
ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టటంతో పాటు చైనాలో పెరిగిన కంపెనీలతోనే చేతులు కలిపి కూడా లాభాలు పొందవచ్చని రిలయన్స్ ముందుకు వచ్చింది. అమెజాన్‌తో పోటీని తట్టుకోవాలంటే దాన్ని ఢకొీట్టే మరో కంపెనీ అవసరం అని గుర్తించటమే దీనికి కారణం. అందుకే అంబానీ ఒత్తిడికి లొంగి నిషేధించిన చైనా కంపెనీని తిరిగి నరేంద్రమోడీ అనుమతించారన్నది స్పష్టం.
షీ ఇన్ అనే ఒక చైనా కంపెనీతో మన దేశ బడా సంస్థ రిలయన్స్ కుదుర్చుకున్న ఒప్పందానికి కేంద్రం ఆమోద ముద్ర వేసినట్లు వార్త. దీని గురించి మీడియా చాలా పరిమితంగా మాత్రమే వార్తలు ఇచ్చింది. పెద్ద హడావుడి లేదు. అమెజాన్ మన మార్కెట్‌ను పూర్తిగా ఆక్రమించకుండా తనకు మద్దతు ఇస్తున్న అంబానీ కంపెనీ కోసం నరేంద్రమోడీ సర్కార్ శాయశక్తులా చూస్తోంది. గతంలో అమెజాన్ అధిపతి బెజోఫ్ ఢిల్లీ వచ్చినప్పుడు కలిసేందుకు అంగీకరించకుండా పడిగాపులు పడేట్లు చేసి నరేంద్ర మోడీ నాడు అంబానీకి సంతోషం కలిగించారు. ఇంతకీ షీ ఇన్ కంపెనీ, దాని యాప్ మీద ఇప్పుడు అంబానీలకు ఎందుకు కన్ను పడిందంటే మూడేళ్ల క్రితం దాన్ని నిషేధించినా అమెజాన్ కంపెనీ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తూ లాభపడుతున్నది. ఆ లబ్ధిని తామే నేరుగా ఎందుకు పొందకూడదన్నది ముకేష్ అంబానీ కుటుంబ ఆలోచన. డబ్బు ఎవరికి చేదు. వారు తలచుకుంటే దేశభక్తి స్వభావం, రూపమే మారిపోతుంది. జనానికి జ్ఞాపకశక్తి తక్కువ, అసలు ఉండదు అన్నది కొందరి ప్రగాఢ విశ్వాసం. నరేంద్రమోడీ లేదా మోడీని తీర్చిదిద్దిన సంఫ్‌ు పరివార్ కూడా అంబానీల ముందు మోకరిల్లాల్సిందే. వారి దేశ భక్తి అలాంటిది. స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీకి తోడుగా నిలిచిన బిర్లా కుటుంబం గురించి తెలిసిందే. స్వామి కార్యంతో పాటు స్వకార్యాన్ని కూడా నెరవేర్చు కోవచ్చన్నది బిర్లా కుటుంబ ఆలోచన. స్వాతంత్య్రం వచ్చిన తరువాత అదే జరిగింది. ఇప్పుడూ జరుగుతున్నది అదే, కాకుంటే లబ్ధిదారు అంబానీ. నరేంద్ర మోడీతో 2014లో అసలైన స్వాతంత్య్రం వచ్చిందని చెప్పేవారి గురించి తెలిసిందే.
తాజాగా అంబానీకి అందిస్తున్న లబ్ధి గురించి చూద్దాం. చైనాకు చెందిన షీ ఇన్ కంపెనీ ప్రపంచంలో అతి పెద్ద ఆన్‌లైన్ ఫ్యాషన్ దుస్తుల విక్రయాల కంపెనీ. 2022 ఏప్రిల్ నాటికి 150 దేశాల్లో దాని లావాదేవీల విలువ 100 బిలియన్ డాలర్లు. ఫ్యాషన్ దుస్తులను తక్కువ ధరలతో అందుబాటులోకి తెచ్చి కుర్రకారుకు దగ్గరైన సదరు సంస్థ అనేక దేశాల నుంచి మార్కెట్లో దుస్తులను కొనుగోలు చేసి విక్రయించటంలో పేరుగాంచింది. దాని వెబ్‌సైట్, యాప్‌తోనే లావాదేవీలు జరుపుతుంది. గత ఏడాది నాటికి మూడు వేల సరఫరాదారుల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. షీ ఇన్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇప్పుడు సింగపూర్‌లో ఉంది కనుక గతంలో మన ప్రభుత్వం దానిపై విధించిన నిషేధం ఇప్పుడు వర్తించదు గనుక రిలయన్స్ దానితో ఒప్పందం చేసుకోవచ్చని, మన ప్రభుత్వం తిరిగి అనుమతించనున్నదని పత్రికలు రాశాయి. ఒక పత్రికలో ''షీ ఇన్ తిరిగి భారత్‌కు వస్తున్నది, గతంలో దాన్ని ఎందుకు నిషేధించారు'' అంటూ రాసిన వార్తలో అదే రాశారు. ఈ కంపెనీ ఇంకేమాత్రం చైనాకు చెందినదిగా భారత్ భావించకపోవచ్చని పేర్కొన్నారు. అసలు సంగతి ఏమంటే మరింతగా విస్తరించేందుకు, పన్నుల భారాన్ని తగ్గించుకొనేందుకు గాను తన ప్రధాన కార్యాలయాన్ని 2019 లోనే చైనా నుంచి సింగపూర్‌కు మార్చుకుంది. 2020లో నిషేధం విధించేటపుడు అది చైనా కంపెనీ అని చూశారు తప్ప దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని కాదు. ఇప్పటికీ అది చైనా కంపెనీనే కదా! రిలయన్స్ దానితో ఒప్పందం చేసుకోనుంది గనుక దాని ఒత్తిడి మేరకు సింగపూర్ పేరును ముందుకు తెచ్చారు.
గాల్వన్ ఉదంతం తరువాత 2020 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం షీ ఇన్‌తో పాటు చైనాకు చెందిన 58 యాప్‌లను నిషేధించింది. వీటి ద్వారా దేశ సార్వభౌమత్వం, సమగ్రత, రక్షణ, భద్రతలకు ముప్పు తలెత్తినట్లు కారణంగా చెప్పారు. ఐటి చట్టంలోని సెక్షన్ 69ఏ ప్రకారం చేసినట్లు వెల్లడించారు. ఆ తరువాత నిషేధిత జాబితాను 270కి పెంచారు. ఇప్పటికీ అదే అమల్లో ఉంది. షీ ఇన్ కంపెనీ దెబ్బకు అనేక దేశాల్లోని సంస్థలకు దిమ్మతిరిగింది. దాంతో దాన్ని అడ్డుకొనేందుకు అనేక సాకులను ముందుకు తెచ్చి అడ్డుకొ నేందుకు చూశారు. వివిధ దేశాల సమాచారాన్ని అపహరిస్తున్నదని, మూడో పక్షానికి దాన్ని విక్రయిస్తున్నదన్నది వాటిలో ఒకటి. సమగ్ర సమాచారం ఇవ్వలేదనే పేరుతో అమెరికాలో 19 లక్షల డాలర్ల జరిమానా విధించారు. మేథోసంపత్తి హక్కులను ఉల్లంఘించిందని, వేరే బ్రాండ్లను పోలిన బ్రాండ్లను ముందుకు తెచ్చిందని, ట్రేడ్‌మార్క్ హక్కులను ఉల్లంఘించిందని, ఇతరుల డిజైన్లను కాపీ కొట్టిందని, బలవంతంగా కార్మికులతో పని చేయించి కార్మికుల హక్కులను ఉల్లంఘించిందని, చైనా లోని ఉఘీర్ ముస్లింలతో బలవంతగా పనులు చేయించిందని, ఇలా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చైనా మీద చేస్తున్న ఆరోపణలన్నింటినీ ఈ కంపెనీకి కూడా ఆపాదించి అడ్డుకోవాలని చూశారు.
ఇక రిలయన్స్‌తో ఒప్పందానికి వస్తే పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం రిలయన్స్ రిటెయిల్స్ సేకరణ సామర్థ్యాలు, గోదాములు, రవాణా సదుపాయాలు, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ దుకాణాలు షీ ఇన్‌కు అందుబాటులోకి వస్తాయి. ఇతర వివరాలేమీ చెప్పం గానీ రిలయన్స్‌తో మా భాగస్వామ్యం పక్కా అని షీ ఇన్ ప్రతినిధి చెప్పినట్లు, రిలయన్స్ స్పందించలేదని, ఈ లావాదేవీ గురించి తొలుత వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించిందని ఫైనాన్షియల్ టైమ్స్ తాజాగా తన విశ్లేషణలో పేర్కొన్నది. గత ఏడాది మన దేశంలో జరిగిన ఆన్‌లైన్ ఫ్యాషన్ దుస్తుల లావాదేవీల విలువ పది బిలియన్ డాలర్లు ఉండవచ్చని అంచనా. చైనాతో తలెత్తిన విబేధాల కారణంగా అమెరికా, ఐరోపాలో షీఇన్ మార్కెట్ తగ్గుతున్నందున ఇతర చోట్లకు విస్తరించాలని అది చూస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో మింత్రా ప్రధాన విక్రేతగా ఉంది. షీ ఇన్‌కు అనుమతిస్తే దాని మార్కెట్‌ను సవాలు చేస్తుందని చెబుతున్నారు.
ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొన్న దాని ప్రకారం లైసెన్సు ఒప్పందాన్ని ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. భారత్‌లో వచ్చే లాభాల్లో కొంతశాతం షీ ఇన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. చైనాలో ఉన్న తన 8 వేల మంది సరఫరాదారుల నుంచి సేకరించే దుస్తులతో పాటు భారత్‌లో రిలయన్స్ సేకరించే వాటిని కూడా ప్రపంచమంతటా విక్రయిస్తుంది. ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య వంటి వారు సి ప్లస్ 1 అంటే చైనా ప్లస్ ఒకటి అనే అవగాహన ప్రకారం మన దేశంలోని ఐదు పెద్ద రిలయన్స్, టాటా, బిర్లా, అదానీ, భారతీ గ్రూపు కంపెనీలు లబ్ధి పొందవచ్చని చెబుతున్నారు. చైనాలో పెట్టుబడులతో పాటు మరొక దేశంలో పెట్టుబడులు పెట్టటమే దీని అర్ధం. మన దేశంలోని బడా కంపెనీలు చిన్న చిన్నవాటిని మింగివేస్తున్నాయి. ప్రభుత్వం వాటికి రక్షణలు కల్పిస్తున్నది. ఉదాహరణకు అమెజాన్ నుంచి రిలయన్స్‌కు రక్షణగా నిలుస్తున్న మాదిరి అని చెప్పవచ్చు. చైనాలో 2010 తరువాత వేతనాలు, అక్కడి కార్పొరేట్ కంపెనీలపై పన్నులు గణనీయంగా పెరిగాయి. ఈ పూర్వ రంగంలో 2013లోనే అంటే నరేంద్ర మోడీ అధికారానికి రాకముందే సి ప్లస్ 1 అనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. అది ఇటీవలి కాలంలో పెరిగింది. ఇది మరింత విస్తరిస్తే పెట్టుబడులు భారత్‌కు రావచ్చని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ ఇతర దేశాలకు తరలుతున్నాయి. ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టటంతో పాటు చైనాలో పెరిగిన కంపెనీలతోనే చేతులు కలిపి కూడా లాభాలు పొందవచ్చని రిలయన్స్ ముందుకు వచ్చింది. అమెజాన్‌తో పోటీని తట్టుకోవాలంటే దాన్ని ఢకొీట్టే మరో కంపెనీ అవసరం అని గుర్తించటమే దీనికి కారణం. అందుకే అంబానీ ఒత్తిడికి లొంగి నిషేధించిన చైనా కంపెనీని తిరిగి నరేంద్రమోడీ అనుమతించారన్నది స్పష్టం. ఒకటి మాత్రం నిజం, అంగీకరించక తప్పదు. ఒకసారి చెప్పిందాన్ని మరోసారి ప్రస్తావించకపోవటం, ఎప్పటికప్పుడు కొత్త అంశాలతో జనాన్ని ఎలా రెచ్చగొట్టాలో, మనోభావాలను ముందుకు తెచ్చి వారితో ఎలా ఆడుకోవాలో, ఓట్లు ఎలా దండుకోవాలో, అంబానీ, అదానీల వంటి కార్పొరేట్లను ఎలా వాడుకోవాలో నరేంద్ర మోడీకి తెలిసినంతగా మరొకరికి తెలియదు.
- సత్య