Jul 28,2022 06:22

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు, ప్రాణ త్యాగాల ఫలితంగా రోజుకు ఎనిమిది గంటల పని దినాన్ని సాధించున్నాం. ఇప్పుడు ఆ హక్కుకు తూట్లు పొడుస్తూ మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను తిరగరాస్తున్నది. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కొత్త లేబర్‌కోడ్‌లను అమలు చేయాలని చూస్తున్నది. వేతనాల కోడ్‌, పారిశ్రామిక సంబంధాల కోడ్‌, సామాజిక భద్రతా కోడ్‌, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌ అనే నాలుగు కోడ్‌ల ద్వారా కార్మిక హక్కులను కాలరాయనుంది.
గతంలో నెలకు 50 గంటలు ఉండే ఓవర్‌ టైం, ఇప్పుడీ కొత్త కోడ్‌ అమలు వలన 125 గంటల వరకు పెరిగే అవకాశం ఉంది. ఓటీ చేసేందుకు కార్మికుడి అనుమతి కూడా అవసరం లేదు. ఓటీ ఎన్ని గంటలు చేయించుకోవచ్చుననే విషయంపైన కూడా ఎటువంటి నిబంధనలు లేవు. కార్మికులతో అదనపు పనిగంటలు చేయించుకోవడానికి సంస్థల యాజమాన్యాలకు పూర్తి హక్కులు ఈ కొత్త కోడ్‌ ఇస్తుంది. దీని వలన సంస్థకు కార్మికులు కట్టు బానిసలయ్యే ప్రమాదం ఉంది. కొత్త కోడ్‌ అమలైతే కార్యాలయ పని వేళలు మార్చుకోవడానికి కంపెనీ యాజమాన్యాలకు వీలుంటుంది. కార్యాలయ పని గంటలను రోజుకు 12 గంటల వరకు పెంచుకోవచ్చు. పాత చట్టంలో 8 గంటల పనిదినం అమలులో ఉన్నప్పుడే వివిధ రంగాలలో పది, పన్నెండు, పదహారు గంటలను అమలు చేస్తూ కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయి యాజమాన్యాలు. ఇప్పుడు చట్టబద్ధంగానే పన్నెండు గంటలు గనక అమలైతే కార్మికులు తీవ్రమైన శ్రమదోపిడీకి గురవ్వడమే కాకుండా అనారోగ్యం పాలవుతూ త్వరగా ముసలితనానికి లోనయ్యే ప్రమాదం ఉంది.
భవిష్య నిధికి కార్మికుడు జమ చేసే మొత్తం పెరుగుతుంది. అంతే స్థాయిలో యజమాని కూడా జమ చేయాలి. కానీ, ఈ నిబంధన వలన కొందరు ఉద్యోగులకు మరీ ముఖ్యంగా ప్రయివేటు రంగం ఉద్యోగులకు చేతికి వచ్చే శాలరీ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం కార్మికులకు న్యాయమైన వేతనాలు నిర్ణయించి ఇస్తే బేసిక్‌ చేతికి వచ్చే వేతనం కూడా పెరుగుతుంది. కానీ ఇప్పటికే చాలా సంస్థలలో పీఎఫ్‌ కట్‌ చేసి కార్మికుడి వాటాకు యాజమాని జమ చేయవలసిన వాటాను జమ చేయకపోగా కార్మికుడి వాటానే దోచుకునే స్థితి ఉంది. కాబట్టి కేంద్రం చేస్తున్న వాదన ఆచరణలో చూడాలి.
విదేశీ పెట్టుబడుల రాకకు ఆటంకంగా ఉన్న నిబంధనలను తొలగించేందుకు కేంద్రం సిద్ధం అయింది. పాత చట్టం ప్రకారం ఫ్యాక్టరీలో విద్యుత్తును ఉపయోగిస్తూ 10 మందికి పైగా కార్మికులు పని చేసినా లేదా విద్యుత్తును ఉపయోగించకుండా 20 మంది కార్మికులు పని చేసినా ఆ సంస్థకు కార్మిక చట్టాలను వర్తింపజేయవలసి ఉండేది. ఇప్పుడు ఈ కార్మికుల పరిమితులను 10 నుండి 20కి, 20 నుండి 40 మందికి పెంచారు. ఫలితంగా చిన్న పరిశ్రమలలో కార్మికులు చట్ట పరంగా ఆరోగ్యం, భద్రత, సంక్షేమ పథకాలకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఏ సంఘానికైనా కార్మికుల డిమాండ్ల పైన యాజమాన్యంతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉండేది. పాత చట్టం ప్రకారం యూనియన్లను యాజమాన్యం గుర్తించాలన్న నిబంధన లేదు. కానీ, కొత్త నిబంధనల ప్రకారం పరిశ్రమలలోని కార్మికులలో 51 శాతం లేదా అంతకంటే ఎక్కువ సభ్యత్వం ఉన్న సంఘాన్నే గుర్తింపు సంఘంగా పరిగణిస్తారు. ఇతర సంఘాలను పట్టించుకోరు. 51 శాతం గుర్తింపు నిబంధన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలోనే పెట్టనప్పుడు కార్మిక సంఘాలకే ఎందుకు? అలా అయితే 37 శాతం ఓటింగ్‌ వచ్చిన నేటి బీజేపీ ప్రభుత్వానికి ప్రజలను పాలించే హక్కుందా?
పాత కార్మిక చట్టాలను సడలించడం వలన పని గంటలు మార్చుకోడానికి యాజమాన్యానికి అనుమతులివ్వడం, ఉద్యోగ భద్రతకు కార్మిక సంఘాలు అవసరం అన్న నిబంధనలు నిలిపివేయడం, తప్పనిసరిగా రిజిష్టర్ల నిర్వహణకు మినహాయింపులు వంటివి అమలులోకి రానున్నాయి. కొత్త ఇండిస్టియల్‌ రిలేషన్‌ కోడ్‌ ప్రకారం కార్మికులను పని నుండి సులభంగా తొలగించవచ్చు. 300 మంది కార్మికులతో ఉన్న పరిశ్రమలు ప్రభుత్వ అనుమతి లేకుండా కార్మికులను 'హైర్‌ అండ్‌ ఫైర్‌' (అవసరమైనప్పుడు కార్మికుడిని తీసుకొని అక్కర్లేనప్పుడు తొలగించే పద్ధతి) చేయొచ్చు లేదా ప్లాంటును మూసేసుకోడానికి అనుమతి పొందవచ్చు. ఈ హైర్‌ అండ్‌ ఫైర్‌ విధానం ఉద్యోగాల భద్రతను ప్రమాదంలోకి నెట్టివేసింది.
ఫ్యాక్టరీల చట్టం, గనుల చట్టం, డాక్‌ వర్కర్‌, బిల్డింగ్‌ వర్కర్‌, ఇరత నిర్మాణ కార్మికుల ఉపాధి, పని నియమాల క్రమబద్ధీకరణ, సినీ వర్కర్స్‌ అండ్‌ సినీ థియేటర్స్‌ వర్కర్స్‌ యాక్ట్‌ తదితర పాత చట్టాల ప్రకారం కార్మికులకు తాము పని చేస్తున్న పరిశ్రమలలోని ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పని భద్రత, ఆరోగ్యం, సంక్షేమ పథకాలు అమలయ్యేవి. కానీ పని పరిస్థితుల కోడ్‌ ద్వారా ఇప్పుడు చేస్తున్న పనితో సంబంధం లేకుండా అన్ని రంగాల కార్మికులను ఒకే గూడు కిందికి తెచ్చారు. గత చట్టాల ప్రకారం కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉండేది. ఇప్పుడు కొత్త కోడ్‌ ప్రకారం ప్రమాదాలకు కార్మికులను కూడా బాధ్యులను చేస్తారు. ప్రమాదానికి కార్మికుడు కూడా కారణమని నిర్ధారిస్తే రూ. పది వేలు జరిమానా, జైలు శిక్ష కూడా విధిస్తారు.
కార్మిక చట్టాలలో సమ్మె హక్కును కఠినతరం చేయడం అత్యంత దుర్మార్గం. పాత చట్టం సమ్మె చేయడానికి 14 రోజులు ముందుగా సమ్మె నోటీసు ఇవ్వాలని చెప్తుంటే...కొత్త పారిశ్రామిక సంబంధాల కోడ్‌ 14 రోజుల కాలవ్యవధిని 60 రోజులకు పెంచింది. దీని వలన సహజంగానే రాజీ బేరాలు మొదలౌతాయి. అంతేకాకుండా కొత్త కోడ్‌ వలన యాజమాన్యానికి ట్రిబ్యునల్‌కు వెళ్ళే సదుపాయం కల్పించింది. దీని వలన కేసు ట్రిబ్యునల్‌లో ఉన్నంత కాలం కార్మికులు సమ్మెకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. కార్మికులను అనధికారికంగా పనిలోకి తీసుకోవడం, కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవడం, క్యాజువల్‌ క్యాటగిరిలో తీసుకోవడం వంటి పద్ధతులను కొత్త చట్టాలు ప్రోత్సహిస్తున్నాయి. కార్మికులు సంఘటితం కావడానికి, సంఘం పెట్టుకోవడానికి గల హక్కులను కూడా కొన్ని ఆంక్షలు, పరిమితులకు లోబడి ఉండేలా కొత్త చట్టాల పనితీరు ఉంది. దేశంలో మోడీ విధానాల కారణంగా ఇబ్బందులు పడుతున్న దేశ రైతాంగం... రైతాంగ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టింది. మోడీ చేత క్షమాపణలు చెప్పించుకుంది. నేడు దేశ కార్మిక వర్గం ముందు కూడా ఇదే సవాలు ఉంది.

- కాసు మాధవి,
సెల్‌: 9492585106