
ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత. కానీ 142 కోట్లకు పైగా జనాభా కలిగిన మన దేశంలో ప్రజారోగ్యానికి ఖర్చు పెడుతున్నది జిడిపిలో 1.35 శాతం మాత్రమే అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పేద దేశమైనటువంటి క్యూబా తన జాతీయ ఆదాయంలో 12 శాతం ప్రజారోగ్యం కోసం ఖర్చు పెడుతుంది. బ్రిటన్, అమెరికా, స్వీడన్, జపాన్, జర్మనీ తదితర దేశాలు తమ జిడిపిలో పది శాతానికి పైగా ఖర్చు పెడుతున్నాయి. మన దేశంలో అందరికీ ఆరోగ్యం అనేది అందని కలగానే మిగిలిపోతున్నది.
ఈ మధ్యకాలంలో వైద్యం చాలా అభివృద్ధి చెందింది. జీవిత కాలాన్ని పొడిగించగలిగింది. ఇదివరకు అసాధ్యమైన వాటిని సాధించి మానవ జీవన విధానాన్ని సౌఖ్యంగా గడపటానికి మార్గం సుగమం చేసింది. డబ్బున్నవారు అత్యంత ఆధునిక వైద్యం కొనుక్కోగల్గుతున్నారు.
అయితే రోగం వచ్చి హాస్పిటల్లో చేరితే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అనేది సామాన్య ప్రజల అనుభవం. వైద్య ఖర్చులు భరించలేక ప్రతి సంవత్సరం కోట్లాదిమంది పేదరికం లోకి జారిపోతున్నటువంటి అవస్థ అందరికీ తెలిసిందే. సంవత్సరానికి ఆరు కోట్ల మంది ప్రజలు వైద్య ఖర్చులు భరించలేక పేదరికంలోకి నెట్టబడుతున్నారని సర్వేలు చెప్తున్నాయి.
నూటికి 99 మందికి ఆధునిక వైద్యం అందుబాటులో లేదు. ప్రజలకు దగ్గరగా ఉండే డాక్టర్ కొత్తగా వస్తున్న పరికరాలు కొనకపోతే వెనకబడి పోతున్నాడు. రోగులు, అప్పో సొప్పో చేసైనా అనుభవం, టెస్టులు, పరికరాలు అన్నీ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళక తప్పడం లేదు. ఆరోగ్య చికిత్సల వ్యవహారం రూ.లక్షలలో ఉంది. నూటికి ఒక్కరుగా ఉన్నటువంటి అత్యంత ధనవంతులు అత్యంత ఆధునిక వైద్యాన్ని తేలికగా అందుకోగలుగుతున్నారు. 99 మందికి ఆధునిక వైద్యం అందుబాటులో లేదు.
1990 తర్వాత పూర్తిగా అమెరికా సంస్కృతి, అమెరికా విధానాలు, అమెరికా వైద్యం ప్రవేశించిన తర్వాత ధర్మాస్పత్రి తీరులు మారిపోయాయి. భార్యాభర్తలు డాక్టర్లుగా ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న వారి ప్రైవేట్ వైద్యం క్షీణిస్తోంది. కార్పొరేట్ వైద్యం లోకి విదేశీ పెట్టుబడులు కూడా ప్రవేశించాయి. కార్పొరేట్ ఆసుపత్రి వారు చిన్న పట్టణాల్లో కూడా బ్రాంచీలు పెడుతున్నారు. స్వంతంగా ప్రాక్టీసు పెట్టుకోవడానికి డబ్బులు లేని డాక్టర్లను జీతానికి పెట్టుకుంటున్నారు. కోటి రూపాయలు ఖర్చు చేసి డిగ్రీ పొందిన డాక్టరుకి నెలకు రూ.20 వేల నుండి రూ.లక్ష వరకు జీతంతో ఉద్యోగం ఇస్తున్నారు. నెలకి ఇన్ని పరీక్షలు రాయాలి, ఇన్ని ఆపరేషన్లు చేయాలని టార్గెట్లు ఫిక్స్ చేస్తున్నారు. రోగులందరికి ఎక్కువ పరీక్షలు చేయకపోతే, ఎక్కువ ఆపరేషన్లు చేయకపోతే, ఎక్కువ మందులు రాయకపోతే కార్పొరేట్ హాస్పిటల్‌లో డాక్టర్ల ఉద్యోగాలకు గ్యారంటీ లేదు. కేసులు తెచ్చినవారికి పెద్ద మొత్తంలో కమీషన్ ఇస్తున్నారు. వైద్యంలో అంతర్లీనంగా ఉన్న మానవత్వం మంట కలిసిపోయింది. డాక్టర్‌కి రోగికి మధ్య డబ్బులు ప్రవేశించాయి.
ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్ధితి అధ్వానంగా వుంది. ప్రభుత్వం ప్రజారోగ్యంపై పెట్టే శ్రద్ధ తగ్గిపోతున్నది. డాక్టర్ల పోస్టులు భర్తీ కావు. డాక్టర్లు వుండరు. అత్యవసర మందులుండవు. ఎక్సరే, స్కానింగ్ మెషిన్లు పనిచేయవు.
భారత రాజ్యాంగంలోని 21, 47 ఆర్టికల్స్ ప్రకారం ఆరోగ్యం ప్రాథమిక హక్కు. అయినా ప్రభుత్వం వైద్యం అందించలేక ప్రైవేటు ఆసుపత్రులు, కార్పోరేట్ ఆసుపత్రుల వైపు దారి చూపిస్తున్నది.
మన దేశంలో 1947వ సంవత్సరంలో సగటు జీవిత కాలం 32 సంవత్సరాలు వుండేది. 1951లో 37.2, ఇపుడు సగటున 70 సంవత్సరాలకు మించే వున్నది. చదువు, శుభ్రత, చైతన్యం, శాస్త్రీయ విజ్ఞానం, ఆహార లభ్యత, వైద్యం అభివృద్ధి చెందడం వలన మరణాలను వాయిదా వేయగల్గుతున్నారు.
వైద్య పరికరాల రేట్లను అడ్డగోలుగా పెంచుకుంటూ పోతున్న కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ లేదు. నాసిరకం మందులు, నకిలీ మందులను అరికట్టని ప్రభుత్వాన్ని ఏమీ చేయలేని స్ధితిలో ప్రజలున్నారు. పేటెంట్ పేరున మందుల ధరలు విపరీతంగా పెంచుకుంటూ పోతున్న కంపెనీలను అదుపు చేసే వాళ్ళూ లేరు. టన్నులలో ముడి మందును కొని మిల్లీ గ్రాములలో మందును తయారు చేసి భారీ లాభాలను సంపాదిస్తున్న కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహాలిస్తున్నది.
వైద్యంలో అశ్రద్ధ చూపించిన డాక్టర్లను విచారించాల్సిందే. సమర్ధమైన వైద్య, సాంకేతిక బృందం ద్వారా విచారణ జరపాలి. నిర్లక్ష్యం నిరూపితమైతే తగిన శిక్ష విధించాల్సిందే. అయితే అశ్రద్ధ గురించి నిరూపణ కాక ముందే శిక్ష వేయటం న్యాయం కాదు. ప్రతి మరణానికి డాక్టర్‌ని బాధ్యుడిని చేయటం వలన వైద్య వృత్తిపై ప్రేమతో, రోగులను శ్రద్ధతో, గౌరవంతో, మానవత్వంతో చూసే వైద్యులు కూడా ప్రజలకు దూరం అవుతారు. మనకెందుకు రిస్క్ అని డిఫెన్సివ్ ప్రాక్టీస్ చేసినందువలన రోగులకు ఖర్చు మరింత పెరుగుతుంది. పేదరికానికీ, అనారోగ్యానికీ కారణమైన ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించి...అందరికీ ప్రభుత్వమే వైద్యం అందించేలా ప్రజలు పోరాడాలి.
ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత. కానీ 142 కోట్లకు పైగా జనాభా కలిగిన మన దేశంలో ప్రజారోగ్యానికి ఖర్చు పెడుతున్నది జిడిపిలో 1.35 శాతం మాత్రమే అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పేద దేశమైనటువంటి క్యూబా తన జాతీయ ఆదాయంలో 12 శాతం ప్రజారోగ్యం కోసం ఖర్చు పెడుతుంది. బ్రిటన్, అమెరికా, స్వీడన్, జపాన్, జర్మనీ తదితర దేశాలు తమ జిడిపిలో పది శాతానికి పైగా ఖర్చు పెడుతున్నాయి. మన దేశంలో అందరికీ ఆరోగ్యం అనేది అందని కలగానే మిగిలిపోతున్నది.
డాక్టర్లు , నర్సులు, సిబ్బంది, పరికరాలు, మందుల, కొరత తీవ్రంగా ఉంది. నర్సింగ్ విభాగంలో 86,000 మంది సిబ్బంది కొరత ఉందని భారత నర్సింగ్ మండలి అంచనా. రిటైర్ అయిన స్థానాలలో ఉద్యోగులను నియమించటంలేదు. సుదీర్ఘ పనిగంటలు వారికి మరింత భారం అవుతున్నాయి. అందువల్ల వైద్యంలో నాణ్యత లోపిస్తున్నది. 703 మెడికల్ కాలేజీలున్నాయి. ప్రతి సంవత్సరం 90,000 మంది డాక్టర్లవుతున్నారు. 733 ఆయుష్ మెడికల్ కాలేజీలలో 53,000 ఆయుష్ డాక్టర్లగా వస్తున్నారు. అయినా మనకు డాక్టర్ల సంఖ్య తక్కువగానే ఉంది.
మనకు వెయ్యి మంది జనాభాకి 2.6 అంటే ముగ్గురు కూడా లేరు. అదే క్యూబాలో వెయ్యి మంది జనాభాకి 8.4 దాదాపు 9 మంది ఉన్నారు. ఆ దేశంలో డాక్టర్లందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పని చేస్తారు. వైద్యులంతా ప్రజలందరికీ అందుబాటులో ఉండటమే క్యూబా ప్రత్యేకత. బ్రిటన్‌లో కూడా డాక్టర్లందరూ ప్రభుత్వంలోనే పనిచేస్తారు. కానీ అమెరికాలోనూ, ఇండియాలోనూ, జపాన్ లోను డాక్టర్లు ఎక్కువ మంది ప్రైవేట్ ప్రాక్టీస్ లోనే వుండటం వలన పేద ప్రజలకి అందుబాటులో ఉండరు.
పట్టణాలలో ఎక్కువమంది డాక్టర్లు, స్పెషలిస్టులు ఉన్నారు. వీధివీధికీ డాక్టర్లు చాలా మంది ఉన్నారు. హాస్పిటళ్లు చాలా ఉన్నాయి. అయితే వైద్యం చేయించుకునే తాహతు ఎక్కువమంది ప్రజలకు లేదు. నూటికి 99 మంది దగ్గర ఆ స్థాయి వైద్యం చేయించుకోవడానికి డబ్బులుండవు. వ్యవసాయ కుటుంబ నెలసరి ఆదాయం రూ.10,218. పది వేల రూపాయల ఆదాయంతో వైద్య ఖర్చులు భరించే పరిస్ధితి లేదు. కోటి రూపాయలు ఖర్చు చేసి డాక్టర్ పట్టా పొందిన డాక్టర్లు ఫీజు ఇవ్వకపోతే చూడరు.
డబ్బుల ప్రమేయం లేకుండా అత్యుత్తమ ప్రపంచ స్ధాయి ఆధునిక వైద్యాన్ని ప్రజలందరికీ అందిస్తున్న దేశం క్యూబా. పైసలతో ప్రమేయం లేకుండా జనాభాకు వైద్యం అందించే దేశాలలో బ్రిటన్, కెనడా, జర్మనీ లాంటి దేశాలు కూడా వున్నాయి. అడవులు, కొండల ప్రాంతం-ఎక్కడైనా ప్రేమతో వైద్యం చేసే క్యూబా డాక్టర్లు వున్నారు. సీయరామేస్ట్రా అడవులలో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజల మధ్య డాక్టర్ నివసించటం ప్రత్యక్షంగా చూశాను. జీవన సూచికలలో అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకన్నా ముందుంది. దేశం చిన్నదైనా దృఢ దీక్షతో ఏ దేశ ప్రజలకు విపత్తు సంభవించినా తన డాక్టర్లను పంపి ప్రాణ సహాయం చేస్తున్నది. అంటువ్యాధి ఎబోలా సోకిన రోగులకు వైద్యం చేయటానికి అమెరికాతో సహా అందరూ నిరాకరించారు. అయినా క్యూబా డాక్టర్లు ధైర్యంగా ఎబోలా రోగ బాధితులను కాపాడి ఆదర్శంగా నిలిచారు. కరోనా వైరస్ నుండి రక్షణకు వైద్యం చేయటమే కాక వ్యాక్సిన్ కనుక్కొని లాటిన్ అమెరికా దేశాలకు చౌకగా అందించారు. ప్రపంచంలో ప్రజలకు డాక్టర్ అందుబాటులో ఉండే దేశాలలో క్యూబా ప్రథమం. సామాజిక కర్తవ్యంగా వైద్యం చేస్తున్న అక్కడి డాక్టర్లకు జేజేలు. అందుకు పునాదులు వేసిన డా. చే గువేరా మనందరికీ స్ఫూర్తిప్రదాత.
/ వ్యాసకర్త సెల్ : 9000657799 /
/ జులై1 'డాక్టర్స్ డే' /
డా||. కొల్లా రాజమోహన్