్ఛికం కాదు. అదే సమయంలో వైసిపి, టిడిపి, జనసేన మూడు ప్రాంతీయ పార్టీలు తనకు అనుకూలంగానే వున్నాయి గనక ఏం చేయాలనే వ్యూహమధనం సాగిస్తున్నట్టు కనిపిస్తుంది. అందరినీ అందుబాటులో వుంచుకోవాలనేదే అంతిమంగా తమ రాజకీయ అవసరమనేది బిజెపి దాచుకోవడం లేదు. ఎటొచ్చి ఈ పార్టీలే తమ వైరుధ్యాలను తీర్చుకోవడానికి దానికి సాగిలబడుతుండటం రాష్ట్రానికి హాని కలిగిస్తున్నది. ఇప్పట్లో ఇది ఎలా ముగిసేది ఇంకా స్పష్టం గాకున్నా వారి వైఖరిలో మాత్రం మార్పు వచ్చే సూచనలు లేవు. తెలంగాణలోనూ రాజకీయ దృశ్యం ఎలాంటి మార్పులకు లోనవుతుందనేది జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. అయితే తెలుగు రాష్ట్రాలతో సహా దక్షిణాదిన బిజెపి బలం పరిమితమే గనక ఎన్ని ఎత్తుగడలు వేసినా అధికారంలోకి రావడం గాని దేశవ్యాపితంగా బలాబలాల మార్పులో గాని పెద్ద ప్రభావం వుండదు. హిందీ రాష్ట్రాలు మరీ ముఖ్యంగా యు.పి, గుజరాత్ వంటి చోట్ల బిజెపిని నిలవరించడం కీలక కర్తవ్యమవుతుంది. బిజెపి ఆరెస్సెస్ కూటమి తమ బలహీనతను గుర్తించిందని వారి కదలికలు చెబుతున్నాయి. మరి కాంగ్రెస్, ఇతర లౌకిక ప్రాంతీయ పార్టీలు కూడా పైన చెప్పుకున్నట్టు అవగాహన పెంచుకుని అడ్డుకునే దిశలో సాగుతాయా అన్నదే భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అదే సమయంలో అడుగు జారుతున్న సంఘ పరివార్ ముందుకు తెచ్చే విభజన రాజకీయాలను, విద్వేష ప్రయత్నాలను కూడా విఫలం చేయవలసి వుంటుంది.
తెలకపల్లి రవి