
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సంఫ్‌ు పరివార్, గోడీ మీడియా సంకీర్తలనతో శుక్రవారం ముగిసింది. అమెరికా అధ్యక్షులు జోరు బైడెన్ దంపతుల ఆహ్వానం మేరకు శ్వేతసౌధం చేరుకున్న మోడీకి ఘనమైన ఆతిథ్యమే లభించింది. బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. బైడెన్‌కు ఆయన 80 ఏళ్ల జన్మదినోత్సవాన్ని ప్రతిబింబించేలా సహస్ర చంద్ర దర్శన కానుకను, ఆయన భార్య జిల్ బైడెన్‌కు పర్యావరణ కార్యకర్త అని పేరుండటంతో 'పచ్చ' రంగు వజ్రాన్ని మోడీ సమర్పించారు. ఫోటోలు దిగడంలో మక్కువ ఉన్న నేతగా పేరున్న మోడీకి బైడెన్ పురాతన కెమెరాను బహూకరించారు. అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి మోడీ చేసిన ప్రసంగం అసాంతం కట్టుకథలేనన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. ద్వైపాక్షిక చర్చలు, ఒప్పందాలు జరిగినమాట వాస్తవం. కానీ భారత ప్రజలకు ఒరిగిందేమిటి? రక్షణ రంగంలో స్వీయ సమృద్ధి సాధిస్తున్నామంటూ ఇక్కడ గొప్పలు చెబుతూ అమెరికా రక్షణ కంపెనీలతో కొనుగోళ్ల ఒప్పందాలు చేసుకోవడం దేనికి సంకేతం? నింగి, నేలా సర్వం ప్రయివేటీకరించి కార్పొరేట్ మిత్రులకు దోచిపెడుతున్న మోడీ సర్కార్ అమెరికాతో చేసుకున్న ప్రతి ఒప్పందంలోనూ క్రోనీల మేళ్లు చూసుకుందే తప్ప దానివల్ల దేశానికి పొంచివున్న ముప్పు గురించి పట్టించుకోకపోవడం దారుణం.. టెలికాం, సాంకేతిక, పర్యావరణ, ఆరోగ్య రంగాల్లో చేసుకున్న ఒప్పందాల్లోనూ దేశ ప్రయోజనాల కన్నా కార్పొరేట్ల ప్రయోజనాలకే మోడీ అధిక ప్రాధాన్యమిచ్చారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ను చావుదెబ్బ తీసి జియో గుత్తాధిపత్యానికి బాటలు వేసిన మోడీ సర్కార్ , ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే అమెరికన్ టెలికాం సాంకేతికత వల్ల ప్రయోజనమెవరికో వేరే చెప్పనవసరం లేదు. ఇరుదేశాధినేతల దృష్టిలో బంధం బలోపేతం కావడమంటే అటు అమెరికా కంపెనీలకు, ఇటు భారత క్రోనీలకు లబ్ధి చేకూర్చడమే. గుజరాత్ మారణకాండ నేపథ్యంలో మోడీని తమ గడ్డపై అడుగుకూడా పెట్టనివ్వబోమని ఒకప్పుడు భీష్మించిన శ్వేతసౌధం ఇప్పుడు ఎర్ర తివాచీ పరచి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయడం వెనుక మర్మం ఏమిటి? ఇదంతా మోడీ ఘనతేనని ఆయన భజనపరులు ఆకాశానికెత్తేయడంలో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. మైనార్టీల ప్రాణాలను చిదిమేసి, మానవ హక్కులను కాలరాసిన మతతత్వ నేతకు ఆతిథ్యం ఇవ్వడం సిగ్గుచేటు అంటూ బైడెన్ పార్టీకే చెందిన పలువురు సెనెటర్లు బహిరంగంగానే చీకొట్టారు. ఇదే అంశంపై 70 మంది ప్రజాప్రతినిధులు బైడెన్‌కు లేఖాస్త్రాన్ని సంధించారు. వాస్తవానికి చైనాకు పక్కలో బల్లెంలా సైనిక కూటమిని కూర్పు చేయాలని తహతహలాడుతున్న అమెరికాకు మోడీ పెద్ద వనరుగా కనిపిస్తున్నారు. అందుకే ఇంతటి ఘన సత్కారాలు.
2014లో అధికారంలోకి వచ్చిననాటి నుంచీ భారత్‌లో ఒక్కరోజైనా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడేందుకు చేవ చూపలేని మోడీ...శ్వేతసౌధం ఒత్తిళ్లతో మీడియా ముందుకు రాక తప్పలేదు. ది వాల్‌స్ట్రీట్ జర్నల్ వార్తా సంస్థ ప్రతినిధి అడిగిన ప్రశ్నతో మోడీ బిత్తర చూపులు చూస్తున్నట్టు ఉన్న వీడియో ఒకటి ఆయన భారత్ చేరుకోకముందే విశ్వవ్యాప్తంగా చక్కర్లు కొట్టేస్తోంది. భారత్‌లో పెరిగిపోతున్న మానవ హక్కుల ఉల్లంఘన, మతపరమైన వివక్ష నివారణకు తీసుకున్న చర్యలేమిటి అని సదరు జర్నలిస్టు నిలదీశారు. ఇక భారత్ నుంచి పిటిఐ వార్తాసంస్థ ప్రతినిధి మోడీ మనస్సు కష్టపెట్టకుండా వాతావరణ మార్పులకు సంబంధించిన సాధారణ ప్రశ్నతో సరిపెట్టారు. భారత్, అమెరికా ప్రజాస్వామ్య దేశాలని, ఇరుదేశాల డిఎన్‌ఎలోనే ప్రజాస్వామ్యం ఇమిడివున్నందన ఏ రూపంలోనూ వివక్షకు తావులేదని మోడీ ఉద్ఘోషించారు. దేశదేశాల్లో యుద్ధోన్మాదాన్ని రాజేస్తూ మానవ హక్కులను కాలరాస్తున్న అమెరికా పంచన మోడీ పలికిన పలుకులు పచ్చి అబద్ధాల మూటగా రాజకీయ విశ్లేషకులు పెదవిరిచారు. పాత్రికేయులు, మానవ హక్కుల కార్యకర్తలు, మైనార్టీలు, ఆదివాసీలను లక్ష్యంగా చేసుకొని యథేచ్ఛగా జరుగుతున్న దాడులు, మైనార్టీలపై గోగూండాల అరాచకాలు నిత్యకృత్యంగా దేశంలో కొనసాగుతుంటే వివక్షకే తావులేదన్నట్టు, ప్రభుత్వం చేయాల్సిందీ ఏమీ లేదని మోడీ బుకాయించడం సిగ్గుచేటు.
బిజెపి పాలిత మణిపూర్‌లో హింసాగ్ని మంటలు ఎగిసిపడుతుంటే, దాని గురించి కొంచెం కూడా పట్టించుకోకుండా అమెరికాకు పయనమైన మోడీ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఆ రెండే కాదు..చాలానే మిగిలిపోయాయి. నిత్యం ఎగబాకుతున్న నిత్యావసరాల ధరలు, కోరలు చాస్తున్న నిరుద్యోగం, రైతుల కడగండ్లు, ఆడబిడ్డలపై అకృత్యాలు ఇవేవీ మోడీ సర్కార్‌కు మానవ హక్కుల ఉల్లంఘనగా అనిపించలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాల గొంతు నులుముతూ, రాష్ట్రాల హక్కుల హరిస్తూ ప్రజాస్వామ్యాన్ని నిత్యం పరిహాసమాడుతుంటే అమెరికా వెళ్లి అంతా బాగుంది అనడం మోడీ ఆత్మవంచనకు పరాకాష్ట. బిజెపి ప్రభుత్వమాడుతున్న ఈ నాటకాలకు తెరదించాల్సిందే. పాట్నా వేదికగా శుక్రవారం జరిగిన ప్రతిపక్షాల భేటీ ఈ దిశగా గొప్ప ముందడుగు.