Oct 22,2022 07:10

ప్రజా పంపిణీ వ్యవస్థను సార్వజనీనం చేయాలని సిపిఎం పదే పదే డిమాండ్‌ చేస్తూ వస్తోంది. కోవిడ్‌ సంక్షోభ సమయంలో అకస్మాత్తుగా లక్షలాదిమంది కార్మికుల ఉపాధి పోయినపుడు ఇది చాలా కీలకంగా మారింది. ప్రభుత్వం దగ్గర మూలుగుతున్న ఆహార ధాన్యాలకు ద్వారాలు తెరిచి, ప్రజా పంపిణీ వ్యవస్థను సార్వజనీనం చేయడానికి బదులుగా...ఒక దేశం, ఒక కార్డు పథకం వంటి లోపభూయిష్టమైన, సంక్లిష్టమైన పరిష్కారాలను చేపడతామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఆహార ధరల అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఇటీవలి సంవత్సరాల్లో ఆహార అభద్రత, ఆకలి అనేవి తీవ్రంగా పెరిగిపోయాయి.

అంతర్జాతీయ ఆకలి సూచిక (జిహెచ్‌ఐ)-2022ను అక్టోబరు 13న విడుదల చేశారు. ఆకలి, పోషకాహార లోపానికి సంబంధించిన కీలకమైన ఈ సూచీ ప్రకారం, ప్రపంచ దేశాల్లో భారతదేశం ర్యాంక్‌ గతేడాది వున్న 101వ స్థానం నుండి ఈ ఏడాది 107వ స్థానానికి పడిపోయింది. తన పొరుగు దేశాల కన్నా భారత్‌ ర్యాంక్‌ చాలా దిగువకు పడిపోయింది. మనకన్నా గణనీయంగా తక్కువ స్థాయిలోనే ఆర్థికాభివృద్ధి వున్నప్పటికీ చాలా దేశాల్లో ఆకలి, పోషకాహార లోపం స్థాయిలు చాలా తక్కువగా వున్నాయి. జిహెచ్‌ఐ ర్యాంకుల దృష్ట్యా చూసినట్లైతే భారతదేశం కన్నా తక్కువ స్థాయిలో వున్నది, యుద్ధంతో అతలాకుతలం అవుతున్న ఆఫ్ఘనిస్తాన్‌ మాత్రమే. దక్షిణాసియాలో భారత్‌కన్నా దిగువన వున్న ఏకైక దేశమిది.
         ఆకలితో, ఆహార అభద్రతతో బాధపడుతున్నవారి సంఖ్య ప్రపంచంలోకెల్లా భారత్‌ లోనే ఎక్కువ. ఎఫ్‌ఎఓ అంచనాల ప్రకారం 2020లో, భారతదేశంలో 22 కోట్ల మందికి పైగా ప్రజలు తీవ్ర క్షుద్బాధను ఎదుర్కొంటున్నారు. 62 కోట్ల మంది ప్రజలు ఒక మోస్తరు నుండి తీవ్ర ఆహార అభద్రతకు గురయ్యారు. అంతర్జాతీయంగా చూసినట్లైతే, తీవ్ర క్షుద్బాధతో అల్లాడిపోయేవారు మూడో వంతు మంది భారత్‌ లోనే వున్నారు. ఆహార అభద్రతతో పోరాడుతున్నవారు నాలుగో వంతు మంది వున్నారు. మోడీ నేతృత్వం లోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న వినాశకర విధానాల కారణంగా గత కొద్ది సంవత్సరాలుగా భారతదేశంలో ఆకలి, ఆహార అభద్రత సమస్యలు బాగా పెరిగాయి. 2016లో పెద్ద నోట్ల రద్దు నుండి 2020లో కోవిడ్‌ లాక్‌డౌన్‌ వరకు ప్రజల జీవనోపాధులపై నిరంతరంగా దాడులు జరుపుతున్నందుకు మోడీ ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రజల దుస్థితిని తెలియచేసేలా ఏదైనా ఒక నివేదిక వచ్చినపుడల్లా వెంటనే ఆ నివేదిక తప్పుల తడకలతో కూడినదని, భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటివి రూపొందిస్తారంటూ వాదనలు రావడం ఈ ప్రభుత్వానికి ఒక హాల్‌మార్క్‌గా తయారైంది. జిహెచ్‌ఐ తాజా అంచనాపై కూడా భారత ప్రభుత్వం ఈ విధంగానే స్పందించింది. భారతదేశంలో ఆహార అభద్రత తీవ్ర స్థితికి చేరుకుంటోందని గుర్తించడానికి, దాన్ని ఎదుర్కొనడానికి, చర్యలు తీసుకోవడానికి బదులుగా మోడీ ప్రభుత్వం జిహెచ్‌ఐని ఆమోదించడానికే తిరస్కరిస్తోంది. ఆకలిని తప్పుగా గణించారని వ్యాఖ్యానించింది.
భారతదేశంలో ఆకలి, దారిద్య్రమనేవి అసలు లేనే లేవని ప్రపంచ దేశాలు నమ్మాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అధికారిక దారిద్య్ర రేఖను నిర్వచించే, దారిద్య్రాన్ని అంచనా వేసే పద్ధతిని విడనాడింది. ప్రజల భౌతిక పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం లేదు. లేదా విడుదల చేయడానికి అనుమతించడం లేదు.
        వాస్తవ దృశ్యాన్ని ప్రతిబింబించకుండా వుండేలా అధికారిక డేటా సేకరణ వ్యవస్థలను మోడీ ప్రభుత్వం తారుమారు చేసింది. కోవిడ్‌ వల్ల భారతదేశంలో 47 లక్షల మంది చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసినపుడు, అంచనా వేసిన పద్ధతులు లోపభూయిష్టంగా వున్నాయని భారత ప్రభుత్వం విమర్శించింది. బదులుగా అసంపూర్ణంగా వుండే, జనన, మరణాల నమోదుకు ఉపయోగించే అధికారిక పౌర నమోదు వ్యవస్థను ఉపయోగించాలని, ఇందులో అధిక మరణాల అంచనాలు చాలా తక్కువగా నమోదు చేయబడాలని ప్రభుత్వం పట్టుబట్టింది. కోవిడ్‌ మహమ్మారి వల్ల భారతదేశంలో అధిక మరణాలు లేవని చెప్పడానికి ఇటీవలే, శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ డేటాను ప్రభుత్వం విడుదల చేసింది.
         కోవిడ్‌ లాక్‌డౌన్‌, ఆర్థిక సంక్షోభం వున్నప్పటికీ దేశంలో నిరుద్యోగం పెరగలేదని చెప్పడానికి నిర్దిష్ట కాలపరిమితిలో చేసే అధికారిక కార్మిక సర్వేలను చూపించింది. దారిద్య్ర అంచనాలను చెప్పడానికి బదులుగా, కొత్తగా మల్టీ డైమెన్షల్‌ పావర్టీ ఇండెక్స్‌ను రూపొందించింది. దీనికి దారిద్య్రంతో ఎలాంటి సంబంధం లేదు. భారతదేశంలో దారిద్య్రం గణనీయమైన స్థాయిలో తగ్గిందని చెప్పడానికి వివిధ రకాలైన అబద్ధపు సమాచారాన్ని అందించింది. మరో మాటలో చెప్పాలంటే, దేశంలోని గణాంక వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వం తరపున ప్రచారం చేసే యంత్రంగా మారింది. మంచి రోజులు వచ్చాయి, అమృత కాలం వచ్చిందనే అధికారిక వైఖరికి మద్దతుగా వుండే వారి డేటాను మాత్రమే విడుదల చేయడానికి అనుమతిస్తున్నారు. భారతదేశంలో, దారిద్య్రాన్ని, ఆకలిని అంచనా వేసే అతి ముఖ్యమైన డేటా జాతీయ వినియోగం, ఖర్చులకు సంబంధించిన సర్వేల నుండి వస్తుంది. ఈ సర్వేలను జాతీయ శాంపిల్‌ సర్వే కార్యాలయం నిర్వహిస్తుంది. అనూహ్యమైన రీతిలో, 2017-18 సర్వే ఫలితాలను విడుదల చేయకుండా మోడీ ప్రభుత్వం నిలుపుచేసింది. అప్పటి నుండి వినిమయ వ్యయంపై ఎలాంటి సర్వే నిర్వహించబడలేదు. ఇటీవలి సంవత్సరాల్లో పెద్ద ఎత్తున నిరుద్యోగం తలెత్తినా, ఆర్థిక సంక్షోభం లక్షలాదిమందిని దారిద్య్రం, ఆహార అభద్రతల్లోకి నెట్టేసినా ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తరించడం కీలకమని మోడీ ప్రభుత్వం భావించలేదన్న విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి వుంది.
           జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) ప్రకారం, గత జనాభా లెక్కల ప్రకారం, కనీసం 75 శాతం గ్రామీణ జనాభా, 50 శాతం పట్టణ జనాభాకు సబ్సిడీపై ఆహార ధాన్యాలను అందించాలన్నది ప్రభుత్వానికి గల రాజ్యాంగపరమైన విధి. చివరిసారిగా జన గణన చేపట్టింది పదకొండేళ్ళ క్రితం అయినందున 2021లో మళ్లీ జనాభా లెక్కలు నిర్వహించాల్సి వుంది. కానీ ఇప్పటి వరకు చేపట్టలేదు. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కవరేజీ కూడా రాజ్యాంగపరంగా నిర్దేశించిన స్థాయి కన్నా దాదాపు 12 కోట్లు మందికి తగ్గింది. మరో మాటలో చెప్పాలంటే, దాదాపు 12 కోట్ల మంది ప్రజలను ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ పరిధికి వెలుపల అట్టిపెట్టారు. ఎందుకంటే, షెడ్యూల్‌ ప్రకారం చేయాల్సిన అధికారిక జనగణన నిర్వహించలేదు కనుక. పరిస్థితులను మరింత అధ్వాన్నం చేసేలా, 4.4 కోట్లకు పైగా రేషన్‌ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయలేదంటూ 2014 నుండి రద్దు చేశారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇది మరీ ఎక్కువగా జరిగింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కుల గణన (2011) ద్వారా సేకరించిన సమాచారం, నిర్దిష్ట ప్రామాణికాల ఆధారంగా ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ లబ్ధిదారులను ఎంపిక చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవడం ఇక్కడ ఉపయుక్తంగా వుంటుంది. అయితే, పేద కుటుంబాల రేషన్‌ కార్డులను పెద్ద సంఖ్యలో రద్దు చేయడం, వారి స్థానంలో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కింద కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయడమనేది పూర్తిగా రాజకీయ కారణాలతోనే, ఎలాంటి నిర్దిష్ట ప్రామాణికాలు లేదా సర్వే లేకుండానే జరిగింది. కోవిడ్‌ సంక్షోభ కాలంలో కూడా ప్రభుత్వం దగ్గర పది కోట్ల టన్నులకు పైగా ఆహార ధాన్యాల నిల్వలు వున్నపుడు సైతం ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ ప్రస్తుత లబ్ధిదారులకు మాత్రమే ఆహార ధాన్యాల పంపిణీని పెంచింది.
           ఆర్థిక సంక్షోభం కారణంగా జీవనోపాధులు కోల్పోయి దారిద్య్రంలోకి నెట్టివేయబడిన లక్షలాదిమంది ప్రజలకు సబ్సిడీ రేటుకు ఆహార ధాన్యాలను ఇచ్చేందుకు ఎలాంటి ప్రయత్నం జరగలేదు. ప్రజా పంపిణీ వ్యవస్థను సార్వజనీనం చేయాలని సిపిఎం పదే పదే డిమాండ్‌ చేస్తూ వస్తోంది. కోవిడ్‌ సంక్షోభం సమయంలో అకస్మాత్తుగా లక్షలాదిమంది శరణార్ధులైన కార్మికుల ఉపాధి పోయినపుడు ఇది చాలా కీలకంగా మారింది. ప్రభుత్వం దగ్గర మూలుగుతున్న ఆహార ధాన్యాలకు ద్వారాలు తెరిచి, ప్రజా పంపిణీ వ్యవస్థను సార్వజనీనం చేయడానికి బదులుగా...ఒక దేశం, ఒక కార్డు పథకం వంటి లోపభూయిష్టమైన, సంక్లిష్టమైన పరిష్కారాలను చేపడతామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఈ పథకం ఇంతవరకు వెలుగు చూడలేదు. ఆహార ధరల అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఇటీవలి సంవత్సరాల్లో ఆహార అభద్రత, ఆకలి అనేవి తీవ్రంగా పెరిగిపోయాయి. 2022లో ఎక్కువ మాసాలలో ఆహార ధరలు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 7 నుండి 9 శాతం పెరిగాయి. మోడీ సర్కార్‌...ప్రభుత్వ వ్యయానికి అవసరమైన నిధుల కోసం ఇంధనంపై భారీగా పన్నులు వేసింది. అధిక పన్నుల కారణంగా పెరిగిన అధిక ఇంధన ధరలు ఆహారంతో సహా ఇతర నిత్యావసరాల ధరలు పెరగడానికి కారణమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జిఎస్‌టిని ఉపయోగించుకుని సామాన్యులపై, చిన్న వ్యాపారులపై అధిక పన్నుల భారం మోపింది. ఈ జిఎస్‌టి వసూళ్లలో చట్టబద్ధమైన వాటాను రాష్ట్రాలకు ఇవ్వడానికి బదులుగా సింహ భాగాన్ని తన వద్దనే అట్టిపెట్టుకుంది. బడా కార్పొరేట్లకు పెద్ద మొత్తంలో పన్ను రాయితీలిస్తూ, వారి రుణాలను రద్దు చేస్తూ, సామాన్యులు కొనుగోలు చేసే వాటికి పన్నులు వేస్తోంది. దశాబ్దాల తరబడి అనుసరించిన ఆర్థిక సరళీకరణ విధానాల ఫలితంగా ఎరువులు, ఖాద్య తైలాలు, పప్పు ధాన్యాల దిగుమతులపై అధికంగా ఆధారపడాల్సి వచ్చింది. ఇటీవలి సంవత్సరాల్లో ఈ వస్తువుల ధరలు అధికంగా పెరగడానికి దిగుమతి చేసుకున్న అధిక ద్రవ్యోల్బణం కూడా ఒక కారణంగా వుంది.
         అబద్ధపు గణాంకాలతో ఈ దేశ కార్మికులను మోసగించలేరు. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న వినాశకరమైన ఆర్థిక విధానాల కారణంగా తామెదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను వారెన్నటికీ మరిచిపోలేరు. నిరుద్యోగం, దారిద్య్రం, ఆహార అభద్రత వంటివి ఈనాటి ప్రధాన సమస్యలుగా వున్నాయి. జీవనోపాధులకు సంబంధించిన ఈ సమస్యలపై పోరాడేందుకై ప్రజలను సమీకరించేందుకు సిపిఎం కట్టుబడి వుంది. ప్రజలెదుర్కొనే ఇబ్బందులకు ఈ ప్రభుత్వాన్ని జవాబుదారీ చేసేందుకై దేశంలోని వామపక్ష, ప్రజాతంత్ర శక్తులతో చేతులు కలుపుతుంది.

('పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం)