ప్రజాశక్తి -సామర్లకోట రూరల్(కాకినాడ) : దేశంలోని రోజు రోజుకు పెరిగిపోతున్న నిత్యవసర ధరల నియంత్రణలో బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కరణం ప్రసాద్ రావు అన్నారు. మోడీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం సామర్లకోట మండల -తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కరణం ప్రసాదరావు మాట్లాడుతూ రోజురోజుకి పెరిగిపోతున్న నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పేద మధ్యతరగతి ప్రజలు నిత్యవసర ధరలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. విద్య వైద్యం పూర్తిస్థాయిలో అందలేక పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పెరిగిపోతున్న నిత్యవసర ధరలకు తోడు దేశంలో రోజురోజుకు నిరుద్యోగం తాండవం చేస్తుందని అన్నారు. ఏడాదికి కోటి ఉద్యోగాలని మోడీ అధికారం చేపట్టి నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన ఘనుడు మోడీ అని అన్నారు. సస్యశ్యామలంగా ఉన్న దేశాల్లో కుల మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారం చేపట్టడమే ధ్యేయంగా బిజెపి మతోన్మాదంతో అనేకమంది పేద ప్రజలు బలి పశువులు అవుతున్నారని అన్నారు. ప్రమాదకరమైన బిజెపి పార్టీతో వైసిపి ప్రభుత్వం అంట కాగుతూ పేద ప్రజలకు అన్యాయం చేస్తుందని అన్నారు. రానున్న ఎన్నికలలో బిజెపిని అంట కాగుతున్న రాజకీయ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కరణం గోవిందరాజు, పి వీరబాబు, డి శ్రీను, చల్లా మహేష్, బి శ్రీను, కత్తెరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.










