Mar 16,2023 06:34

మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం ఇపిఎస్‌ పెన్షనర్లను (ఇపిఎఫ్‌ చందాదారులంతా ఇపిఎస్‌ పెన్షనర్లే) ముప్పుతిప్పలు పెడుతోంది. కోర్టు తీర్పుల ప్రయోజనాలను కూడా దక్కకుండా చేస్తోంది. అథమ స్థాయిలో ఉన్న కనీస పెన్షన్‌ వెయ్యి రూపాయలను పెంచటానికి తిరస్కరిస్తోంది. 2014 ఎన్నికల సమయంలో ఇపిఎస్‌ పెన్షనర్ల కనీస పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచుతామని మ్యానిఫెస్టోలో బిజెపి వాగ్దానం చేసింది. ఇంత వరకు ఆ వాగ్దానాన్ని అమలు చెయ్యలేదు. కనీస పెన్షన్‌ నెలకు రూ.9 వేలు, డి.ఎ అమలు కోర్కెలను పట్టించుకోవటంలేదు. ఇపిఎస్‌ పెన్షనర్లకు సామాజిక పెన్షన్ల కంటే తక్కువ పెన్షన్‌ అందడం దారుణం.
మరోపక్క ఇపిఎఫ్‌ చట్టం ప్రకారం పరిమితికి మించి వాస్తవ వేతనాలపై ఉద్యోగులు, యాజమాన్యాలు పి.ఎఫ్‌ చెల్లించిన లేదా చెల్లిస్తున్న వారు అధిక పెన్షన్‌కు అర్హులని చెప్పటంలో అత్యున్నత న్యాయస్థానం పిల్లిమొగ్గలు వేస్తోంది. అధిక పెన్షన్‌ పొందాలంటే సర్వీసులో ఉండగా తాము, తమ యాజమాన్యాలు ఇపిఎస్‌ పథకం ప్రకారం 11(3) ఆప్షన్‌ ఇవ్వాలని, అప్పుడు మాత్రమే మేనేజ్‌మెంట్‌ వాటాలో 8.33 శాతం పెన్షన్‌ ఫండ్‌కు మళ్ళించబడుతుందని తమకు తెలియదని, ఇప్పుడు ఆ అవకాశం ఇవ్వాలని 2014కు ముందు రిటైర్‌ అయిన వారు కోర్టు మెట్లు ఎక్కారు. అలా రిటైర్‌ అయిన వారు తమకు వచ్చిన మేనేజ్‌మెంట్‌ వాటాలో 8.33 శాతం తిరిగి కడితే వారికి అధిక పెన్షన్‌ చెల్లించాలని అంతిమంగా 2016లో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.
2016 సుప్రీం కోర్టు తీర్పును మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు నటించింది. పి.ఎఫ్‌ వెనక్కి కట్టిన వారికి అధిక పెన్షన్‌ మంజూరు చేసి కొంత కాలం ఇచ్చి ఆపివేసింది. అధిక పెన్షన్‌ ఇస్తే పెన్షన్‌ ఫండ్‌ కరిగిపోతుందని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. అదే సమయంలో 2014 ఆగస్టు 22న పి.ఎఫ్‌ పరిమితిని రూ.6500 నుండి రూ.15 వేలకు పెంచుతూ మోడీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ వివాదాస్పదమైంది. రూ. 15 వేలకు మించి అధిక పి.ఎఫ్‌ కట్టే వారికి మేనేజ్‌మెంట్‌ వాటాలో 8.33 శాతం పెన్షన్‌ ఫండ్‌కు బదిలీ కావాలంటే 11(4) ప్రకారం జాయింట్‌ ఆప్షన్‌ను 6 నెలల లోపు ఇవ్వాలంది. 15 వేలకు మించి వాస్తవ వేతనం మీద పెన్షన్‌ రావటానికి ఉద్యోగి అదనంగా 1.16 శాతం చెల్లించాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇంతకు ముందు ఇపిఎఫ్‌ చట్టం, ఇపిఎస్‌ ల ప్రకారం 1.16 శాతాన్ని తన బాధ్యతగా చెల్లించింది. దీంతో పాటుగా పెన్షనబుల్‌ శాలరీ లెక్కింపుకు ఆఖరు 12 నెలల సరాసరిని మోడీ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌లో ఆఖరు 60 నెలల సరాసరిగా మార్చింది. ఈ మార్పు వలన పెన్షన్‌ మరింతగా తగ్గింది.
2014 మోడీ ప్రభుత్వ నోటిఫికేషన్‌ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. దీనిపై కూడా మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. 2014 నోటిఫికేషన్‌ పైన, అధిక పెన్షన్‌ ఆప్షన్ల పైన సుప్రీం కోర్టు బెంచ్‌ ముందు 4 సంవత్సరాల పాటు వాదోపవాదాలు నడిచాయి. అంతిమంగా 2022 నవంబర్‌ 4న ఈ రెండింటిపై సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. వాదోపవాదాలు జరుగుతున్న సమయంలోనే సుప్రీం కోర్టు ప్రభుత్వ వాదనలు కొన్నింటి వైపు మొగ్గు చూపినట్లు కనబడింది. నవంబర్‌ తీర్పు కొంత మందికి తీపిని, మరి కొంతమందికి చేదును అందించింది. చేదును అందించిన మేరకు మోడీ ప్రభుత్వం సంతోషపడింది. అయితే ఆ తీపిని కూడా పెన్షనర్లకు అందకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది.
2014కు ముందు పదవీ విరమణ చేసి సర్వీసులో ఉండగా హయ్యర్‌ పెన్షన్‌ ఆప్షన్‌ 11(3) ఇవ్వని వారికి తన తీర్పు ఎటువంటి ప్రయోజనం కలిగించదని సుప్రీంకోర్టు చెప్పింది. వీరందరికి సుప్రీంకోర్టు తీర్పు నష్టం చేసింది. ఈ విషయంలో మోడీ ప్రభుత్వ వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించినట్లు అయ్యింది. 2016లో తాను ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా అత్యున్నత న్యాయస్థానం 2022 నవంబర్‌ 4న తీర్పు చెప్పింది.
మూడు రకాల ఇపిఎస్‌ పెన్షనర్లకు మాత్రమే అధిక పెన్షన్‌ వచ్చే అవకాశాలను సుప్రీం కోర్టు తీర్పు కల్పించింది. 1) 2014కు ముందు రిటైర్‌ అయిన వారు తాము సర్వీసులో ఉండగా (స్కీమ్‌లో సభ్యులుగా ఉండగా) అధిక పెన్షన్‌కు జాయింట్‌ ఆప్షన్‌ 11 (3) ఇచ్చి ఉండి, ఆ ఆప్షన్‌ను ఇపిఎఫ్‌ సంస్థ నిరాకరిస్తే అటువంటి వారికి మరలా 11(3) ఇచ్చే అవకాశం కల్పించింది. 2) 2014 సెప్టెంబర్‌ 1 నాటికి సర్వీసులో ఉండి ఆ తరువాత రిటైర్‌ అయిన వారు 3) ఇప్పటికీ సర్వీసులో కొనసాగుతున్న వారు. ఈ రెండు రకాల ఇపిఎఫ్‌ చందాదారులు, వారి యాజమాన్యాలు అధిక పెన్షన్‌ కోసం జాయింట్‌ ఆప్షన్‌లు 11 (3), 11 (4) రెండూ ఇచ్చే అవకాశం కల్పించింది.
అధిక పెన్షన్‌ అనేది పి.ఎఫ్‌ పరిమితికి మించిన వాస్తవ వేతనాలపై పిఎఫ్‌ చెల్లించిన వారికే వర్తిస్తుంది. పరిమితికి మించిన వాస్తవ వేతనాల మీద ఉద్యోగులు, యాజమాన్యాల పిఎఫ్‌ వాటాలు కట్టడమనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార రంగం, యూనియన్లు ఉన్న కొన్ని సంఘటిత ప్రైవేటు పరిశ్రమలు, షాపులు, సంస్థలలో మాత్రమే జరుగుతోంది. మిగతా ప్రైవేటు రంగంలో పరిమితులకు లోబడి చెల్లిస్తున్నారు.
మోడీ ప్రభుత్వం సెప్టెంబర్‌ 1వ తేదీ నాటికి సర్వీసులో ఉండి ఆ తరువాత రిటైర్‌ అయిన వారు, సర్వీసులో కొనసాగుతున్న వారికి కూడా అధిక పెన్షన్‌ ఇవ్వటానికి సుముఖంగా లేనట్లు కనపడుతోంది. వీరికి 11(3), 11(4) ఆప్షన్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు అధికారికంగా ఇపిఎఫ్‌ వెబ్‌సైట్‌లో కేవలం 11(3) ఆప్షన్‌ను మాత్రమే పెట్టింది. 11(4) ఇంత వరకు పెట్టలేదు. కేవలం 11 (3) ఆప్షన్‌ ఒక్కటే తీసుకుంటే రూ.6500 నుండి రూ.15 వేల వరకు ఉన్న వేతనాలపైన మాత్రమే అధిక పెన్షన్‌ వస్తుంది. రూ.15 వేలకు మించిన వేతనాలపై పెన్షన్‌ రాదు. 11(3) ఆప్షన్‌లో కూడా మోడీ ప్రభుత్వం మోసకారితనంగా వ్యవహరించింది. ఆన్‌లైన్‌లో ఆప్షన్‌ లెటర్‌ను పూర్తి చేసే సందర్భంలో అంతకు ముందు 11(3) ఆప్షన్‌ లెటర్‌ ఇచ్చారా అని అడుగుతోంది. ఇవ్వలేదు అన్న తరువాత ఆప్షన్‌ లెటర్‌ను పూర్తి చెయ్యటం ముందుకు కదలటం లేదు. సుప్రీం కోర్టు తీర్పును కాదనకుండా కొంత కాలం అటు ఇటూ నడిపించి మరలా సుప్రీంకోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నది.
2014 నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు సమర్ధించింది. పైగా చట్టాల జోలికి తాము పోలేమని చెప్పింది. దాంతో ఆ నోటిఫికేషన్‌లో ఉన్న పెన్షనర్ల వ్యతిరేక క్లాజులు అన్నీ యథాతథంగా కొనసాగుతాయి. కాని 1.16 శాతం ఉద్యోగి కట్టాలి అని చెప్పటం మాత్రమే చట్టవ్యతిరేకమన్నది. 1.16 శాతం ఎవరు కట్టాలో ఇతమిద్ధంగా తేల్చకుండా వదిలేసింది. ఈలోగా ఉద్యోగుల నుండి వసూలు కొనసాగుతున్నది. ఈ భాగం కూడా మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా, కేరళ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నది.
2022 నవంబర్‌ 4 సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన సమయంలో...ఇపిఎస్‌ పెన్షనర్లకు పెద్ద మొత్తంలో పెన్షన్‌లు పెరగబోతున్నట్లు ఒక ప్రధాన తెలుగు పత్రిక శీర్షికలు పెట్టింది. మరి కొంతకాలానికి అదే పత్రిక ఇపిఎఫ్‌ సంస్థ ఇపిఎస్‌ పెన్షనర్లకు షాక్‌ ఇచ్చినట్లుగా వార్తలు ప్రచురించింది. మరోపక్క సంఘపరివార సంస్థలు ఇపిఎస్‌ పెన్షనర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికీ కొంత మంది పెన్షనర్లు తమకు త్వరలోనే నెలకు రూ.5 వేలు లేదా రూ.7 వేలకు పెన్షన్‌ పెరుగుతుందని ఎదురుచూస్తున్నారు. సంఘపరివార సంస్థలు గుర్రానికి పచ్చగడ్డి చూపించి పరిగెత్తిస్తున్నాయి.
మోడీ ప్రభుత్వం సామాజిక భద్రతా కోడ్‌లో ఎంప్లాయి పెన్షన్‌ స్కీమ్‌ను, ఇఎస్‌ఐ స్కీమ్‌లను నోటిఫికేషన్‌ ద్వారా మార్చివేసే అధికారం తీసుకుంది. నోటిఫికేషన్‌ మార్చిన తరువాత పార్లమెంట్‌కు కూడా వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా కోడ్‌లో మార్పులు చేసింది. రూ.లక్షల కోట్లు ఉన్న ఇపిఎఫ్‌, ఇపిఎస్‌, ఇఎస్‌ఐ నిధులను ప్రైవేటు ఫండ్‌ మేనేజర్లకు, ప్రైవేటు మెడికల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ధారాదత్తం చెయ్యాలని చూస్తోంది.
ఇటువంటి సమయంలో ఇపిఎస్‌ పెన్షనర్లు మాత్రమే కాకుండా సమస్త పెన్షనర్లు ఐక్యమై పెన్షన్‌ సంస్కరణలను వ్యతిరేకిస్తూ పోరాటాలు నడపాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఇన్సూరెన్స్‌ ఉద్యోగులు సిపిఎస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్‌ ను రద్దు చేసి వాటి ఉద్యోగులకు పాత పెన్షన్‌ స్కీమ్‌ను అమలు చెయ్యటానికి చర్యలు తీసుకుంటున్నాయి. మోడీ ప్రభుత్వం సిపిఎస్‌ లో ఉన్న నిధులను బదిలీ చెయ్యటం కుదరదని ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన కొన్ని రోజుల్లోనే మోడీ ప్రభుత్వం తన ప్రకటన మార్చుకుంది. 2004కు ముందు కేంద్ర ప్రభుత్వ శాఖలలో రిక్రూట్‌ అయ్యి 2004లో నియామకం పొందిన వారిని సిపిఎస్‌ నుండి ఒపిఎస్‌కు మార్చటానికి కోర్టు తీర్పుల మేరకు సిద్ధమైంది. ఆ ఉద్యోగులకు సిపిఎస్‌ లో ఉన్న వారి వాటాలను వారి జిపిఎఫ్‌కు బదిలీ చెయ్యాలని నిర్ణయించింది.
పోరాడితే కొన్ని ప్రయోజనాలు సాధించవచ్చని అన్ని రకాల పెన్షనర్ల అనుభవాలు తెలియజేస్తున్నాయి. ఇపిఎస్‌ పెన్షనర్లు తమకు జరిగిన అన్యాయంపై పోరాడటానికి సిద్ధం కావాలి. కేవలం కోర్టు తీర్పుల మీదనే ఆధారపడకుండా అందరు పెన్షనర్లను కలుపుకొని ఐక్య పోరాటాలు చెయ్యాలి. కనీస పెన్షన్‌ పెంపు కోసం, డి.ఎ కోసం పోరాడాలి.

ajay

 

 

 

 

 

 

వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. అజయ కుమార్‌