
దేశ చరిత్రలో బహుశా ప్రపంచ న్యాయ చరిత్రలో ఒక సుప్రీంకోర్టు తీర్పు...హక్కుల కోసం పోరాడేవారి అరెస్టుకు ఆధారం కావడం జరిగివుండదు. మన స్వాతంత్య్ర అమృతోత్సవం అందుకు సందర్భమైంది. అమానుషమైన గుజరాత్ నరమేధంలో ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది కుటుంబాలకు న్యాయం కోసం నిర్విరామ కృషి చేస్తున్న తీస్తా సెతల్వాద్‌ను అన్యాయంగా అరెస్టు చేయడానికి గుజరాత్ పోలీసులు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునే కారణంగా చూపించారు మరి! గుజరాత్ నరమేధం ఇటీవలే 20 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలోనే సుప్రీం కోర్టు నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ ఇవ్వడం లేదా గతంలో సిట్ ఇచ్చిందని నిర్ధారించడం యాదృచ్ఛికం కాదు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తీర్పును స్వాగతిస్తూ ఈ మారణహోమానికి అప్పటి ముఖ్యమంత్రి మోడీపై ఆరోపణలు, అంతులేని బాధ కలిగించినా గరళ కంఠుడిలా భరించారని పొగడ్తలు కురిపించారు. అప్పట్లో మోడీ గుజరాత్ హోంశాఖ చూస్తుంటే సహాయ మంత్రిగా పనిచేసిన అమిత్‌షా ఒక బూటకపు ఎన్కౌంటర్ కేసులో తను మూడు మాసాలు జైలు పాలైన సంగతి గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు మోడీ దేశ ప్రధానిగా వుంటే షా దేశానికే హోంమంత్రిగా వున్నారు. సుప్రీం తీర్పు పేరిట శరవేగంగా తీస్తా సెతల్వాద్‌ను అరెస్టు చేయడంలో ఈ పరిణామం ప్రతిబింబిస్తుంది.
సిట్ క్లీన్చిట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ మారణహోమం మరుగున పడకుండా కొనసాగించడంలో కొన్ని శక్తులు దురుద్దేశ్యంతో పని చేస్తున్నాయనీ, వారిని బోనెక్కించాల్సి వుందని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సాక్ష్యాలు చెప్పిన కొందరు పోలీసు అధికారులనూ తమ ప్రయోజనాలు నెరవేరలేదన్న అసంతృప్తితో మాట్లాడారని కొట్టివేసింది. గుజరాత్ టెర్రరిస్టు వ్యతిరేక పోలీసులు మరుసటి రోజున తీస్తాను నిర్బంధం లోకి తీసుకున్నారు. ముందస్తు నోటీసు లేకుండా ఇంట్లోకి ప్రవేశించి సోదాలు చేశారు. దీన్ని నిరసిస్తూ మాజీ న్యాయమూర్తులతో సహా 300 మంది సీనియర్ న్యాయకోవిదులు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి రమణకు లేఖ రాశారంటే ఇదెంత అసాధారణంగా వుందో తెలుస్తుంది. తాము చెప్పిన తీర్పు ఉద్దేశం తీస్తా సెతల్వాద్ తదితరుల అరెస్టు కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేయాలని వారు కోరారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, సిపిఎం వంటి పార్టీలు, కొందరు మీడియా వ్యాఖ్యాతలు కూడా ఆమె అరెస్టును ఖండించారు. మరో వంక సోషల్ మీడియాలో పరివార్ పదాతిదళం తీస్తా పైనే గాక ఆమె తాతముత్తాతల పైన కూడా విష ప్రచారం చేస్తున్నది. కేంద్ర రాష్ట్ర సంస్థలు వేటాడుతూనే వున్నాయి.
తీస్తా నేపథ్యం
తీస్తా ముత్తాత సి.హెచ్. సెతల్వాద్ పార్సీ కుటుంబానికి చెందిన గొప్ప న్యాయ కోవిదుడు. జలియన్‌వాలా బాగ్ మారణకాండకు కారణమైన ఒ.డయ్యర్‌పై విచారణ జరిపిన హంటర్ కమిషన్‌లో సభ్యుడు. పరివార్ పదాతిదళం దీన్ని ప్రతికూలాంశంగా చిత్రిస్తూ ఆయన బ్రిటిష్‌వారి కోసం పని చేసినట్టు చిత్రిస్తున్నది. వాస్తవానికి డయ్యర్‌ను తప్పించేందుకు ఉద్దేశించిన ఆ విచారణలో సి.హెచ్. సెతల్వాద్ భారతీయుల ఆగ్రహాన్ని, నిరసనను ప్రతిధ్వనించే ప్రశ్నలు వేసి డయ్యర్‌కు చమటలు పట్టించాడట. ఆమె తాత ఎం.సి సెతల్వాద్ ఈ దేశపు తొలి అటార్నీ జనరల్. తండ్రి అతుల్ సెతల్వాద్ ముంబాయిలో లాయర్లకు లాయర్‌గా పేరొందారు. ఎమర్జన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి. తీస్తా జర్నలిస్టుగా కొన్ని పత్రికలలో విలేకరిగా పని చేసినా భివాండి, ముంబాయి మత కలహాలను చూశాక మతతత్వానికి వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయించుకున్నారు. అలాంటి భావాలే గల జర్నలిస్టు జావేద్ ఆనంద్‌ను పెళ్లి చేసుకున్నారు. బడా పత్రికలలో కన్నా స్వతంత్ర వేదిక మంచిదన్న అభిప్రాయంతో 1993లో 'కమ్యూనలిజం కంబాట్' పత్రిక స్థాపించారు. అలేఖ్ పద్మశ్రీ, జావేద్ అఖ్తర్, విజయ టెండూల్కర్, రాహుల్ బోస్, క్యాథలిక్ ప్రీస్ట్ కెడ్రిక్ ప్రకాశ్‌లతో కలసి 2002 ఏప్రిల్‌లో సిటిజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ (సిపిజె) స్థాపించారు. గుజరాత్ మారణకాండను దేశానికి, ప్రపంచానికి చెప్పి చైతన్యపరచడంలో ఈ వ్యవస్థలన్నీ అగ్రభాగాన నిలిచాయి. సబ్ రంగ్ కమ్యూనికేషన్స్ పబ్లికేషన్స్ కూడా జావేద్ ఆనంద్ ఆధ్వర్యంలో అలాగే ఏర్పడింది.
తప్పుడు కేసులతో వేట
2002 ఫిబ్రవరిలో గోద్రా స్టేషన్లో హత్యలు, దానికి ప్రతీకారం పేరిట సాగిన ఊచకోత తర్వాత తీస్తా సెతల్వాద్ తీవ్ర పోరాటానికి దిగారు. నాటి హత్యాకాండలో సామూహిక విధ్వంసం, హత్యలు జరిగిన ప్రదేశాలు చరిత్రలో నల్లని గుర్తుగా మిగిలిపోయాయి. గుల్బర్గా సొసైటీ, బెస్ట్ బేకరీ, నరోదా పాటియా, సర్దార్ పూర్, ఓద్ వంటివి కొన్ని. అన్ని చోట్లా రాక్షసత్వం రాజ్యమేలింది. వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు అధికారపూర్వకంగా ప్రకటించారు గాని వాస్తవానికి అంతకంటే ఎక్కువ మందే మరణించారు. మహిళలపైనా దారుణాలు జరిగాయి. ముస్లింల వెలివేత నడిచింది. అప్పటి ప్రధాని వాజ్‌పేయి కళ్ల నీళ్లు పెట్టుకున్నారు, కవితలు రాశారు, రాజధర్మం పాటించాలని నీతులు చెప్పారు. కాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆశీస్సులున్న పరివార్ మూకలు, పరోక్షంగా వారికి వత్తాసునిచ్చే పోలీసులు అధికార యంత్రాంగం కారణంగా ఈ ఘాతుకాలను దర్యాప్తు చేయడం, నిందితులను పట్టుకోవడం అన్న ప్రసక్తి లేకుండా పోయింది. సహాయక శిబిరాలలో వున్న బాధితుల పైనే బెదిరింపులు, వేధింపులు నడిచాయి. ఆ ఉద్రిక్త పరిస్థితి లోనే మోడీ ముందస్తు ఎన్నికలకు తొండరపడ్డారు. ఎన్నికల సంఘంపై దాడి చేశారు. ఎట్టకేలకు ఎన్నికలు పెట్టించి భయోత్పాతంలో మరోసారి అధికారం లోకి రాగలిగారు. గుజరాత్లో ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ నేతలు కూడా హిందూత్వ ఊపులో తామెక్కడ వెనకబడతామోనని వీటన్నిటిని గట్టిగా ఖండించడానికి వెనుకాడారు. ఆ సమయంలో వామపక్షాలు లౌకిక వాదులతో పాటు తమ సంస్థల ద్వారా నిరంతర కృషి చేసిన, చేస్తున్న వ్యక్తి తీస్తా. అప్పుడే వి.ఆర్.కృష్ణయ్యర్‌తో సహా ముగ్గురు మాజీ న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులతో కలసి కన్సర్న్డ్ సిటిజన్స్ ట్రిబ్యునల్ పేరిట విచారణ కమిటీ ఏర్పడింది. దాదాపు మూడు వేల ఫిర్యాదులు ఇతర ఘటనలు విచారించి సమగ్రమైన రెండు సంపుటాల నివేదిక విడుదల చేసింది (ఈ కమిటీ నివేదికను ప్రజాశక్తి బుకహేౌస్ హైదరాబాద్ బుక్ ట్రస్స్ ఉమ్మడిగా ప్రచురించాయి. ఇప్పుడు మరిన్ని సంస్థలు కలసి ప్రచురిస్తున్నాయి.).
ఆ భయంకర కాలంలో తీస్తా బాధితుల శిబిరాలను సందర్శించడం, మరీ హతాశులైన నిరాశ్రయులకు ఆశ్రయమివ్వడం, సాక్ష్యాలు చెప్పేందుకు ధైర్యం కల్పించడం చేశారు. సరిగ్గా ఆ కారణంతోనే మోడీ ప్రభుత్వం సంఘ పరివార్ ఆమెను శత్రువుగా భావించి అడుగడుగునా వేటాడాయి. బాధితులను ఒత్తిడి చేసి, భయపెట్టి సాక్ష్యాలు, వాంగ్మూలాలు తీసుకున్నారని బెస్ట్ బేకరీ కేసుకు సంబంధించిన కీలక సాక్షి జహీర్ షేక్ 2004 లోనే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారించిన సుప్రీంకోర్టు ఆమె నిర్దోషిగా ప్రకటిస్తూ మోసానికి గాను జహీర్‌కే ఏడాది శిక్ష వేసింది. ఇందుకోసం మోడీ సన్నిహితుడైన శ్రీవాత్సవ...జహీర్‌కు పద్దెనిమిది లక్షలు చెల్లించినట్టు తెహల్కా ఆపరేషన్‌లో తేలింది. మరో 22 మంది సాక్ష్యాలు కూడా బూటకమని సిట్ నిర్ధారించినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రత్యేక వ్యాసం రాయగా సిపిజె ఖండించింది. అది సిట్ నివేదిక కాదని, ప్రభుత్వ నివేదిక అని స్పష్టం చేసింది. ఢిల్లీ లోని పాలసీ రిసెర్చి సభ్యుడైన ప్రతాప్ భాను మెహతా కూడా టైమ్స్ వ్యాసం ఆధారంగా తీస్తాపై అలాటి అరోపణలే చేసి తర్వాత వెనక్కు తగ్గారు. బాధితుల కోసం విరాళాలు సేకరించిన తీస్తా వాటిని దారి మళ్లించినట్టు 2013లో నాటి ఘటనలపై మ్యూజియం కోసం వచ్చిన విరాళాలు దుర్వినియోగపర్చిన సిపిజెను నిషేధించాలని గుల్బర్గా సొసైటీ పేరిట ఒక ప్రకటన వెలువడింది. గుజరాత్ క్రైం పోలీసులు దానిపై దర్యాప్తు తతంగం మొదలెట్టారు. మరోవంక సబ్రంగ్ పత్రికా ప్రకటన విడుదల చేస్తూ రియల్ ఎస్టేట్ ధరలు మండిపోతున్న కారణంగా మ్యూజియం ఆలోచన విరమించామని, దాతలకు ఆ విషయం చెప్పి ప్రత్యామ్నాయ ప్రతిపాదన ఆలోచిస్తున్నామని తెల్పింది. పూర్తి ఆడిటింగ్ చేసిన తమ ఖాతాలో నిధులు 4,60,285 రూపాయలు మాత్రమేనని కూడా వెల్లడించింది. కాని తమ లెటర్ పాడ్ దొంగిలించి ఈ ఫిర్యాదు చేశారని, వాటితో సంబంధం లేదని కొద్దిరోజుల తర్వాత సొసైటీ అధికార ప్రతినిధులు పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు. అప్పటికే కేంద్రంలో మోడీ ప్రభుత్వం రావడం, మతతత్వ వ్యతిరేక శక్తులపై వేట ఉధృతమైనాయి. అందుకే వీటన్నిటి ద్వారా ఆమెపైన సబ్రంగ్పైనా దుష్ప్రచారాన్ని కొనసాగనిచ్చారు. వారి ఖాతాలు నిలిపివేశారు. వీటిని విడుదల చేయడానికి, వారికి ముందస్తు బెయిలు ఇవ్వడానికి గుజరాత్ హైకోర్టు నిరాకరించినా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తాత్కాలిక ఉపశమనం కల్పించింది. వ్యాపార సంస్థ అయిన సబ్రంగ్ ఫోర్డ్ సంస్థ నుంచి విరాళాలు పొందడం విదేశీ విరాళాల చట్టానికి విరుద్ధమని 2017లో మరో కేసు బనాయించారు. తమతో ఆ సంస్థ చేసుకున్న అవగాహన మేరకు తీసుకున్నాం తప్ప చట్ట ఉల్లంఘన జరగలేదని సబ్రంగ్ సమాధానమిచ్చింది. మత సామరస్యం కోసం కృషి అన్న ఆశయాలే దేశ వ్యవహారాలలో జోక్యానికి అవకాశమిస్తున్నాయని సర్కారు వింత వాదన చేసింది. సంబంధిత అధికారులు క్రమబద్దంగా ఆడిట్ చేస్తూనే వున్నారనీ చెప్పింది. అయినా ఏదో పేరుతో వారి కార్యాలయాలపై దాడి, 24 గంటల గాలింపులు చేయడం దేనికంటే వారు సేకరించిన సాక్ష్యాధారాలు వుంటే స్వాధీనం చేసుకోవడమే. ఈ వేధింపుల జాబితా ఇంకా చాలా పొడవైందే.
సిట్, కోర్టులు చెప్పలేదా?
ఐక్యరాజ్యసమితితో సహా గుజరాత్ ఘటనలను ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి తీస్తా. గుజరాత్లో కేసు విచారణ అయితే భయపెడతారంటూ ముంబాయికి మార్పించుకోగలిగారు. 68 కేసుల్లో 120 మందికి శిక్ష పడిందంటే తీస్తా వంటి వారి కృషి ఫలితమే. అయితే ఈ కేసులలో ముందస్తు బెయిలు సులభంగా ఇవ్వడమే గాక శిక్షలు పడినవారికి కూడా వెంటనే స్వేచ్ఛ లభిస్తుండడం విచారకరం. వారు సాక్షులను ఇప్పటికీ బెదిరిస్తూ సంచరిస్తున్నారు. కోర్టులకు వెళ్లడం నిరంతరం జరుగుతూనే వుంది. ఆ క్రమంలోనే జకియా జాఫ్రీ కేసును సుప్రీం కొట్టివేస్తూ పిటిషనర్ తీస్తాకు దురుద్దేశాలు అంటకట్టింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నేరస్తులను ఉపేక్షించిందని చెప్పడానికి ఆధారాలు లేవని సిట్ చెప్పిందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. సిట్ మోడీకి క్లీన్ చిట్ ఇచ్చిందనే వాదన పాక్షికమైంది. అలా అంటూనే సిట్ పోలీసు అధికారుల ప్రవర్తనను తీవ్రంగా తప్పు పట్టింది. మంత్రులు కంట్రోలు రూమ్‌లో వుండి నడిపించారని తెల్పింది. 2002 ఫిబ్రవరి 27న గోద్రా స్టేషన్ సందర్శించిన ముఖ్యమంత్రి దగ్గరలోనే వున్న గుల్బర్గా సొసైటీలో హత్యాకాండ బాధితులను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించింది. చర్యకు ప్రతిచర్య అంటూ ఈ హత్యాకాండను పరోక్షంగా సమర్థించడం. మైనార్టీ జనాభా పెరిగిపోతున్నదని ఎన్నికల సభలో చెప్పడం వంటి ఉదాహరణలు ప్రస్తావించింది. తప్పుడు కథనాలతో రెచ్చగొడుతున్న మీడియాను సరిదిద్ది సత్యాలు వెల్లడించే ప్రయత్నం జరగలేదని కూడా చెప్పింది. విహెచ్పి నాయకులొకరు అధికారుల సమావేశంలో పాల్గొన్నట్టు విచారణ అధికారి ఎ.కె మల్హోత్రా విమర్శించారు. గుజరాత్ తగలబడుతుంటే ప్రభుత్వాధినేతలు నీరోల్లా వ్యవహరించాని సుప్రీంకోర్టు ఒక దశలో వ్యాఖ్యానించింది. మానవ హక్కుల కమిషన్ మరింత తీవ్రంగా మోడీ ప్రభుత్వాన్ని అభిశంసించింది. సిట్ మోడీని విచారించిన తీరు సరిగా లేదని గుజరాత్ హైకోర్టు వ్యాఖ్యానించింది. నిజానికి ప్రభుత్వం తీరు బాగాలేదంటూనే మోడీపై విచారణ జరపకపోవడానికి సిట్ చూపిన కారణాలు సాంకేతికమైనవే. ఒక కేసులో కోర్టుకు సహకరించేందుకు నియమితులైన అమికస్ క్యూరీ రాజా రామచంద్రన్ మోడీని విచారించాలని వాదించారు. కనుక సుప్రీం కోర్టు తీస్తా సెతల్వాద్ వంటి వారిలో దురుద్దేశాలు చూడటం తలకిందులు తర్కం, అంటే సిట్ నివేదిక అంతిమం అంటే రాజ్యాంగం ఏమయ్యేట్టు? ఇక ఆ పేరుతో ఆమెను అరెస్టు చేయడం రాజ్యం దమననీతి. అదే నూపుర్‌శర్మను అరెస్టు చేయకపోవడమేమిటని సుప్రీం నేరుగా వ్యాఖ్యానించినా ఇంతవరకూ ఎలాంటి చర్య లేదే? నాజీలపై నాటి న్యూరేన్ బర్గ్ విచారణ అటుంచి ఫాసిస్టు చర్యల కారకులపై ఇప్పటికీ పాశ్చాత్య దేశాల్లో విచారణ జరుగుతూనే వుంటుంది. యాభై ఏళ్లనాటి ఎమర్జన్సీని ఇప్పటికీ విమర్శిస్తుంటాము. ఇంకా విచిత్రంగా వందల ఏళ్లనాడు ఆలయాలు కూల్చారనే ఆరోపణలతో ఈ పాలక పక్షీయులు కేసులు పెడితే తీర్పులు వస్తుంటాయి మరి! ఇరవయ్యేళ్ల గుజరాత్ నరమేధంలో నేరస్తులను మర్చిపోవాలన్న సంకేతం సుప్రీం నుంచి ఆశించేదేనా? చెప్పుకోవలసిన అంశాలు ఇంకా చాలా వున్నా ముందు జరగాల్సింది ఆమెను విడుదల చేయడం. దోషులను శిక్షించడం. అవసరమైన వివరణతో ఆమె అరెస్టు తాము చెప్పింది కాదని స్పష్టం చేయాలి. తీర్పును సమీక్షించుకుని సవరించుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో బాధితుల తరపున హక్కుల కోసం ముందుకు వచ్చేవారిపై ఇది బెదిరింపు అస్త్రంలా మారుతుంది.
తెలకపల్లి రవి